Let's talk: editor@tmv.in
యుద్ధంలో రెండో స్థానం ఉండదు: సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌

యుద్ధంలో రెండో స్థానం ఉండదు: సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌

Pinjari Chand
12 నవంబర్, 2025

యుద్ధంలో రెండో స్థానం ఉండదు. రన్నరప్‌ అనే పదానికి అవకాశమే లేదు. ధైర్యంగా పోరాడినా చివరికి ఓడిపోయిన వారికి సిల్వర్‌ మెడల్‌ గానీ సాంత్వన బహుమతి కానీ లభించదని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలోని మనోహర్‌ పారికర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ అండ్‌ అనాలిసిస్‌ నిర్వహించిన రక్షణ, భద్రత అంశాల సదస్సులో ఆయన ప్రసంగించారు.

వ్యూహమే విజయానికి పునాది

యుద్ధం అనేది వ్యూహంపై ఆధారపడి ఉంటుంది. యుద్ధంలో విజయం సాధించేది కేవలం ధైర్యంతో కాదు, సరైన వ్యూహంతోనే యుద్ధంలో గెలవగలం. దేశాల భవిష్యత్తు, దేశాల ఉనికి యుద్ధ ఫలితాలపైనే ఆధారపడి ఉంటుంది అని చౌహాన్‌ పేర్కొన్నారు. ఇప్పటి యుద్ధాల్లో భౌగోళికతను మించి సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో యుద్ధంలో యుద్ధ మైదానానికి సంబంధించిన జ్ఞానం ఉన్న కమాండర్లు విజయం సాధించేవారు. కానీ గన్‌పౌడర్‌ ఆవిష్కరణ తర్వాత టెక్నాలజీ యుద్ధ ఫలితాలను ప్రభావితం చేయడం మొదలైందని ఆయన వివరించారు.

మొదట్లో భౌగోళికత, టెక్నాలజీ రెండింటికి సమ ప్రాధాన్యముండేది. కానీ ఇప్పుడు సాంకేతికత ప్రధానమవుతోందని చెప్పారు.

కాన్‌వర్జెన్స్‌ వార్‌ఫేర్‌..మూడో సైనిక విప్లవం

ప్రపంచం ప్రస్తుతం మిలిటరీ అఫైర్స్‌లో మూడో విప్లవ దశను చూస్తోందని ఆయన వివరించారు. దీనిని నేను ‘కాన్‌వర్జెన్స్‌ వార్‌ఫేర్‌’ అంటాను. ఇది ప్రత్యక్ష యుద్ధాలు (కైనటిక్‌) సైబర్‌, సమాచార, ఆర్థిక (నాన్‌-కైనటిక్‌ ) యుద్ధాల సమ్మిళిత రూపం. ప్రత్యక్ష పోరాటం (కాంటాక్ట్‌ ) దూరప్రభావం (నాన్‌-కాంటాక్ట్‌ ) యుద్ధాలు కలిసిన కొత్త శకం ఇది అని చౌహాన్‌ వివరించారు. కాన్‌వర్జెన్స్‌ వార్‌ఫేర్‌ అంటే కత్తులు, తుపాకులతో చేసే యుద్ధం మాత్రమే కాదు. సోషల్‌ మీడియా, సైబర్‌ దాడులు, సమాచార యుద్ధాలు, ఉపగ్రహాల వినియోగం అన్నీ కలిసిన ఆధునిక యుద్ధ రూపం.

యుద్ధ రంగంలో టెక్నాలజీ ఆధిపత్యం

నేటి యుద్ధరంగంలో సెన్సర్ల ప్రాముఖ్యత విపరీతంగా పెరిగింది. యుద్ధరంగంలోని ప్రతి కదలికపై కమాండర్లకు సమగ్ర సమాచారం అందుతోంది. దీని వల్ల యుద్ధరంగం పూర్తిగా పారదర్శకమైందీ, కమాండర్లకు అత్యున్నత స్థాయి ‘సిట్యుయేషనల్‌ అవేర్‌నెస్‌’ వచ్చిందని ఆయన వివరించారు.

మున్ముందు యంత్రాల మధ్య యుద్ధం

ఇప్పటివరకు యుద్ధం మనుషుల మధ్య జరుగుతూనే ఉంది. కానీ భవిష్యత్తులో యంత్రాల మధ్య యుద్ధం జరగొచ్చు. మానవ మెదడు నిర్ణయ సామర్థ్యానికి తోడు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత రావడం వల్ల శత్రువు స్పందించక ముందే నిర్ణయాలు తీసుకునే స్థాయికి మనం చేరుకుంటున్నామని సీడీఎస్‌ హెచ్చరించారు.

పట్టణ ప్రాంతాల్లో యుద్ధాలు అత్యంత క్లిష్టం

పట్టణ ప్రాంతాల్లో జరిగే యుద్ధాలు అత్యంత క్లిష్టమైనవి. అక్కడ భౌగోళిక రూపకల్పనకు నియమాలు ఉండవు. బహుళ స్థాయి ముప్పులు, పరిమిత దృష్టి కోణాలు, పౌరుల ఉనికి ఇవన్నీ పట్టణ యుద్ధాన్ని కఠినతరం చేస్తున్నాయని ఆయన తెలిపారు.

యుద్ధ క్షేత్రంగా స్పేస్‌ డొమైన్‌

చివరగా సీడీఎస్‌ చౌహాన్‌ స్పేస్‌ రంగ ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. మునుపటిదాకా అంతరిక్షం యుద్ధానికి సహాయక రంగం మాత్రమే. కానీ ఇప్పుడు అది నిర్ణాయక యుద్ధ రంగంగా మారిపోయిందని స్పష్టం చేశారు. చివరగా యుద్ధంలో రెండో స్థానం ఉండదు. విజయం లేదా పరాజయం మాత్రమే అని నొక్కి చెప్పారు.

యుద్ధంలో రెండో స్థానం ఉండదు: సీడీఎస్‌ అనిల్‌ చౌహాన్‌ - Tholi Paluku