
యుద్ధ విరమణలో పాకిస్థాన్ పాత్ర..మోడీ దౌత్యానికి పెద్ద దెబ్బ: కాంగ్రెస్
అమెరికా–ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించిందని వార్తలు రావడం ప్రధాని నరేంద్రమోడీ వ్యక్తిగత దౌత్య విధానానికి పెద్ద దెబ్బ అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తాను ప్రకటించుకునే ‘విశ్వగురు’ ఇమేజ్ పూర్తిగా బహిర్గతమైందని పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ మాట్లాడుతూ పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు – ఇరాన్ మరోవైపు జరిగిన ఘర్షణలో రెండు వారాల కాల్పుల విరమణ ప్రపంచానికి ఉపశమనం కలిగించినప్పటికీ, ఈ ఒప్పందంలో పాకిస్థాన్ పాత్ర మోడీ దౌత్యానికి తీవ్రమైన ఎదురుదెబ్బగా నిలిచిందన్నారు. ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన రెండు రోజులకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని, ఆ పర్యటన భారత అంతర్జాతీయ ప్రతిష్ఠను తగ్గించిందని ఆరోపించారు. ఇజ్రాయెల్ గాజాలో సృష్టించిన మారణహోమం, ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో విస్తరణ విధానాలపై మోడీ ఎప్పుడూ స్పందించలేదని ఆయన విమర్శించారు.
పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేయలేకపోయాం
జమ్మూ–కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరి చేసే ప్రయత్నం మోడీ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నా అది ఫలించలేదని జైరాం రమేష్ అన్నారు. అయితే మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం 2008 ముంబైపై దాడుల తర్వాత పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేసే విషయంలో విజయవంతమైందని ఆయన గుర్తు చేశారు. ఆర్థికంగా దివాళా తీసిన, విదేశీ సహాయంపై ఆధారపడే పాకిస్థాన్ ఈ స్థాయి పాత్ర పోషించడం మోడీ దౌత్య వ్యూహంపై ప్రశ్నలు తలెత్తిస్తోందన్నారు.
ఆపరేషన్ సింధూర్‌కూ ట్రంప్ క్రెడిట్ తీసుకున్నారు
ఇక 2025 మే 10న జరిగిన ‘ఆపరేషన్ సింధూర్’ను అకస్మాత్తుగా ఎందుకు నిలిపివేశారో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు వివరించలేదని కూడా ఆయన అన్నారు. ఆ నిర్ణయాన్ని మొదట ప్రకటించింది అమెరికా విదేశాంగ కార్యదర్శేనని, ఆ చర్యకు అమెరికా అధ్యక్షుడు అనేకసార్లు క్రెడిట్ తీసుకున్నారని ఆయన విమర్శించారు. అంతేకాదు, ఇజ్రాయెల్ దూకుడు చర్యలపై మోడీ మౌనం కూడా ఆయనలోని భయాన్ని చూపిస్తోందని విమర్శించారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ కూడా పశ్చిమ దేశాలపై విమర్శలు చేశారు. ఇరాన్ విషయంలో పాశ్చాత్య దేశాలు ఉపయోగించిన భాష ఖండించదగిందని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
