Let's talk: editor@tmv.in
యుద్ధం ఎక్కడివరకైనా.. సిద్ధమే: ఇరాన్ హెచ్చరిక

యుద్ధం ఎక్కడివరకైనా.. సిద్ధమే: ఇరాన్ హెచ్చరిక

Shaik Mohammad Shaffee
17 మార్చి, 2026

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య ఇరాన్ తన స్వరాన్ని మరింత పెంచింది. తమపై దాడి చేయాలనే ఆలోచన శత్రువులకు మళ్లీ రాకుండా ఉండేలా ఈ యుద్ధానికి ముగింపు పలుకుతామని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ సోమవారం హెచ్చరించారు. తమ దేశ రక్షణ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయబోమని, యుద్ధం ఎక్కడి వరకు వెళ్లినా, దాన్ని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. తాము ఎలాంటి జాతిని ఎదుర్కొంటున్నారో శత్రువులకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చి ఉంటుందని అరాఘ్చీ వ్యాఖ్యానించారు.

హోర్ముజ్ జలసంధిపై ఆంక్షలు?

మరోవైపు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ప్రస్తుతానికి మూసివేయలేదని ఆయన స్పష్టం చేస్తూనే.. కొన్ని కీలక షరతులు విధించారు. అమెరికా, ఇజ్రాయెల్ సృష్టిస్తున్న అశాంతి వల్ల ఈ మార్గంలో నౌకల రాకపోకలపై తమ సాయుధ దళాల నియంత్రణ ఉంటుందని తెలిపారు. ఇరాన్‌పై దాడులు చేయడానికి ఏ దేశం కూడా ఈ జలసంధిని వాడుకోకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ జాతీయ భద్రత దృష్ట్యా తీరప్రాంత దేశంగా ఇరాన్‌కు ఈ నిర్ణయం తీసుకునే సర్వహక్కులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

అణుబాంబు వాదనలు అబద్ధం

ఇదే సమయంలో ఇరాన్ అణు కార్యక్రమాలపై వస్తున్న ఆరోపణలను బఘాయీ తిప్పికొట్టారు. 60 శాతం యురేనియం నిల్వలు ఉన్నంత మాత్రాన అది అణుబాంబు కలిగి ఉన్నట్లు కాదని స్పష్టం చేశారు. అలాగే ఇరాన్ డ్రోన్లు అమెరికా పశ్చిమ తీరానికి చేరుకుంటాయనే ప్రచారం.. తమపై కుట్రలు పన్నడానికి జరుగుతున్న ప్రయత్నమేనని ఆరోపించారు. ఇజ్రాయెల్, అమెరికా చర్యల వల్లే గల్ఫ్ ప్రాంతంలో భద్రత క్షీణించిందని, గతంలో ఇరాన్ ఈ మార్గంలో ప్రయాణాలకు రక్షకుడిగా ఉందని ఆయన గుర్తు చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి.

యుద్ధం ఎక్కడివరకైనా.. సిద్ధమే: ఇరాన్ హెచ్చరిక - Tholi Paluku