
యువతను విస్మరిస్తే మరో తిరుగుబాటు తప్పదు: నేపాల్ ప్రధాని సుశీలా కార్కి
నేపాల్‌లో యువతలో గూడుకట్టుకున్న అసంతృప్తిని సకాలంలో పరిష్కరించకపోతే దేశం మరో ప్రజా తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ దేశ మధ్యంతర ప్రధానమంత్రి సుశీలా కార్కి హెచ్చరించారు. గురువారం కాఠ్మాండూలోని నేపాలీ ఆర్మీ పెవిలియన్‌లో జరిగిన 76వ ప్రజాస్వామ్య దినోత్సవ వేడుకల్లో ఆమె ప్రసంగించారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదని, అది పౌరుల హక్కులను కాపాడుతూ జవాబుదారీతనంతో కూడిన ఫలితాలను ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు.
అవినీతి, వివక్షపై యువత ఆగ్రహం
గతేడాది సెప్టెంబర్‌లో 'జెన్-జెడ్' యువత ఆధ్వర్యంలో జరిగిన భారీ నిరసనలను ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దించిన ఆ ఉద్యమం.. అవినీతి, బంధుప్రీతి, వివక్షకు వ్యతిరేకంగా సాగిందని ఆమె విశ్లేషించారు. యువతలో అపారమైన శక్తి, మార్పు కోసం తపన, నైతిక ఆగ్రహం ఉంటాయని.. వారిని విస్మరించి ఏ దేశం అభివృద్ధి చెందలేదని కార్కి పేర్కొన్నారు. రాజ్యాంగంలో సమానత్వం అని రాసుకున్నా, ఆచరణలో వివక్ష కొనసాగడం వల్లే ప్రజల్లో అసంతృప్తి పెరిగి తిరుగుబాటుకు దారితీసిందని ఆమె విచారం వ్యక్తం చేశారు.
రాజరికం వైపు మాజీ రాజు సైగలు?
ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా మాజీ రాజు జ్ఞానేంద్ర విడుదల చేసిన వీడియో సందేశం ఇప్పుడు నేపాల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దేశం ప్రస్తుతం అసాధారణ సంక్షోభంలో ఉందని, సార్వభౌమాధికారానికి ముప్పు పొంచి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించకుండా ఎన్నికలకు వెళ్తే మరిన్ని గొడవలు జరుగుతాయని ఆయన హెచ్చరించారు. మార్చి 5న జరగబోయే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే, దేశంలో మళ్లీ రాజరికాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌ను ఆయన పరోక్షంగా తెరపైకి తెచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కీలక మలుపులో నేపాల్ రాజకీయాలు
నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కూడా ప్రజాస్వామ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. సుస్థిర శాంతి, సుపరిపాలన ద్వారా దేశం అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షించారు. 104 ఏళ్ల రాణా వంశ పాలనను అంతం చేసిన 1950 విప్లవాన్ని ప్రజలు ఎన్నటికీ మరువకూడదని ఆయన పిలుపునిచ్చారు. కాగా, గతేడాది ప్రాణనష్టం కలిగించిన నిరసనల తర్వాత మార్చి 5న నేపాల్ ప్రతినిధుల సభకు తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని కార్కి చేసిన హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
