Let's talk: editor@tmv.in
యుద్ధాల ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నాం: ప్రధాని మోడీ

యుద్ధాల ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నాం: ప్రధాని మోడీ

Pinjari Chand
15 మార్చి, 2026

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల ప్రభావం దేశ ప్రజలపై తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. అయితే ప్రతిపక్షం అయిన ఇండియన్ నేషనల్‌ కాంగ్రెస్‌ దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అస్సాంలోని సిల్చార్‌‌ లో రూ.23,550 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం జరిగిన ప్రజాసభలో మోడీ మాట్లాడారు. స్వాతంత్ర్యం తరువాత దశాబ్దాల పాటు ఈశాన్య ప్రాంత అభివృద్ధిని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. స్వాతంత్ర్యం సమయంలో గీసిన సరిహద్దుల కారణంగా బరాక్ వ్యాలీకి సముద్రానికి ఉన్న మార్గం కూడా కోల్పోయిందని ఆయన ఆరోపించారు.

ప్రపంచం యుద్ధాల పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ప్రజలపై ప్రభావం తగ్గించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అయితే కాంగ్రెస్ బాధ్యతాయుత రాజకీయ పార్టీగా వ్యవహరించకుండా ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. గత నెల ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు చొక్కాలు చించుకుంటూ నిరసన తెలపడం ద్వారా దేశాన్ని అవమానపరిచారని మోడీ విమర్శించారు. ప్రపంచ దేశాల నాయకులు, టెక్నాలజీ కంపెనీలు పాల్గొన్న ఆ సమావేశాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేసిందని ఆయన పేర్కొన్నారు. అస్సాం యువతను గతంలో కాంగ్రెస్ హింసా మార్గం వైపు నడిపించిందని, కానీ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అవకాశాల రాష్ట్రంగా అస్సాంను అభివృద్ధి చేస్తోందని అన్నారు.

అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

ఈ సందర్భంగా బరాక్ వ్యాలీలో రవాణా, వాణిజ్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ ప్రాంతాన్ని ఈశాన్య భారతదేశంలో పెద్ద లాజిస్టిక్స్, ట్రేడ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అలాగే ఇది ప్రభుత్వ యాక్ట్ ఈస్ట్‌ పాలసీలో కీలక పాత్ర పోషిస్తూ దక్షిణాసియా దేశాలతో భారతదేశాన్ని అనుసంధానించే కేంద్రంగా మారుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రూ.22,864 కోట్ల వ్యయంతో కచార్ జిల్లాలోని సిల్చర్ నుంచి మేఘాలయలోని షిల్లాంగ్ వరకు నిర్మించనున్న 166 కిలోమీటర్ల నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేకు భూమిపూజ చేశారు. ఈ హైవే నిర్మాణంతో గువాహటి–సిల్చార్ మధ్య దూరం 295 కిమీ నుంచి 252 కిమీకి తగ్గి ప్రయాణ సమయం 8.5 గంటల నుంచి సుమారు 5 గంటలకు తగ్గనుందని అధికారులు తెలిపారు. అదే విధంగా సిల్చార్‌లో ట్రంక్ రోడ్ నుంచి రంగిర్ఖారి వరకు జాతీయ రహదారి–306పై రూ.565 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కూడా భూమిపూజ చేశారు. అలాగే కరీమ్‌గంజ్ జిల్లాలోని పాథర్‌కాండీలో రూ.122 కోట్లతో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.

శుక్రవారం నుంచి అస్సాంలో మొత్తం రూ.47,800 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కేంద్ర నౌకాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ పాల్గొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో రూ.18,680 కోట్ల కనెక్టివిటీ ప్రాజెక్టులకు శ్రీకారం

ప్రధాని నరేంద్రమోడీ శనివారం బెంగాల్‌లో రూ.18,680 కోట్ల విలువైన కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రారంభించి, పునాది రాళ్లు వేశారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంతో పాటు తూర్పు భారత అభివృద్ధికి కొత్త దశను ప్రారంభిస్తాయని ఆయన అన్నారు. కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, రోడ్లు, రైల్వేలు, పోర్టుల అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో వ్యాపారం, పరిశ్రమలు వేగం అందుకుంటాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల లక్షలాది మందికి ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయని చెప్పారు.

ఖరగ్‌పూర్–మోర్‌గ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వే

ప్రధాని 231 కిలోమీటర్ల పొడవైన నాలుగు లేన్ల ఖరగ్‌పూర్‌‌–మోరెగ్రామ్‌ ఎకనామిక్‌ కారిడర్‌‌కు చెందిన ఐదు సెక్షన్లకు పునాది వేశారు. ఈ మార్గం వల్ల ప్రయాణ దూరం సుమారు 120 కిలోమీటర్లు తగ్గి, ప్రయాణ సమయం 7–8 గంటలు ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. ఈ కారిడార్ పశ్చిమ మెదినిపూర్, బంకురా, హూగ్లీ, పూర్బా బర్ధమాన్, బీర్భూమ్, ముర్షిదాబాద్ జిల్లాల గుండా సాగుతుంది. ఇక 5.6 కిలోమీటర్ల పొడవైన దుబ్రాజ్‌పూర్‌‌ బైపాస్‌ నిర్మాణానికి కూడా ఆయన పునాది వేశారు. అలాగే కాంగ్సాబతి, శిలాబతి నదులపై కొత్త నాలుగు లేన్ల వంతెనలు నిర్మించనున్నారు.ఈ సందర్భంగా ఆయన పూర్నియా–ఆనంద్‌ విహార్ టెర్మినల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించారు. అదేవిధంగా అమృత్‌స్టేషన్ల కింద పునరుద్ధరించిన ఆరు రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభించారు. అవి కామాఖ్యాగురి, అనారా, తమ్లుక్, హాల్దియా, బరాభూమ్, సియూరి స్టేషన్లు. రోడ్లు, రైల్వేలతో పాటు జల రవాణా కూడా ముఖ్యమని ప్రధాని పేర్కొన్నారు. హాల్దియా డాక్‌లో బెర్త్–2 యాంత్రీకరణను ప్రారంభించగా,కిడర్పూర్ డాక్స్‌లో పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. అలాగే హాల్దియా డాక్‌లో బెర్త్–5 యాంత్రీకరణకు పునాది వేశారు.