
యువత.. ఆశలు కోల్పోతుందా?
దశాబ్దాలుగా మనం ఒక ఒప్పందం ప్రకారం జీవిస్తున్నాం. "ఈ రోజు కష్టపడితే, రేపటి రోజు సుఖపడుతారు”. కోట్లాది మందిని ముందుకు నడిపించిన ఒక ఆశాజనకమైన నినాదం అది. ప్రతి చెమట చుక్క, జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి హామీ ఇస్తుందని నమ్మారు. కానీ ఈ రోజు జెన్ జీ(1996 నుంచి 2005 మధ్య పుట్టిన వాళ్ళు), మిలీనియల్స్(1981 నుంచి 1995 మధ్య పుట్టిన వాళ్ళు) కళ్లల్లోకి చూడండి, మీకు ఆశ కనిపించదు. వారిలో ఒక లోతైన, నిరాశతో కూడిన సందేహం కనిపిస్తుంది. వీరు కష్టపడి పనిచేసేవారు, బాగా చదువుకున్నవారు. అయినా అప్పులు, ఇల్లు కొనలేని ధరలు, అన్యాయంతో కూడిన వ్యవస్థ వారి భవిష్యత్తుకు అడ్డుగా నిలుస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక సంక్షోభం మాత్రమే కాదు. ఇది నమ్మక ద్రోహం. సమాజం నమ్మిన వాగ్దానం కూలిపోయినప్పుడు, దాని ప్రభావం చాలా భయంకరంగా ఉంటుంది, ఇది అపనమ్మకం, ఆందోళన, భయంకరమైన ఒంటరితనానికి దారితీస్తుంది. ఈ నమ్మకద్రోహం కేవలం వారి బ్యాంక్ ఖాతాలను మాత్రమే కాదు. మన సమాజం మనతో ఆడుతున్న ఆట నియమాలు పూర్తిగా మారిపోయాయని, తాము గెలవలేని యుద్ధంలో పోరాడుతున్నామని ఒక తరం యువత గ్రహించిన విషయం ఇది.
తరతరాలుగా మనకు చెప్పిన మాట ఒక్కటే, కష్టపడి పని చేయండి, అంకితభావంతో ఉండండి, జీవితంలో తప్పక పైకి వస్తారు. అవకాశాలకు, విజయాలకు ఇదే మూలమని నమ్మారు. కానీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువతకు, ఆ మాట కేవలం ఒక బూటకపు వాగ్దానంగా అనిపిస్తోంది. ఈ నమ్మకద్రోహం కేవలం వారి బ్యాంక్ ఖాతాలను మాత్రమే కాదు, వారి ఆశను, మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తోంది.
ప్యూ రీసెర్చ్ సెంటర్, డెలాయిట్ గ్లోబల్ 2025 జెన్ జీ, మిలీనియల్ సర్వే నుండి వచ్చిన నివేదికలు ఒక బాధాకరమైన విషయాన్ని వెల్లడిస్తున్నాయి: కష్టపడి పనిచేస్తే జీవితంలో పైకి రాగలం అనే నమ్మకం చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి పడిపోయింది. యువ ఉద్యోగులు జెన్ జీ మిలీనియల్స్ ఎంత కష్టపడుతున్నా, అప్పులు, ఉద్యోగ భద్రత లేమి, పెరిగిన ధరల కారణంగా వ్యవస్థ తమకు వ్యతిరేకంగా ఉందని భావిస్తున్నారు.
కళ్ళ ముందున్న అడ్డంకులు
ఇది వారికి ఆశయం లేకపోవడం వల్ల కాదు. డెలాయిట్ సర్వే ప్రకారం, ఈ తరం యువత 'డబ్బు, అర్థవంతమైన పని, శారీరక, మానసిక ఆరోగ్యము' అనే మూడు అంశాలను చాలా ముఖ్యమైనవిగా చూస్తున్నారు. వారు నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. అయినప్పటికీ, వారు వ్యవస్థాపరమైన అడ్డంకులతో కూడిన అదృశ్య గోడను నిరంతరం ఢీకొంటున్నారు. ఇది జెన్ జీ మిలీనియల్స్‌లో దాదాపు సగం మందిని వెంటాడుతున్న పెద్ద భయం
పెరుగుతున్న జీవన వ్యయం
చదువు కోసం చేసిన అప్పులు, ఇల్లు కొనలేని ధరలు, స్థిరత్వం లేని ఉద్యోగాల కారణంగా వాళ్ళు కష్టపడుతున్నారు. దాదాపు సగం మంది యువత తమకు ఆర్థిక భద్రత లేదని, నెలవారీ జీతం కోసం ఎదురుచూడాల్సి వస్తుందని చెబుతున్నారు.
ఆశ చనిపోతే ఏం జరుగుతుంది?
నిరంతర ఆర్థిక అభద్రత వల్ల మనసుకు చాలా నష్టం జరుగుతుంది. కష్టపడినా ఫలితం ఉండదని తెలిసినప్పుడు, ఆశ చచ్చిపోతుంది. ఆర్థిక భద్రత లేకపోవడం సంతోషాన్ని తగ్గిస్తుంది. 80 శాతానికి పైగా యువత తమ రోజువారీ ఆర్థిక విషయాలు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తీవ్రమైన మానసిక ఒత్తిడి (స్ట్రెస్) ఆందోళన (అంక్సియటీ)కు గురవుతున్నారని సర్వే చెబుతోంది.
ఎంత కష్టపడినా అక్కడే ఉండిపోతున్నామనే భావన వారి ఉత్సాహాన్ని దెబ్బతీస్తుంది. ఇది అపనమ్మకాన్ని పెంచుతుంది. వారిని చిన్న ఆలోచనల వైపు నెట్టివేస్తుంది, తోటివారితో సంబంధాలు తగ్గిస్తుంది. ఒంటరితనం, నిరాశకు దారితీస్తుంది. అందుకే, మంచి అవకాశం కోసం పోరాడటం అనేది, మానసిక ఆరోగ్యం, మానవ సంబంధాల కోసం పోరాటం కూడా అవుతుంది.
మానవ సంబంధాలే ఆధారం
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం వ్యవస్థలో మార్పులు తీసుకురావడంతో పాటు, వ్యక్తిగత స్థాయిలో మానవ స్పర్శను పెంచడం కూడా అవసరం. యువతకు నిజమైన మద్దతు కావాలి. అనుభవజ్ఞులైన వారి నుండి మార్గదర్శకత్వం (మెంటార్షిప్) కమ్యూనికేషన్, సానుభూతి (ఎంపథీ), నాయకత్వం వంటి సాఫ్ట్ స్కిల్స్ ఎంత ముఖ్యమో వారు గుర్తిస్తున్నారు.
భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్న ప్రపంచంలో, మానవ సంబంధాలు మాత్రమే సురక్షితమైన పెట్టుబడి. మనం ఒకరికొకరం సహాయం చేసుకుంటూ, మార్గదర్శకత్వం ఇచ్చుకుంటూ, బలమైన, మద్దతునిచ్చే సామాజిక వర్గాలను నిర్మించుకోవడం ద్వారా, నిరాశ ప్రభావాలను ఎదుర్కోవచ్చు. వ్యవస్థ సరిగా లేకపోయినా, మనం ఒంటరిగా లేమనే నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
