
యుద్ధం నీడలో ఆశ
ఆధునిక చరిత్రలో ఒక దేశాన్ని మరో దేశం దురాక్రమించడం చూశాం. కానీ ప్రపంచ దేశాలచే గుర్తించబడి, చారెడు నేలకు నోచుకోక పోవడమనే దుస్థితి ఊహకందని విషయం. అదోక వాస్తవమై పాలస్తీనాగా మన కళ్లముందు కనిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి సభ్యదేశమైన పాలస్తీనాకు రాజధాని లేదు. దాని పాలనలో ఉన్న ప్రజలు ఒకచోట లేరు. ఇదో ఒక భయంకర పరిస్థితి. పాలస్తీనా భూభాగాలైన గాజా, వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న ప్రస్తుత దారుణ స్థితులు ప్రపంచంలో మరెక్కడా లేవు. నిజానికి గాజా అంటేనే పోరాటాలు, త్యాగాలు. అదో రక్తసిక్త చరిత్రకు మూలమైన ప్రాంతం. పాలస్తీనా పోరాట సంస్థగా ముద్రపడ్డ హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధానికి దిగి అక్టోబర్ 7, 2025నాటికి సరిగ్గా రెండేళ్లు. ఒకప్పుడు దేవుని నడకలతో పవిత్రమైన నేలగా గుర్తింపుబడ్డ గాజా.. ఇప్పుడు రక్తపు వాసనతో నిండిపోయింది. ఒకప్పుడు ప్రార్థనలతో మారుమోగిన గాలులు, ఇప్పుడు తుపాకీ శబ్దాలతో విహరిస్తున్నాయి.. ఒకప్పుడు పిల్లల నవ్వులు వినిపించిన వీధులు, ఇప్పుడు బాంబుల శబ్దాలతో మ్రోగుతున్నాయి. బైబిల్ పుటల్లో పుడమి రూపం దాల్చిన పవిత్ర స్థలమైన గాజా.. ఇప్పుడు నెత్తురోడుతోంది. శాంసన్ లాంటి వీరులు, ప్రవక్తల వచనాలు, పాత రాజ్యాల జాడలు ఈ నేల గుండెల్లో దాగి ఉన్నాయి. దేవుని చరిత్రలో సాక్షిగా నిలిచిన ఈ నేల.. ఇప్పుడు మనుషుల ద్వేషానికి సాక్షమవుతోంది. ఒకప్పుడు స్వప్నాల నేల.. ఇప్పుడు శోకగీతాల నేలగా మారింది. ఇక నేటి పరిస్థితి అర్థం చేసుకోవాలంటే ఓసారి గతాన్ని గుర్తుచేసుకోవాల్సిందే.
బైబిల్ పుటలు తెరిచినా, గాజా పేరు కనిపిస్తుంది. అది కేవలం ఒక నగరం కాదు, ఒక సాక్ష్యం. సముద్ర గాలుల్లో పుట్టిన ఈ భూమి.. యూదులు, ఫిలిస్తీయులు మధ్య యుద్ధాల కధలు మోసుకుంటూ వచ్చింది. బైబిల్ ప్రకారం శాంసన్ అనే వీరుడు ఇక్కడే బంధించబడ్డాడు. ఆ కాలంలో ఫిలిస్తీయులు గాజాను తమ కోటగా కట్టారు. ఆలయాలు నిర్మించారు. శత్రువులు గాజా ద్వారాల దగ్గర తలుపులు తట్టినప్పుడు, దేవుని పేరుతో యుద్ధాలు జరిగేవి. ఈ నేల మట్టిలో దేవుని అడుగుల ముద్రలు ఉన్నాయనే నమ్మకం ప్రజల హృదయాల్లో పెరిగింది. ఎన్ని రాజ్యాలు వచ్చి పోయినా, గాజా తన పవిత్రతను, తన గర్వాన్ని కాపాడుకుంది. ప్రతి రాయి ఒక కథ, ప్రతి గాలి ఒక ప్రార్థనగా మారింది.
అయితే కాలం గడియారం తిరిగింది. రాజులు మారారు, జెండాలు మారాయి. ఇస్లాం తారలు ఉదయించగా, గాజా మసీదుల కాంతిలో తళతళలాడింది. రాజుల గుర్రాల పాదాలు ఈ నేల మీద మోగాయి. ఒట్టోమాన్లు తమ రాజ్యాల చరిత్రలో గాజా పేరు చెక్కారు. ఒక్కో దండయాత్ర గాజా గోడల మీద గాయంగా మారాయి. కానీ ప్రతి సారి గాజా లేచింది. సముద్రపు వాయువులు, ఎడారి గాలులు దాని గాయాలను నెమ్మదిగా తగ్గించే ప్రయత్నాలు చేసింది. వ్యాపార మార్గాల్లో, యాత్రికుల పుటల్లో, గాజా పేరు మారుమోగింది. అటు కాలం ముందుకు సాగుతూ పోయింది. గాజా కొత్త శతాబ్దంలోకి ప్రవేశించింది. కానీ పాత గాయాలు ఇంకా మానలేదు. బ్రిటిష్ పాలన, విభజన నిర్ణయాలు, ఇజ్రాయెల్ ఏర్పాటు లాంటివి ఈ నేల గుండెల్లో ముద్రలుగా మిగిలిపోయాయి. యుద్ధాలు ఒక్కటే కాదు.. తరతరాల బాధగా మారాయి. గాజా వీధుల్లో పిల్లల కళ్లలో భయం, తల్లుల ముఖాల్లో నిరీక్షణ కనిపిస్తోంది. ఆకాశం పైన మబ్బుల్లా బాంబులు తిరుగుతుంటాయి, నేలపై రక్తం ఏరులైపారుతుంది.
అక్టోబర్ 7, 2023 తర్వాత గాజా పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న సెటిల్‌మెంట్ ప్రాంతాలపై హమాస్ దాడులు చేసింది. నాటి ఘటనలో 1200మంది ఇజ్రాయెల్ సామాన్యులు చనిపోయారు. వందలాది మందిని బందీలగా పట్టుకుపోయిన హమాస్ మూకలు వారిని గాజా నేలపై బంధించాయి. అప్పటినుంచి బందీలను విడుదల చేయాలంటూ గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. ఈ రెండేళ్ల కాలంలో పాలస్తీనా గడ్డపై 67,000మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో చిన్నారులు, మహిళలే భారీ సంఖ్యలో ఉన్నారు. యుద్ధానికి ఏ మాత్రం సంబంధంలేని అమాయకులు బలయ్యారు. ఇవ్వాళ గాజా ప్రజలకు తాగడానికి నీరు లేదు, తినడానికి తిండి లేదు. గాజాపై ఇజ్రాయెల్ నిరంతరంగా కొనసాగిస్తున్న బాంబు దాడులు, వైద్య సరఫరాలు, సిబ్బంది కొరత కారణంగా మొత్తంగా గాజాలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది.
ఇలా గాజా ఇప్పుడు ఒక దుఃఖానికి సాక్ష్యంగా మారింది. దేవుని నేలగా పిలవబడిన భూమి ఇప్పుడు రోదనల నిలయంగా మారింది. ప్రతి క్షణం ఒక కేక, ప్రతి రాత్రి ఒక శవం. అయినా గాజా మళ్లీ లేస్తుంది. ఎందుకంటే ఈ నేలలో రక్తం మాత్రమే కాదు, ఆశ కూడా ఉంది. ఆ ఆశే గాజా గుండె చప్పుళ్లలో ఇప్పటికీ వినిపిస్తోంది.. ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.
