
యుద్ధం ఎఫెక్ట్.. ఏప్రిల్‌లో బహ్రెయిన్, సౌదీ ఎఫ్-1 రేసులు రద్దు
పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్ యుద్ధం క్రీడా ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఏప్రిల్ నెలలో బహ్రెయిన్, సౌదీ అరేబియాలో జరగాల్సిన ఫార్ములా-1 (ఎఫ్-1) రేసులను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ ఆటోమొబైల్ సమాఖ్య (ఎఫ్ఐఏ) ఆదివారం ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ జరిపిన దాడుల్లో బహ్రెయిన్, సౌదీ అరేబియాలు కూడా ప్రభావితం కావడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నిర్వాహకులు వెల్లడించారు. షాంఘైలో చైనీస్ గ్రాండ్‌ప్రీ ప్రారంభానికి ముందు ఈ అధికారిక ప్రకటన వెలువడింది.
ఏప్రిల్‌లో రేసుల్లేవ్
షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 12న బహ్రెయిన్‌లో, ఏప్రిల్ 19న సౌదీలోని జెడ్డాలో రేసులు జరగాల్సి ఉంది. "ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల, సిబ్బంది భద్రతే మాకు అత్యంత ముఖ్యం. అనేక ప్రత్యామ్నాయాలను పరిశీలించినప్పటికీ, ఏప్రిల్ నెలలో వేరే ఇతర రేసులను నిర్వహించకూడదని నిర్ణయించాం" అని ఎఫ్-1 సీఈఓ స్టెఫానో డొమెనికాలీ తెలిపారు. రేసులను 'రద్దు', 'వాయిదా' అనే పదాలు వాడకుండా.. కేవలం "ఏప్రిల్‌లో నిర్వహించడం లేదు" అని మాత్రమే ఎఫ్ఐఏ పేర్కొంది. అయితే వీటిని మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత లేదు.
షెడ్యూల్‌లో భారీ గ్యాప్
ఈ రెండు రేసుల రద్దుతో మార్చి 29న జరిగే జపనీస్ గ్రాండ్‌ప్రీ తర్వాత, మళ్ళీ మే 3న జరిగే మయామి గ్రాండ్‌ప్రీ వరకు అంటే దాదాపు ఐదు వారాల పాటు ఎఫ్-1లో విరామం ఏర్పడనుంది. ఈ ఏడాది 22 రేసులతో కూడిన సీజన్, గత మూడేళ్లలో అత్యంత చిన్న సీజన్‌గా మిగిలిపోయే అవకాశం ఉంది. రేసులకు కొన్ని వారాల ముందే భారీ కార్గో, సిబ్బందిని తరలించాల్సి ఉండటం, అలాగే స్వల్ప వ్యవధిలో టికెట్లు విక్రయించడం అసాధ్యం కావడంతో ప్రత్యామ్నాయ వేదికలను కూడా ఎంపిక చేయలేకపోయారు. మెర్సిడెస్ డ్రైవర్ కిమీ ఆంటోనెల్లి స్పందిస్తూ.. యుద్ధ బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూనే, భద్రతకే ప్రాధాన్యత ఇవ్వడాన్ని స్వాగతించారు.
గత అనుభవాల దృష్ట్యా అప్రమత్తత
గతంలో 2023లో ఇటలీలో వరదల కారణంగా, అలాగే 2022లో ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యన్ గ్రాండ్‌ప్రీని రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. 2022లో సౌదీలో ప్రాక్టీస్ సెషన్ జరుగుతుండగా ఆయిల్ డిపోపై దాడి జరిగినప్పటికీ రేసును కొనసాగించారు. కానీ ప్రస్తుత యుద్ధ తీవ్రత దృష్ట్యా నిర్వాహకులు ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మిడిల్ ఈస్ట్‌లోని ప్రధాన విమానాశ్రయాలు మూసివేతతో ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రీకి వెళ్లే సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితులు చక్కబడగానే మళ్లీ బహ్రెయిన్, సౌదీలలో రేసులు నిర్వహిస్తామని ఎఫ్ఐఏ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ సులాయం ఆశాభావం వ్యక్తం చేశారు.
