Let's talk: editor@tmv.in
యునెస్కో తాత్కాలిక జాబితాలో ఒడిశాలోని మూడు బౌద్ధ క్షేత్రాలు

యునెస్కో తాత్కాలిక జాబితాలో ఒడిశాలోని మూడు బౌద్ధ క్షేత్రాలు

Pinjari Chand
25 జనవరి, 2026

ఒడిశాలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాలైన రత్నగిరి, లలితగిరి, ఉదయగిరి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల గుర్తింపు కోసం భారత్‌ సమర్పించిన తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకోవడంపై ఒడిశా ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఉప ముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రి ప్రవతి పరిడా ఈ సందర్భంగా స్పందిస్తూ ప్రాచీన జ్ఞానానికి ప్రతీకలైన రత్నగిరి, ఉదయగిరి, లలితగిరి ఇప్పుడు గ్లోబల్‌ గుర్తింపు వైపు అడుగులు వేయడం గర్వకారణమని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ఈ గుర్తింపు వారసత్వ సంరక్షణకు, సుస్థిర పర్యాటక అభివృద్ధికి కీలక మైలురాయిగా మారుతుందన్నారు. న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌ కూడా స్పందిస్తూ ఒడిశా డైమండ్‌ ట్రయాంగిల్‌గా ప్రసిద్ధి చెందిన ఈ మూడు బౌద్ధ క్షేత్రాలు యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరడం రాష్ట్రానికి, సంస్కృతి–వారసత్వానికి గర్వకారణం అని తెలిపారు.

అధికారిక వర్గాల ప్రకారం, 2025 డిసెంబర్‌ 22న భారత్‌ అవసరమైన పత్రాలను యునెస్కోకు సమర్పించగా, ఆపరేషనల్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండటంతో ఈ స్థలాలను తాత్కాలిక జాబితాలో చేర్చారు. రత్నగిరి, లలితగిరి, ఉదయగిరి బౌద్ధ ధర్మంలోని హీనయాన, మహాయాన, వజ్రయాన పంథాల వ్యాప్తికి సాక్ష్యంగా నిలిచిన ప్రాంతాలుగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఇక్కడ ఉన్న విహారాలు, స్తూపాలు, శిల్పాలు, శాసనాలు ఆసియా వ్యాప్తంగా బౌద్ధమత వ్యాప్తిలో ఒడిశా కీలక పాత్రను ప్రతిబింబిస్తున్నాయి. ఈ గుర్తింపుతో ప్రాంతంలో వారసత్వ పర్యాటకం, పరిశోధన, సంరక్షణ కార్యక్రమాలకు మరింత ఊతం లభిస్తుందని చరిత్రకారుడు అనిల్‌ ధీర్‌ తెలిపారు.

యునెస్కో తాత్కాలిక జాబితాలో ఒడిశాలోని మూడు బౌద్ధ క్షేత్రాలు - Tholi Paluku