Let's talk: editor@tmv.in
యుద్ధం ఆపేందుకు ఇరాన్ మూడు షరతులు

యుద్ధం ఆపేందుకు ఇరాన్ మూడు షరతులు

Shaik Mohammad Shaffee
13 మార్చి, 2026

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భీకర యుద్ధం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. అమెరికా, ఇజ్రాయెల్‌లతో సాగుతున్న ఈ పోరును ముగించేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ మూడు కీలక షరతులను తెరపైకి తెచ్చారు. రష్యా, పాకిస్థాన్ దేశాధినేతలతో చర్చల అనంతరం ఆయన 'ఎక్స్' వేదికగా ఈ ప్రతిపాదనలను వెల్లడించారు. ఇరాన్ సార్వభౌమ హక్కులను గుర్తించడం, జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి దాడులు జరగవని అంతర్జాతీయ సమాజం నుంచి గట్టి హామీ లభిస్తేనే కాల్పుల విరమణకు సిద్ధమని స్పష్టం చేశారు.

అగ్రరాజ్యానికి కోలుకోలేని దెబ్బ!

ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు అగ్రశ్రేణి సైనిక కమాండర్లు మరణించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా ఇరాన్ చేపట్టిన 'ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4' అమెరికాకు ఊహించని నష్టాన్ని మిగిల్చింది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. బహ్రెయిన్, జోర్డాన్, ఖతార్, కువైట్, యూఏఈ, సౌదీ అరేబియాలోని దాదాపు 17 అమెరికా సైనిక స్థావరాలు ఇరాన్ క్షిపణి దాడుల్లో దెబ్బతిన్నాయి. అత్యంత ఖరీదైన 'థాడ్' క్షిపణి రక్షణ వ్యవస్థకు చెందిన రాడార్లను ఇరాన్ క్షిపణులు తుత్తునియలు చేశాయి. సైనిక స్థావరాలే కాకుండా ఇరాక్, కువైట్ వంటి దేశాల్లోని అమెరికా దౌత్య కార్యాలయాలనూ ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది.

క్షిపణుల వర్షం.. పెరిగిన మృతుల సంఖ్య

ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) గురువారం 40వ విడత దాడులను ప్రారంభించాయి. 'ఇమామ్ అలీ' సంకేత నామంతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఘదర్, ఎమాద్, ఖైబర్ షెకాన్, ఫత్తా వంటి అత్యాధునిక క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడులు టెల్ అవీవ్, హైఫా వంటి ఇజ్రాయెల్ నగరాలను వణికించాయి. మరోవైపు ఫిబ్రవరి 28 నుంచి జరిగిన దాడుల్లో సుమారు 1,350 మంది ఇరాన్ పౌరులు (మహిళలు, చిన్నారులతో సహా) ప్రాణాలు కోల్పోయారని, 17,000 మంది గాయపడ్డారని ఐరాసలో ఇరాన్ ప్రతినిధి అమీర్ సయీద్ ఇరావని వెల్లడించారు.

ఈ యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై తీవ్రంగా పడుతోంది. సముద్ర మార్గంలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటికే సముద్రంలో 14 చమురు ట్యాంకర్లపై దాడులు జరగగా, తాజాగా ఇరాక్ తీరంలో జరిగిన దాడిలో ఒక నావికుడు మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

మేము గెలిచాం: డొనాల్డ్ ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా ఇప్పటికే విజయం సాధించిందని ఆయన ప్రకటించారు. అయితే నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తిగా నెరవేరే వరకు అమెరికా దళాలు ఆ ప్రాంతంలోనే కొనసాగుతాయని స్పష్టం చేశారు.