Let's talk: editor@tmv.in
యుద్ధ ఉద్రిక్తతలు: పశ్చిమాసియాలో సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా

యుద్ధ ఉద్రిక్తతలు: పశ్చిమాసియాలో సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా

Shaik Mohammad Shaffee
4 మార్చి, 2026

పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన ఘర్షణల వల్ల అక్కడ నివసిస్తున్న భారతీయ విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, మార్చి 5 (గురువారం), మార్చి 6 (శుక్రవారం) తేదీల్లో జరగాల్సిన 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. గల్ఫ్ ప్రాంతంలోని బహ్రెయిన్‌, ఇరాన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లోని పరీక్షా కేంద్రాలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని బోర్డు ఒక సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.

అనిశ్చితిలో విద్యా సంవత్సరం.. 5న కీలక సమీక్ష

యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న ఈ నిర్ణయంతో వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని బోర్డు తెలిపింది. అయితే మార్చి 7 నుంచి జరగాల్సిన మిగిలిన పరీక్షల నిర్వహణపై మార్చి 5వ తేదీన ఉన్నతాధికారులు మరోసారి పరిస్థితిని సమీక్షించనున్నారు. అప్పటి పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని, విద్యార్థులు నిరంతరం తమ పాఠశాలలతో టచ్‌లో ఉండాలని సూచించింది. కేవలం అధికారిక ప్రకటనలనే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులపై ఆందోళన చెందవద్దని ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం విద్యార్థులకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే మార్చి 2న జరగాల్సిన పరీక్షలను కూడా బోర్డు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

యుద్ధ క్షేత్రంగా మారిన పశ్చిమాసియా

గత శుక్రవారం (ఫిబ్రవరి 28) ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు మెరుపు దాడులు చేయడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీతో పాటు పలువురు సైనిక ఉన్నతాధికారులు ఈ దాడుల్లో మరణించడంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతుండటంతో గల్ఫ్ దేశాల్లోని పౌరులు, ప్రవాస భారతీయులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా మంగళవారం ఉదయం ఇజ్రాయెల్‌లోని రామత్ డేవిడ్ ఎయిర్ బేస్‌పై హెజ్బొల్లా డ్రోన్లతో దాడి చేయడంతో పరిస్థితులు మరింత విషమించాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే విద్యార్థుల క్షేమం దృష్ట్యా పరీక్షలను వాయిదా వేయక తప్పలేదని సీబీఎస్‌ఈ పేర్కొంది.