Let's talk: editor@tmv.in
యాసిడ్ దాడుల కేసుల్లో కఠిన శిక్షలు అవసరం: సుప్రీంకోర్టు

యాసిడ్ దాడుల కేసుల్లో కఠిన శిక్షలు అవసరం: సుప్రీంకోర్టు

Pinjari Chand
28 జనవరి, 2026

యాసిడ్ దాడుల (యాసిడ్ అటాక్) కేసుల్లో దోషులకు ప్రస్తుతం విధిస్తున్న శిక్షలు సరిపోవని, ఇలాంటి నేరాలను అరికట్టాలంటే అసాధారణంగా కఠినమైన శిక్షలు అవసరమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. వరకట్న మరణాల కేసుల మాదిరిగా, నిందితులే తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే విధంగా చట్టాన్ని సవరించాలా? అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని ఆదేశించింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, న్యాయమూర్తులు ఆర్. మహాదేవన్, జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. యాసిడ్ దాడుల కేసుల్లో శిక్షల తీవ్రత పెంచాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

హర్యానాకు చెందిన యాసిడ్ దాడి బాధితురాలు షాహీన్ మాలిక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారిస్తున్న సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తన పిటిషన్‌లో ఆమె, యాసిడ్ దాడుల వల్ల అంతర్గత అవయవాలకు తీవ్రమైన నష్టం కలిగిన బాధితులను కూడా వికలాంగుల చట్ట పరిధిలోకి తీసుకువచ్చి, వారికి సరైన పరిహారం, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. యాసిడ్ దాడుల కేసుల్లో నిందితులకు విధిస్తున్న శిక్షలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం, ఇలాంటి నేరాలను అరికట్టాలంటే అసాధారణ శిక్షలు అవసరం. నిందితులకు శిక్ష భయంకరంగా అనిపించకపోతే, ఇలాంటి నేరాలు ఆగవు. ఇక్కడ సంస్కరణాత్మక శిక్ష సిద్ధాంతానికి చోటు లేదని వ్యాఖ్యానించింది.

నిందితుల ఆస్తులను జప్తు చేయాలి

నిందితుల ఆస్తులను జప్తు చేసి, బాధితులకు పరిహారం ఇవ్వాలన్న అంశాన్ని కూడా పరిశీలించవచ్చని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. నిరోధక శిక్షలు అవసరం. నిందితుల ఆస్తుల జప్తు వంటి చర్యలు బాధితులకు న్యాయం చేయడంలో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఆర్చనా పాఠక్ దవేకు, యాసిడ్ దాడుల కేసుల్లో శిక్షలు మరింత కఠినంగా ఉండేలా చట్టపరమైన జోక్యం అవసరమవుతుందేమోనని కోర్టు సూచించింది. వరకట్న మరణాల కేసుల్లో ఉన్నట్లుగా, సాక్ష్య బాధ్యతను నిందితులపై మళ్లించే విధానాన్ని పరిశీలించాలని పేర్కొంది. ఇది వరకట్న మరణాల కంటే తక్కువ తీవ్రత గల నేరం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది, షాహీన్ మాలిక్ కేసులోని నిందితులందరూ నిర్దోషులుగా విడుదలయ్యారని, ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం ఆమెకు ఉత్తమ న్యాయవాదుల సేవలు అందించేలా ఉచిత న్యాయ సహాయం కల్పిస్తామని హామీ ఇచ్చింది. షాహీన్ మాలిక్ మాట్లాడుతూ, తనపై యాసిడ్ దాడి జరిగినప్పుడు తన వయసు 26 సంవత్సరాలని, ప్రస్తుతం 42 ఏళ్లు వచ్చాయని, అయినా ఇప్పటికీ న్యాయపోరాటం ముగియలేదని వాపోయారు. 16 సంవత్సరాలపాటు కోర్టుల చుట్టూ తిరిగి చివరికి నిందితులు విడుదల కావడం తన జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని తెలిపారు. తన అప్పీల్‌ను వేగంగా విచారించాలని హైకోర్టును ఆదేశించాలని ఆమె కోరారు.

యాసిడ్ దాడుల కేసుల వివరాలు ఇవ్వండి

అదేవిధంగా, దేశవ్యాప్తంగా యాసిడ్ దాడుల కేసులపై సమగ్ర సమాచారం అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సంవత్సరాల వారీగా నమోదైన యాసిడ్ దాడుల కేసుల సంఖ్య, కోర్టుల్లో వాటి స్థితి, దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్‌షీట్లు దాఖలైన కేసుల వివరాలు, అప్పీళ్ల సంఖ్య వంటి సమాచారాన్ని నాలుగు వారాల్లో సమర్పించాలని ఆదేశించింది. బాధితుల విద్యార్హతలు, ఉద్యోగ స్థితి, వివాహ స్థితి, ఇప్పటివరకు పొందిన వైద్య చికిత్స, ఖర్చైన లేదా ఖర్చు కాబోయే వైద్య వ్యయాలు, పునరావాస పథకాల వివరాలను కూడా సమర్పించాలని కోర్టు పేర్కొంది. బలవంతంగా యాసిడ్ తాగించిన ఘటనల వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశించింది.

ఇదివరకే, దేశవ్యాప్తంగా యాసిడ్ దాడుల కేసుల పెండింగ్‌పై అన్ని హైకోర్టుల నుంచి నివేదికలు కోరిన ధర్మాసనానికి ఇప్పటివరకు 15 హైకోర్టులు వివరాలు అందించాయి. అందిన సమాచార ప్రకారం, ఉత్తరప్రదేశ్‌లో 198, పశ్చిమ బెంగాల్‌లో 60, గుజరాత్‌లో 114, బీహార్‌లో 68, మహారాష్ట్రలో 58 యాసిడ్ దాడుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ గణాంకాలను గమనించిన సుప్రీంకోర్టు, ఈ కేసులను ప్రాధాన్య ప్రాతిపదికన, నిర్దిష్ట కాలవ్యవధిలో ముగించేలా హైకోర్టులు పరిపాలనా స్థాయిలో ఆదేశాలు ఇవ్వాలని సూచించింది. అలాగే అన్ని రాష్ట్ర న్యాయసేవల సంస్థలు, బాధితుల పునరావాసం, పరిహారం, వైద్య సహాయానికి అమలు చేస్తున్న పథకాల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. డిసెంబర్ 4న జరిగిన గత విచారణలో, యాసిడ్ దాడుల కేసుల్లో ఆలస్యమైన విచారణలను వ్యవస్థపై ఎద్దేవాగా అభివర్ణించిన సుప్రీంకోర్టు, నాలుగు వారాల్లో దేశవ్యాప్తంగా పెండింగ్ కేసుల వివరాలు అందించాలని హైకోర్టులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

యాసిడ్ దాడుల కేసుల్లో కఠిన శిక్షలు అవసరం: సుప్రీంకోర్టు - Tholi Paluku