
యుద్ధ నీడలో ఈద్: లెబనాన్ శరణార్థి శిబిరాల్లో పండుగ పూట కన్నీటి గాథలు
సాధారణంగా రంజాన్ మాసం ముగిసే సమయంలో లెబనాన్ వీధులన్నీ కొత్త బట్టలు, స్వీట్లు, అత్తర్ సువాసనలతో కళకళలాడుతుంటాయి. కానీ, ఈ ఏడాది దృశ్యం పూర్తిగా భిన్నంగా ఉంది. ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య నెలకొన్న భీకర యుద్ధం కారణంగా లెబనాన్ సరిహద్దులు రక్తసిక్తమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు తమ సొంత ఇళ్లను, ఆస్తులను వదిలి ప్రాణరక్షణ కోసం సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. ఈద్ అల్-ఫితర్ పండుగ జరుపుకోవాలసిన తరుణంలో, సంబరాల కంటే రేపు ఏం జరుగుతుందో అన్న భయం ప్రజలను వెంటాడుతోంది. నిరంతరం బాంబుల మోతతో ప్రజలు భయం గుప్పిట్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నారు.
పండుగకు సిద్ధమవ్వాల్సిన చేతులు నేడు సహాయక శిబిరాల్లో పిడికెడు అన్నం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. సుమారు 10 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవ్వడం లెబనాన్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది.
దక్షిణ లెబనాన్ నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన లిలియన్ జమాన్ వంటి వేలాది మంది మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. సిడాన్ నగరంలోని ఒక పాఠశాల షెల్టర్‌లో తలదాచుకుంటున్న ఆమె మాట్లాడుతూ, "గతంలో ఈ సమయంలో నా కూతురికి కొత్త బట్టలు కొనేదాన్ని, ఇంటి నిండా స్వీట్లు ఉండేవి. కానీ ఇప్పుడు మాకు ఈద్ లేదు, సంతోషం లేదు" అని కన్నీరుమున్నీరయ్యారు. యుద్ధం కారణంగా ఏర్పడిన మానసిక ఒత్తిడి వల్ల చాలా మంది పవిత్ర రంజాన్ ఉపవాసాలను కూడా పాటించలేకపోయారు. ఇఫ్తార్ సమయంలో కుటుంబం అంతా కలిసి కూర్చుని విందు ఆరగించాల్సిన వారు, ఇప్పుడు తాత్కాలిక షెల్టర్లలో పక్కనే ఉన్న అపరిచితులతో కలిసి అరకొర ఆహారంతో ఆకలి తీర్చుకుంటున్నారు. పండుగ పూట కన్నవారిని, ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాల్లో విషాదం గడ్డకట్టింది.
ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సహాయక సంస్థల నివేదికల ప్రకారం, దేశవ్యాప్తంగా దాదాపు 1,30,000 మంది మాత్రమే ప్రభుత్వ గుర్తింపు పొందిన షెల్టర్లలో చోటు సంపాదించుకున్నారు. మిగిలిన లక్షలాది మంది వీధుల్లో, కార్లలో, అసంపూర్తిగా ఉన్న భవనాల్లో తలదాచుకుంటున్నారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలు, పిడుగుల ధాటికి టెంట్లలో ఉంటున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిల్లలు పండుగ బహుమతుల గురించి అడుగుతుంటే, తల్లిదండ్రులు కనీసం పడుకోవడానికి సరైన చోటు కూడా లేక సతమతమవుతున్నారు.
ఇంటర్నేషనల్ రెస్క్యూ కమిటీ ప్రతినిధి బాస్మా ఆలూష్ చెబుతున్న దాని ప్రకారం, షెల్టర్లలో ఉన్న పిల్లలందరి కోరిక ఒక్కటే, పండుగకి తమ సొంత ఇంటికి వెళ్లిపోవాలని, కానీ ఈ యుద్ధం వల్ల చిన్నారుల బాల్యం ప్రశ్నార్థకంగా మారింది.
ఈ విపత్కర పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహాయం అందిస్తున్నాయి. ప్రపంచ ఆహార కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఐదు లక్షల మందికి భోజనాలను అందజేసింది. స్థానిక వ్యాపారులు, సామాన్య ప్రజలు కూడా మానవత్వాన్ని చాటుకుంటున్నారు. సిడాన్ నగరంలో సెలూన్ నడుపుతున్న ఏమాన్ అబో ఖాద్రా వంటి వారు, పిల్లల ముఖాల్లో చిరునవ్వు చూడటానికి వారికి ఉచితంగా హెయిర్ కట్స్ చేస్తున్నారు. "పిల్లలకు యుద్ధం గురించి ఏం తెలుసు? వారికి పండుగ అంటే కొత్తగా కనిపించడం, సంతోషంగా ఉండటం. ఆ చిన్న ఆనందాన్ని ఇవ్వడానికే నా వంతుగా ఈ ప్రయత్నం చేస్తున్నాను" అని తెలిపారు. అయినప్పటికీ, అవసరాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మందులు, శిశువుల పాలు, శీతాకాలం కావడంతో వెచ్చని దుస్తుల కొరత లెబనాన్ వాసులను తీవ్రంగా వేధిస్తోంది.
లెబనాన్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం కేవలం యుద్ధానికే పరిమితం కాలేదు, దేశ ఆర్థిక వ్యవస్థను కూడా కుదిపేస్తోంది. 2024 నవంబర్‌లో జరిగిన తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో, మళ్ళీ యుద్ధం రావడం వారిని కోలుకోలేని దెబ్బ తీసింది.
ఐక్యరాజ్యసమితి అధికారి కార్ల్ స్కౌ హెచ్చరిస్తున్న ప్రకారం, ఈసారి అంతర్జాతీయ విరాళాలు మునుపటిలా రావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా ఉద్రిక్తతలు ఉండటంతో, దాతల దృష్టి మళ్లుతోంది. నిధుల కొరత వల్ల ఆహార సరఫరా ఆగిపోతే, లెబనాన్‌లో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం బాంబుల వల్లే కాకుండా, ఆకలి వల్ల కూడా ప్రాణాలు పోయే పరిస్థితి రాకూడదని మానవతావాదులు కోరుతున్నారు.
లెబనాన్ ప్రజల ఏకైక ఆశ శాంతి. బీరూట్ పాఠశాల హాల్‌వేలలో చిన్న చిన్న గ్యాస్ స్టౌవ్‌ల మీద వంటలు చేసుకుంటూ, గోడలకు పండుగ అలంకరణలు చేసుకుంటున్న వారు తమ పూర్వ వైభవం కోసం ఎదురుచూస్తున్నారు. "దేవుడు మా ప్రార్థనలు ఆలకించి, ఈ యుద్ధాన్ని ఆపాలి. మేము తిరిగి మా పొలాల్లోకి, మా ఇళ్లలోకి వెళ్లిన రోజే మాకు నిజమైన ఈద్" అని అక్కడి బాధితులు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. రాజకీయ వైరుధ్యాలు, యుద్ధ తంత్రాల మధ్య సామాన్య పౌరులు బలవుతున్న ఈ పరిస్థితి మారాలని, వచ్చే పండుగకైనా బాంబుల మోత లేని ప్రశాంతమైన లెబనాన్‌ను చూడాలని ప్రపంచం ఆశిస్తోంది. యుద్ధ నీడలు తొలిగి, శాంతి వెలుగులు నిండాలని కోరుకుంటూ శరణార్థి శిబిరాల్లోని ప్రజలు కన్నీటితో ప్రార్థనలు చేస్తున్నారు.
