Let's talk: editor@tmv.in
యుఎస్ విమాన ప్రయాణంలో ఇబ్బందులు - జీతాల్లేని కంట్రోలర్లు, ఆలస్యమవుతున్న విమానాలు

యుఎస్ విమాన ప్రయాణంలో ఇబ్బందులు - జీతాల్లేని కంట్రోలర్లు, ఆలస్యమవుతున్న విమానాలు

Yekkirala Akshitha
26 అక్టోబర్, 2025

యునైటెడ్ స్టేట్స్ (యుఎస్) తన రెండవ అతిపెద్ద ప్రభుత్వ షట్‌డౌన్ ఎదుర్కొంటుంది. దీని ప్రభావం విమాన ప్రయాణాలపై కనిపిస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు (విమానాలను ఆకాశంలో విమానాశ్రయాలలో సురక్షితంగా నడిపించేవారు) జీతం లేకుండా పనిచేయాల్సి రావడంతో, అనేక విమానాలు ఆలస్యం అవుతున్నాయి లేదా రద్దు చేయబడుతున్నాయి. షట్‌డౌన్ సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విధిగా పనిచేయాలి, కానీ జీతం అందకపోవడంతో, చాలా మంది అనారోగ్యం పేరుతో సెలవు పెడుతున్నారు. దీని కారణంగా న్యూయార్క్‌లోని నెవార్క్, లా గార్డియా, అలాగే హ్యూస్టన్, డల్లాస్, ఫీనిక్స్, అట్లాంటా, చికాగో వంటి పెద్ద విమానాశ్రయాలలో భారీ ఆలస్యాలు జరుగుతున్నాయి. ఒక్క గురువారం సాయంత్రమే, సిబ్బంది కొరత వల్ల నెవార్క్, న్యూయార్క్ , హ్యూస్టన్ విమానాశ్రయాలలో గ్రౌండ్ ఆలస్యాలు వెలుగుచూసాయి. .

కంట్రోలర్లు తీవ్ర ఒత్తిడికి, అలసటకు గురవుతున్నారు. చాలా మంది రోజుకు పది గంటల షిఫ్టులు, వారానికి ఆరు రోజులు, చాలా తక్కువ విశ్రాంతితో పనిచేస్తున్నారు. కొందరు తమ బిల్లులు చెల్లించుకోవడానికి సెలవు రోజుల్లో రెండవ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. అలసిపోయిన కంట్రోలర్ల కారణంగా ఆకాశంలో విమాన ప్రయాణాన్ని సురక్షితంగా నిర్వహించడం కష్టమవుతుందని పైలట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైలట్ల యూనియన్ అధ్యక్షుడు కెప్టెన్ జాసన్ అంబ్రోసి మాట్లాడుతూ, "లక్షలాది మంది ప్రయాణికుల భద్రత మరియు వేల టన్నుల సరుకు రవాణా ఈ కార్మికుల చేతుల్లో ఉంది. బిల్లుల గురించిన ఆందోళన వారిపై మరింత ఒత్తిడిని పెంచుతుంది,” అని అన్నారు.

రవాణా శాఖ కార్యదర్శి సీన్ డఫీ విమానాలు సమయానికి బయలుదేరుతాయని హామీ ఇవ్వలేనని చెప్పారు. "ప్రతి రోజు మన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు పనికి హాజరుకావడాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది," అని ఆయన పేర్కొన్నారు. షట్‌డౌన్ సమయంలో ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లించాలనే విషయంలో కాంగ్రెస్ ప్రస్తుతం ప్రతిష్టంభనలో ఉంది. కొందరు చట్టసభ్యులు కేవలం కొన్ని వర్గాల కార్మికులకు మాత్రమే చెల్లించాలని కోరుతుండగా, మరికొందరు అందరికీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదు.

యుఎస్ చరిత్రలో ఇటువంటి పరిస్థితి కొత్తేమీ కాదు. కాంగ్రెస్ కు అధ్యక్షుడికి మధ్య బడ్జెట్‌పై ఏకాభిప్రాయం కుదరనప్పుడు ప్రభుత్వ షట్‌డౌన్‌లు జరుగుతాయి. ఈసారి, ఇది 24 రోజులు కొనసాగుతోంది, దీనివల్ల లక్షలాది ఫెడరల్ ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ముఖ్యంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారు, ఎందుకంటే వారికి జీతం అందకపోయినా వారు పని చేయడం ఆపడానికి వీలు లేదు.

పర్యవసానాలు తీవ్రంగా ఉన్నాయి

• ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు అధిక పనిభారం, ఒత్తిడి మరియు ఆర్థిక ఆందోళనలతో ఉన్నారు.

• కంట్రోలర్ల కొరత కారణంగా భద్రత గురించి పైలట్లు ఆందోళన చెందుతున్నారు.

• ప్రయాణీకులు విమాన ఆలస్యాలు, రద్దులను ఎదుర్కొంటున్నారు, ముఖ్యమైన పర్యటనలు ,అత్యవసర కార్యక్రమాలను కోల్పోయే ప్రమాదం ఉంది.

• విమానయాన సంస్థలు, ఆర్థిక వ్యవస్థ ప్రయాణ ఆదాయంలో బిలియన్ల డాలర్ల నష్టాన్ని చవిచూస్తున్నాయి.

ఈ షట్‌డౌన్ కారణంగా ట్రావెల్ పరిశ్రమకు ఇప్పటికే సుమారు $3.3 బిలియన్ల నష్టం వాటిల్లినట్లు అంచనా, ఇది ఎంత ఎక్కువ కాలం కొనసాగితే, సమస్య అంత తీవ్రమవుతుంది. కాంగ్రెస్, అధ్యక్షుడు ఒక ఒప్పందానికి వచ్చి ఫెడరల్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించే వరకు, విమాన ట్రాఫిక్ సమస్యలు, ఆలస్యాలు, ఒత్తిడితో కూడిన కంట్రోలర్ల పరిస్థితి కొనసాగుతుంది.