Let's talk: editor@tmv.in
యాషెస్.. కంగారూలదే

యాషెస్.. కంగారూలదే

Pinjari Chand
9 జనవరి, 2026

ఆస్ట్రేలియా–ఇంగ్లండ్ మధ్య జరిగిన ప్రతిష్ఠాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1తో గెలుచుకుంది. చివరి టెస్ట్‌లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను ఘనంగా ముగించింది. ఈ సిరీస్ మొత్తం ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో, ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌లో, అలెక్స్ కేరీ వికెట్‌ కీపింగ్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టును ముందుకు నడిపించారు.

ఆస్ట్రేలియా ఆధిపత్యానికి గణాంకాలే నిదర్శనం

• మిచెల్ స్టార్క్: 5 టెస్టుల్లో 31 వికెట్లు, సగటు 19.9

• ట్రావిస్ హెడ్: 3 సెంచరీలు, మొత్తం 629 పరుగులు

• అలెక్స్ కేరీ: వికెట్‌కీపర్‌గా 28 డిస్మిసల్స్

ఈ ప్రదర్శనలు యాషెస్ చరిత్రలో ఆస్ట్రేలియన్ ఆటగాళ్ల అత్యుత్తమ గణాంకాల్లో ఒకటిగా నిలిచాయి. స్టీవ్ స్మిత్ (ప్యాట్ కమ్మిన్స్ లేకపోవడంతో నాలుగు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు) మాట్లాడుతూ ఈ సిరీస్‌లో ప్రతి ఒక్కరూ వేర్వేరు సందర్భాల్లో ముందుకు వచ్చారు. స్టార్క్, హెడ్, కేరీ ప్రధాన ఆకర్షణలే అయినా, మిగతా ఆటగాళ్లూ కీలక సమయంలో రాణించారు. అదే ఒక గొప్ప జట్టుకు నిదర్శమని తెలిపారు.

342 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్

ఐదో రోజు ఉదయం ఇంగ్లండ్ 302/8తో ఆటను తిరిగి ప్రారంభించింది. ఆస్ట్రేలియా బౌలర్లు ఇంగ్లండ్‌ను 342 పరుగులకు ఆలౌట్ చేశారు. దీంతో ఆస్ట్రేలియాకు 160 పరుగుల లక్ష్యం లభించింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 161/5తో మ్యాచ్‌ను ముగించింది. అలెక్స్ కేరీ అత్యధిక పరుగులు చేయగా, క్యామరన్ గ్రీన్ 22 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఉస్మాన్ ఖవాజాకు గౌరవ వీడ్కోలు

ఈ మ్యాచ్‌తో 39 ఏళ్ల ఉస్మాన్ ఖవాజా టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతను బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఇంగ్లండ్ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. బెన్ స్టోక్స్‌తో చేతులు కలిపి, మార్నస్ లబుషేన్‌ను ఆలింగనం చేసుకున్నాడు. అవుటైన తర్వాత ఖవాజా మైదానంలో మోకరిల్లి, పిచ్‌ను ముద్దాడి ప్రేక్షకులకు అభివాదం చేశాడు. మైదానంలో ‘Thank You Uzzy’ అనే సందేశం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

కీలక ఘట్టాలు

మార్నస్ లబుషేన్ 20 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ ను ఇంగ్లాండ్ ఆటగాళ్లు వదిలేయడంతో లైఫ్ లభించింది. దీంతో అదే ఓవర్‌లో 16 పరుగులు సాధించి మ్యాచ్‌ను ఆస్ట్రేలియా వైపునకు తిప్పాడు అయితే తర్వాత రన్ అవుట్‌గా వెనుదిరిగాడు (37). 121/5 వద్ద మ్యాచ్ కొంత ఉత్కంఠభరితంగా మారినా, కేరీ–గ్రీన్ జోడీ జట్టును విజయ తీరాలకు చేర్చింది. స్టార్క్‌ సిరీస్ మొత్తంలో 31 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు.

వివాదాస్పద డీఆర్ఎస్ నిర్ణయం

చివరి రోజు ఒక డీఆర్ఎస్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. జేక్ వెదరాల్డ్ బ్యాట్‌కు బంతి తాకినట్లు అనిపించినా, స్పష్టమైన ఆధారాలు లేవంటూ థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని నిలిపివేశాడు. దీనిపై ఇంగ్లండ్ ఆటగాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెన్ స్టోక్స్ పరిస్థితిని శాంతింపజేశారు.

ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ మేము ఇంకా మెరుగ్గా ఆడగలమనే భావన ఉంది. కానీ ఐదు టెస్టుల పాటు ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడింది. కొంత నష్టం మేమే చేసుకున్నామని అంగీకరించాడు. సిడ్నీ టెస్ట్‌కు ఐదు రోజుల్లో మొత్తం 2,11,032 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇది సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ చరిత్రలోనే అత్యధికం.