Let's talk: editor@tmv.in
యాషెస్ ఆసీస్ దే

యాషెస్ ఆసీస్ దే

Pinjari Chand
22 డిసెంబర్, 2025

విమర్శలు, గాయాలు, అనిశ్చితులు అన్నీ ఒకేసారి ముప్పిరిగొన్నప్పటికి, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వెనక్కి తగ్గలేదు. 15 ఏళ్లలో చెత్త జట్టు అన్న వ్యాఖ్యలను సవాలుగా తీసుకున్న కంగారూలు, ఇంగ్లండ్‌పై రెండు టెస్టులు మిగిలి ఉండగానే యాషెస్ సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.

గత 15 ఏళ్లలో ఇదే అత్యంత బలహీనమైన ఆస్ట్రేలియా జట్టు అన్న విమర్శల నడుమ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, అదే మాటలను తన బలంగా మలుచుకొని ఇంగ్లండ్‌పై యాషెస్ సిరీస్‌ను రెండు టెస్టులు మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. పూర్తి స్థాయి ఆటగాళ్లు లేకపోయినా, కీలక సందర్భాల్లో జట్టు సమష్టిగా రాణించడంతో ఆస్ట్రేలియా 3-0తో సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ వెటరన్ స్టువర్ట్ బ్రాడ్ చేసిన వ్యాఖ్యలు ఈ పోరుకు నిప్పు రాజేశాయి. 2010–11లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాలో చివరిసారిగా గెలిచిన యాషెస్ సిరీస్‌లో ఆడిన బ్రాడ్, ఈసారి ఆస్ట్రేలియా జట్టును 15 ఏళ్లలో చెత్త జట్టుగా అభివర్ణించాడు. అయితే ఆ వ్యాఖ్యలు కంగారూలకు అవమానంగా కాకుండా ప్రేరణగా మారాయి. ఆ సిరీస్‌లో బ్రాడ్ రెండు టెస్టులు ఆడాడు. అప్పటి నుంచి ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్‌కు గెలుపన్నదే లేకుండా 16 ఓటములు, రెండు డ్రాలు నమోదయ్యాయి.

పోరాడినా.. ఓటమే

అడిలైడ్ టెస్టులో ఇంగ్లండ్ చివరి రోజు అద్భుత పోరాటం చేసినప్పటికీ, 435 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 352 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియా 82 పరుగుల తేడాతో గెలిచి యాషెస్‌ను ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్ మొత్తం ఐదు రోజులు సాగగా, అడిలైడ్ ఓవల్‌లో 2,23,638 మంది ప్రేక్షకులు మ్యాచ్‌ను వీక్షించారు.

గాయాలతో ఆసీస్ సతమతం

ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా గాయాల సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పి కారణంగా తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. మొత్తం సిరీస్‌కే జోష్ హేజిల్‌వుడ్ దూరమయ్యాడు. రెండో టెస్టులో నాథన్ లయన్‌ను పక్కన పెట్టారు. మూడో టెస్టుకు స్టీవ్ స్మిత్ వెర్టిగో కారణంగా ఆడలేకపోయాడు.

అంచనాలకు మించి రాణించిన స్టార్క్

ఇలాంటి పరిస్థితుల్లో మిచెల్ స్టార్క్ ఒక్కరే అనుభవజ్ఞుడైన బౌలర్‌గా బాధ్యతలు మోశాడు. స్టార్క్ అంచనాలను మించి రాణించాడు. సిరీస్‌లో ఇప్పటివరకు 22 వికెట్లు తీసి, క్యాలెండర్ ఇయర్‌లో 51 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. తొలి రెండు టెస్టుల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు కూడా అతనికే దక్కాయి. అడిలైడ్ టెస్టులో చివరి నాలుగు వికెట్లలో మూడింటిని స్టార్క్ పడగొట్టి ఇంగ్లండ్ ఆశలను గల్లంతు చేశాడు.

బ్యాటింగ్‌లోనూ చేసిన అనూహ్య మార్పులు ఆస్ట్రేలియాకు కలిసి వచ్చాయి. ఉస్మాన్ ఖవాజాకు గాయం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్‌ను ఓపెనర్‌గా పంపగా, అతను తొలి టెస్టులోనే సెంచరీతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. అడిలైడ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మ్యాచ్ అనంతరం మార్నస్ లబుషేన్ మాట్లాడుతూ,

మమ్మల్ని చెత్త జట్టు అంటారు. కానీ ఇప్పుడు 3-0తో ముందున్నాం. పని ఇంకా పూర్తవలేదు. 5-0తో యాషెస్‌ను గెలవాలన్నదే మా లక్ష్యమని వ్యాఖ్యానించాడు. ఏం జరిగినా ముందున్న ఆటపై దృష్టి పెడతాం. ఎవరు లేకపోయినా పరిస్థితులకు తగ్గట్టు ముందుకు సాగుతాం. అదే మా విజయానికి కారణమని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. బాక్సింగ్ డే నుంచి మెల్‌బోర్న్‌లో ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో కమిన్స్, లయన్ ఆడే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ, ఇప్పటికే యాషెస్‌ను నిలుపుకున్న ఆస్ట్రేలియా జట్టు ఆత్మవిశ్వాసంతో ఉరకలు వేస్తోంది. ఇంటర్వ్యూలో ట్రావిస్ హెడ్‌ను ఈ జట్టులో భాగమవడం ఎలా ఉంది? అని అడిగితే, అతను చిరునవ్వుతో

అద్భుతం… నిజంగా అద్భుతం అని సమాధానమిచ్చాడు.