Let's talk: editor@tmv.in
యాసిన్‌ మాలిక్‌కు మరణదండన విధించండి: ఎన్ఐఏ అప్పీల్‌

యాసిన్‌ మాలిక్‌కు మరణదండన విధించండి: ఎన్ఐఏ అప్పీల్‌

Pinjari Chand
11 నవంబర్, 2025

జమ్మూ–కాశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ (జేకేఎల్ఎఫ్) చీఫ్‌ యాసిన్‌ మాలిక్‌కు మరణదండన విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేసిన అప్పీల్‌పై వాదనలు జనవరి 28న వినాలని ఢిల్లీ హైకోర్టు నిర్ణయించింది. 2017 నాటి ఉగ్రనిధుల కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న మాలిక్‌పై ఎన్ఐఏ ఈ అప్పీల్‌ వేసింది. సోమవారం విచారణ సందర్భంగా ఎన్ఐఏ తరఫున ప్రత్యేక ప్రజా అభియోజకుడు అక్షయ్‌ మాలిక్‌ ఇన్‌–కెమెరా (ప్రజలకు ప్రవేశం లేని) విధానంలో విచారణ జరపాలని, అలాగే ప్రజలకు అందుబాటులో లేని ప్రైవేట్‌ వర్చువల్‌ లింక్‌ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. న్యాయమూర్తులు వివేక్‌ చౌదరి, మనోజ్‌ జైన్‌ బృందం దీనిపై ఆలోచన చేస్తామని తెలిపింది.

తీహార్‌ జైలు నుంచి వర్చువల్‌గా హాజరైన యాసిన్‌ మాలిక్‌ తానే తన తరఫున వాదించుకుంటూ, మూడు సంవత్సరాలుగా ఈ అప్పీల్‌ పెండింగ్‌లో ఉందని మరణదండన విధిస్తారా? లేదా అనే అనిశ్చితి ఒక మానసిక యాతనగా పేర్కొన్నారు.

2006లో పాకిస్తాన్‌లో హఫీజ్‌ సయీద్‌ను కలిసిన విషయంపై మాలిక్‌ సమర్పించిన అఫిడవిట్‌లో అది భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) సూచనల మేరకు భూకంప సహాయ పర్యటన సమయంలో జరిగిందని తెలిపారు. ఆ భేటీ వివరాలను అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు ఎన్‌.కె. నారాయణన్‌ లకు వివరించానని, కానీ ఆ తర్వాత దానిని తనను ఉగ్రవాదిగా చూపేలా వక్రీకరించారని ఆరోపించారు.

వీపీ సింగ్‌ కాలం నుంచి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం వరకు ఆరు ప్రభుత్వాలు కాశ్మీర్‌ శాంతి చర్చల్లో తన్ను భాగస్వామిగా చేసుకున్నాయని, వాజ్‌పేయీ యుగంలో అజిత్‌ దోవల్‌, శ్యామల్‌ దత్తా, బ్రజేశ్‌ మిశ్రా వంటి ఉన్నతాధికారులు చర్చల్లో పాల్గొన్నారని తెలిపారు. 2002లో జమ్మూ–కాశ్మీర్‌లో అహింసా ప్రజాస్వామ్య సంస్కృతి కోసం 15 లక్షల సంతకాలు సేకరించిన సిగ్నేచర్‌ క్యాంపెయిన్‌ చేపట్టానని గుర్తుచేశారు. 2022 మే లో ఆయన ‘ఉపా’ చట్టం కింద నేరం ఒప్పుకున్నందున కోర్టు జీవితఖైదు విధించింది. అయితే ఇది “రేర్‌ ఆఫ్‌ ద రేర్‌” కేసు కాదని, కాబట్టి మరణదండన అవసరం లేదని తీర్పులో పేర్కొంది. ఎన్ఐఏ మాత్రం హఫీజ్‌ సయీద్‌, సయీద్‌ సలాహుద్దీన్‌, షబ్బీర్‌ షా తదితరులతో కలిసి పాకిస్తాన్‌ లో ఉండే ఉగ్రమూకలతో చేతులు కలిపి కాశ్మీర్‌లో అశాంతి సృష్టించారని ఆరోపిస్తోంది. తాజాగా ఉపా ట్రిబ్యునల్‌ కూడా జేకేఎల్ఎఫ్ పై విధించిన నిషేధాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించింది.

తన అఫిడవిట్‌లో మరణదండన అంశాన్ని ప్రస్తావిస్తూ మాలిక్‌ ‘నా మరణం ఎవరికైనా ఉపశమనం కలిగిస్తే, అలా జరగనివ్వండి..నేను నవ్వుతూ, గర్వంగా వెళ్తాను’ అని పేర్కొన్నారు. 1984లో ఉరి తీయబడ్డ మక్బూల్‌ భట్‌తో తనను పోల్చుకుంటూ, షేక్స్పియర్‌ మాటలు ఉటంకించారు

మరణాన్ని నిరభ్యంతరంగా స్వీకరించు, అప్పుడు జీవితం గానీ, మరణం గానీ రెండింటిలో ఏదైనా నీకు మరింత మధురంగా అనిపిస్తుంది.

యాసిన్‌ మాలిక్‌పై గతంలో ఉన్న కేసులు

1990 – ఐఏఎఫ్‌ అధికారుల హత్య కేసు

వివరాలు: శ్రీనగర్‌లో జరిగిన కాల్పుల్లో నలుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులను హతమార్చిన ఘటనలో యాసిన్‌ మాలిక్‌ పేరు కూడా ఉంది.

ఆ కాలంలో ఆయన జేకేఎల్ఎఫ్ సాయుధ విభాగానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. సీబీఐ ఈ కేసులో మాలిక్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. ఈ కేసు విచారణ ఇప్పటికీ తిహార్‌ జైలు వీడియో లింక్‌ ద్వారా నడుస్తోంది (2025 నాటికి ఇంకా పెండింగ్‌లో ఉంది).

1990 – రూబయ్యా సయీద్‌ అపహరణ కేసు

టాడా కేసు నమోదైంది. ఆ సంవత్సరం డిసెంబరులో, అప్పటి హోం మంత్రిగా ఉన్న ముఫ్తీ మహ్మద్ సయీద్‌ కుమార్తె రూబయ్యా సయీద్‌ను జేకేఎల్ఎఫ్ మిలిటెంట్లు అపహరించారు. అపహరణ తరువాత ప్రభుత్వం ఐదుగురు ఉగ్రవాదులను విడుదల చేసింది. మాలిక్‌ ఈ కుట్రలో ప్రధాన సూత్రధారుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. 2022లో రూబయ్యా సయీద్‌ కోర్టులో సాక్ష్యమిస్తూ మాలిక్‌నే నన్ను కిడ్నాప్‌ చేశాడు అని గుర్తించింది. ఈ కేసు కూడా ట్రయల్‌ దశలోనే ఉంది.

2019 – ఉగ్రనిధుల సమీకరణ కేసు

ఇది ప్రస్తుతం జీవితఖైదు శిక్షకు దారితీసిన కేసు. పాకిస్తాన్‌ ఆధారిత సంస్థలతో కలసి కాశ్మీర్‌లో అశాంతి సృష్టించడానికి నిధులు సమీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉపా చట్టం కింద ఎన్ఐఏ నమోదు చేసింది.

2010–2016 మధ్య – హింసాత్మక నిరసనలు ప్రేరేపించిన కేసులు

జమ్మూ–కాశ్మీర్‌లో తరచూ జరిగే రాళ్ల దాడులు, హింసాత్మక బంద్‌లు వెనుక మాలిక్‌ పాత్ర ఉందని పోలీసులు అనేక కేసులు నమోదు చేశారు. వీటిలో చాలా కేసులు స్థానిక కోర్టుల్లో విచారణలో ఉన్నాయి.

2018 – మనీ లాండరింగ్‌ కేసు (ఈడీ)

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ 2018లో యాసిన్‌ మాలిక్‌పై మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది. ఉగ్రనిధులను చట్టబద్ధ వ్యాపారాలుగా చూపించి వాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 20 కిపైగా కేసులు నమోదయ్యాయి.

యాసిన్‌ మాలిక్‌కు మరణదండన విధించండి: ఎన్ఐఏ అప్పీల్‌ - Tholi Paluku