
యువగళం…ప్రజలతో మమేకమైన రాజకీయ ఉద్యమం: లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మలుపు తిప్పిన నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ "ఈ యాత్ర కేవలం నడక కాదు.. నా జీవితాన్ని మార్చిన అద్భుత ప్రయాణం. ఇది ఏపీ రాజకీయ చరిత్రలో ఒక నిర్ణాయక ఘట్టం" అని ఆయన పేర్కొన్నారు.
2023 జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర, రాష్ట్రవ్యాప్తంగా 4,000 కిలోమీటర్ల మేర సాగాలని ప్రణాళిక రూపొందించారు. అయితే 226 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో లోకేష్ 3,100 కిలోమీటర్లకు పైగా నడిచి, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ఈ ప్రయాణం తన రాజకీయ దృక్పథాన్ని బలపరిచిందని పేర్కొంటూ రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, చేనేత కార్మికులు, వృద్ధులు, అణగారిన వర్గాల సమస్యలను దగ్గరగా తెలుసుకునే అవకాశం కల్పించిందని లోకేష్ తెలిపారు.
పాదయాత్రను స్మరించుకుంటూ తల్లులు, అక్కాచెల్లెళ్ల ఆశీర్వాదాలు తనకు శక్తినిచ్చాయని అదేవిధంగా ప్రజలు నిజాయితీగా తమ సమస్యలు వెల్లడించారని పేర్కొన్నారు. ప్రజల కష్టాలు, ఆశయాల ఆధారంగానే తన రాజకీయ ప్రయాణం రూపుదిద్దుకుందని ప్రజల జీవితాలను కేంద్రంగా చేసుకుని విధానాలు రూపొందించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు యువగళం’ పాదయాత్ర నేటితో మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ప్రజలతో ప్రత్యక్ష సంభాషణకు కొత్త దారులు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ గ్రామీణ హామ్లెట్ల నుంచి పట్టణ కేంద్రాల వరకు విస్తృతంగా ప్రజలను కలిసినట్లు పేర్కొన్నారు.
ఈ పాదయాత్ర లక్ష్యాలను నిర్దేశించుకుని సాగిన ప్రజా ఉద్యమమని వ్యూహాత్మక ప్రాంతాల్లో కీలక మైలురాళ్లను చేరుకుంటూ ప్రతి దశలో ప్రజలతో సమావేశాలు నిర్వహించి, సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చామని రోజుకు సగటున 10 నుంచి 12 కిలోమీటర్లు నడిచి ప్రజలను కలిసిన లోకేష్, రాజకీయ, లాజిస్టిక్ సవాళ్లను అధిగమిస్తూ యాత్రను కొనసాగించారని ప్రజలతో నిరంతర సంభాషణే ప్రభావవంతమైన నాయకత్వానికి పునాది అన్న సందేశాన్ని యువగళం పాదయాత్ర స్పష్టంగా చాటిందని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. కాగా 2024 ఎన్నికలకు ముందు ముగిసిన ఈ పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో, టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో 164 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్‌సభ స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది.
