
యువతకు సువర్ణావకాశం..200 మందికి మూడేళ్లపాటు ఉచిత సివిల్స్ శిక్షణ
రాష్ట్రంలో ప్రతిభావంతులైన యువతకు సివిల్స్‌లో ఉన్నత స్థాయి శిక్షణ అందించేందుకు మరో విశిష్ట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 200 మంది అభ్యర్థులకు మూడేళ్లపాటు ఉచిత వసతి, భోజన సదుపాయాలతో సివిల్స్ శిక్షణ అందించే కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ బ్రోచర్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, సమాచార శాఖ మంత్రి పార్థసారధి సచివాలయంలో విడుదల చేశారు.
చలసాని బలరామ ప్రసాద్ (సీబీఆర్) అకాడమీ ఆధ్వర్యంలో ఎంపిక కాబోయే 200 మంది అభ్యర్థులకు పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో 100 మంది అమ్మాయిలు ఉండడం విశేషం. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ పరీక్షల ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్-1, గ్రూప్-2 తదితర ఉద్యోగాలకు అభ్యర్థులను సన్నద్ధం చేయడమే లక్ష్యమని డాక్టర్ లక్ష్మయ్య (ఐఏఎస్ స్టడీ సర్కిల్) తెలిపారు.
ఎంపిక ప్రక్రియలో భాగంగా వచ్చేనెల 15న అమ్మాయిలకు, ఏప్రిల్ 5న అబ్బాయిలకు విడివిడిగా రాతపరీక్షలు నిర్వహించనున్నారు. రాతపరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి మౌఖిక పరీక్షలు నిర్వహించి, ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
విజయవాడ, వినుకొండలో శిక్షణ కేంద్రాలు
అమ్మాయిలకు విజయవాడలోని కేంద్రంలో అబ్బాయిలకు వినుకొండలోని కేంద్రంలో శిక్షణ అందించనున్నారు. ప్రముఖ సామాజిక సేవకుడు చలసాని బలరామ ప్రసాద్ అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పించనుండగా డాక్టర్ లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఉచితంగా శిక్షణ అందిస్తుంది. ఒక్కో అభ్యర్థికి మూడేళ్లపాటు సుమారు రూ.10 లక్షల వరకు వ్యయం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, వరదరాజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
