
యుద్ధ వీరులకు విజయ్ దివస్ లో ఘననివాళి
1971 భారత–పాకిస్తాన్ యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు 54వ విజయ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా నివాళులర్పించారు. వారి ధైర్యం, త్యాగం, దేశభక్తిని స్మరించుకుంటూ భారత సాయుధ దళాల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేశారు. 1971 యుద్ధం భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించడమే కాకుండా బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారి తీసిందని ఆమె గుర్తుచేశారు. దేశ సార్వభౌమత్వం, గౌరవాన్ని కాపాడడంలో సైనికుల పాత్ర అపూర్వమని పేర్కొన్నారు.
విజయ్ దివస్ సందర్భంగా మాతృభూమి కోసం పోరాడిన ధీర సుపుత్రులకు నా వినమ్ర నివాళులు. వారి ధైర్యం, వీరత్వం, అపూర్వ దేశభక్తి దేశాన్ని గర్వంతో నింపాయి. వారి వీరగాథలు తరతరాల భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తాయి. విజయ్ దివస్ భారత సాయుధ దళాల అజేయ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని, 1971 యుద్ధంలో చేసిన త్యాగాలు దేశ స్మృతిలో శాశ్వతంగా నిలిచిపోతాయని రాష్ట్రపతి అన్నారు.
అదేవిధంగా, పహల్గామ్‌లో జరిగిన భయానక ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో భారత్ చేపట్టిన ప్రతీకార చర్య ‘ఆపరేషన్ సిందూర్’లో భారత సాయుధ దళాలు చూపిన ధైర్యసాహసాలను కూడా ఆమె గుర్తు చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు దళాలు ప్రదర్శించిన ప్రొఫెషనలిజం, సిద్ధత, దృఢ సంకల్పాన్ని ప్రశంసించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంలో ఆధునిక యుద్ధ సాంకేతికతల వినియోగాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
భారత సైన్యం చేపట్టిన ‘ఇండిజెనైజేషన్ ద్వారా సాధికారత’ కార్యక్రమం భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండాలనే సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందని ఆమె అన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో స్వయం ఆధారిత, వ్యూహాత్మక దృఢత, ఆధునిక యుద్ధ పద్ధతుల సమర్థ వినియోగం దేశానికి స్ఫూర్తి. సైనికులు, వారి కుటుంబాలకు నా శుభాకాంక్షలు. జై హింద్! అని ఆమె పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న విజయ్ దివస్‌ను జరుపుకుంటారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్ సేనలు లొంగిపోవడం, బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించడం ఈ రోజుకు ప్రత్యేకత. ఇది భారత సాయుధ దళాల ధైర్యం, క్రమశిక్షణ, వ్యూహాత్మక ప్రతిభకు స్మారక చిహ్నం.
ఇంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ కూడా 1971 యుద్ధంలో పోరాడిన సైనికులను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన ధైర్యవంతులైన సైనికుల త్యాగాలను ఈ రోజున స్మరిస్తాం. వారి అచంచల సంకల్పం దేశ చరిత్రలో గర్వకారణంగా నిలిచింది. వారి వీరత్వం తరతరాలకు స్ఫూర్తి అని ప్రధాని ఎక్స్ లో రాశారు. దేశవ్యాప్తంగా విజయ్ దివస్‌ను వివిధ కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. కోల్‌కతాలో భారత సైన్యం ఈస్టర్న్ కమాండ్ ఆధ్వర్యంలో మిలిటరీ టాటూ కార్యక్రమం నిర్వహించి సైనిక సంప్రదాయాలు, క్రమశిక్షణను ప్రదర్శించింది.
భారత సైన్యం సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ విముక్తి పోరాట చరిత్రను గుర్తు చేస్తూ విజయ్ దివస్ కేవలం ఒక తేదీ కాదు. 1971 యుద్ధంలో భారత సాయుధ దళాల చారిత్రాత్మక, నిర్ణయాత్మక విజయానికి ఇది ప్రతీక. ముక్తి బాహిని, భారత సాయుధ దళాలు భుజం భుజం కలిపి పోరాడి బంగ్లాదేశ్ స్వేచ్ఛకు దారి తీశాయని సైన్యం తెలిపింది. కేవలం 13 రోజుల్లోనే సుమారు 93,000 మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోవడం ప్రపంచ చరిత్రలో అతిపెద్ద సైనిక లొంగుబాట్లలో ఒకటిగా నిలిచిందని పేర్కొంది. అలాగే కాంగ్రెస్ నాయకులైన రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ తదితరులు సైనికులకు ఈ సందర్భంగా నివాళి అర్పించారు.
