Let's talk: editor@tmv.in
యుద్ధంపై తప్పుడు ప్రచారం: యూఏఈలో 19 మంది భారతీయుల అరెస్టు!

యుద్ధంపై తప్పుడు ప్రచారం: యూఏఈలో 19 మంది భారతీయుల అరెస్టు!

Shaik Mohammad Shaffee
16 మార్చి, 2026

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని, కృత్రిమ వీడియోలను ప్రచారం చేస్తున్న వారిపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఉక్కుపాదం మోపుతోంది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా, దేశ భద్రతకు విఘాతం కలిగించేలా పోస్టులు పెట్టిన మొత్తం 35 మందిని అరెస్టు చేయాలని యూఏఈ అటార్నీ జనరల్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షంసీ ఆదివారం ఆదేశించారు. ఈ నిందితులలో 19 మంది భారతీయులు ఉండటం గమనార్హం. శనివారం 10 మందిని, ఆదివారం మరో 25 మందిని అరెస్టు చేసి త్వరితగతిన విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.

తప్పుడు ప్రచారం వెనుక మూడు ముఠాలు

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిఘా ఉంచిన ఎలక్ట్రానిక్ మానిటరింగ్ విభాగానికి విస్తుపోయే నిజాలు తెలిశాయని అటార్నీ జనరల్ వెల్లడించారు. నిందితులు మూడు వర్గాలుగా విడిపోయి తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారని ఆయన తెలిపారు. మొదటి బృందం దేశ గగనతలంలో క్షిపణులను అడ్డుకుంటున్న అసలు వీడియోలకు భయంకరమైన శబ్దాలను, వ్యాఖ్యానాలను జోడించి.. దేశంపై భారీ దాడులు జరుగుతున్నాయనే భ్రమను కల్పించారు. దీనివల్ల దేశ రక్షణ రహస్యాలు శత్రువులకు తెలిసే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బృందంలో ఐదుగురు భారతీయులతో పాటు పాకిస్థాన్, నేపాల్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్ వాసులు ఉన్నారు.

ఏఐతో నకిలీ వీడియోల సృష్టి

రెండో బృందం అత్యంత ప్రమాదకరమైన 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' సాంకేతికతను వాడుకున్నట్లు దర్యాప్తులో తేలింది. యూఏఈలోని ప్రముఖ కట్టడాలపై పేలుళ్లు జరుగుతున్నట్లు, భారీగా మంటలు ఎగిసిపడుతున్నట్లు నకిలీ వీడియోలను సృష్టించి వాటికి జాతీయ జెండాలు, తేదీలను తగిలించి నిజమైన వీడియోలుగా చిత్రీకరించారు. మరికొందరు ఇతర దేశాల్లో జరిగిన పాత ఘటనలను యూఏఈలో జరిగినట్లుగా ప్రచారం చేశారు. చిన్నారుల భావోద్వేగాలను వాడుకుంటూ భద్రతా పరమైన ముప్పులు ఉన్నట్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారు. ఈ బృందంలోని ఏడుగురిలో ఐదుగురు భారతీయులే కావడం గమనార్హం.

దేశ వ్యతిరేక ప్రచారం

ఇక మూడో బృందం యూఏఈ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. పొరుగు దేశాల సైనిక దాడులను గొప్పగా అభివర్ణించడం, శత్రు దేశాల నాయకత్వాన్ని పొగడటం, వారి ప్రచార కార్యక్రమాలను తిరిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటి పనులకు పాల్పడ్డారు. ఈ బృందంలో ఉన్న ఆరుగురిలో ఐదుగురు భారతీయులు, ఒక పాకిస్థానీ ఉన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు భారతీయులు కూడా ఇటువంటి నేరాలకే పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి.

భారీ జరిమానా.. జైలు శిక్ష తప్పదు

ఈ నేరాలకు పాల్పడిన వారికి దేశ చట్టాల ప్రకారం కఠిన శిక్షలు పడనున్నాయి. నిందితులకు కనీసం ఏడాది జైలు శిక్షతో పాటు లక్ష దిర్హామ్‌లకు (సుమారు రూ.25 లక్షలు) తక్కువ కాకుండా భారీ జరిమానా విధిస్తామని అటార్నీ జనరల్ హెచ్చరించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వార్తలను గుడ్డిగా నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తప్పుడు వీడియోలు షేర్ చేసే వారిపై నిఘా మరింత కఠినతరం చేస్తామని స్పష్టం చేశారు.