Let's talk: editor@tmv.in
యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు నైనీ బొగ్గు తొలి రేక్‌ చేరిక

యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు నైనీ బొగ్గు తొలి రేక్‌ చేరిక

Gaddamidi Naveen
2 సెప్టెంబర్, 2026

యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎస్‌) విద్యుత్‌ ఉత్పత్తిలో మరో కీలక మైలురాయిని అధిగమించింది. సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) ఆధ్వర్యంలోని ఒడిశా నైనీ బొగ్గు గని నుంచి సేకరించిన అధిక నాణ్యత గల బొగ్గుతో కూడిన తొలి రైల్వే రేక్‌ మంగళవారం యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు చేరుకుంది. సుమారు 4,000 టన్నుల బొగ్గుతో వచ్చిన ఈ రేక్‌ను టీజీజెన్‌కో డైరెక్టర్‌ (బొగ్గు, లాజిస్టిక్స్‌) బి. నాగ్య, డైరెక్టర్‌ (థర్మల్‌, ప్రాజెక్ట్స్‌) వై. రాజశేఖర్‌రెడ్డి ఘనంగా స్వాగతించారు.

నైనీ బ్లాక్‌ నుంచి సరఫరా అవుతున్న బొగ్గు అధిక క్యాలరిఫిక్‌ విలువను కలిగి ఉండటంతో తక్కువ పరిమాణంలోనే అధిక ఉష్ణ సామర్థ్యాన్ని అందించే అవకాశం ఉంది. దీంతో వైటీపీఎస్‌ బాయిలర్ల పనితీరు మెరుగుపడటంతో పాటు విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం పెరగనుంది. అధిక నాణ్యత కారణంగా బూడిద సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి సుమారు 1,050 కిలోమీటర్ల దూరం రవాణా చేయాల్సి వచ్చినప్పటికీ, బొగ్గు నాణ్యత, అధిక ఉష్ణ సామర్థ్యం దృష్ట్యా రవాణా వ్యయం సమర్థవంతంగా వినియోగపడుతుందని పేర్కొన్నారు.

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో టీజీజెన్‌కో, సింగరేణి, భారతీయ రైల్వేల మధ్య సమన్వయంతో తొలి రేక్‌ రవాణా విజయవంతమైంది. రాబోయే రోజుల్లో నైనీ గని నుంచి నిరంతరంగా బొగ్గు రేకులు చేరుకోనుండటంతో వైటీపీఎస్‌లో తగినంత బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండనున్నాయి. తద్వారా రాష్ట్రానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడానికి మరింత వెసులుబాటు కలగనుంది. కార్యక్రమంలో చీఫ్‌ ఇంజనీర్లు శ్రీనివాసరావు, సురేష్‌, సూర్యనారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.