
యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం - 10 మందికి గాయాలు
యాదాద్రి భువనగిరి జిల్లా దండుమైలారం సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న నిడదవోలు డిపోకు చెందిన ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు అదుపుతప్పి అతివేగంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున వెలుతురు సరిగ్గా లేకపోవడం లేదా డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఘటనపై పోలీస్ అధికారి మాట్లాడుతూ, ఉదయం సమయంలో ప్రమాద సమాచారం అందిందని, గాయపడిన ప్రయాణికులను తక్షణమే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు దండుమైలారం వద్ద ట్రక్కును ఢీకొట్టిందని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందన్నారు. రోడ్డు ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాలను తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.
