
యాంత్రీకరణ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకి: మంత్రి తుమ్మల
వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు అందించే పనిముట్లను ఖరారు చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈసారి పథకం కింద ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మధ్యవర్తిత్వానికి తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారులకు ప్రయోజనం అందేలా వ్యవస్థను రూపొందించాలని సూచించారు.
రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, సహకార శాఖల పరిధిలోని పలు అంశాలపై మంత్రి తుమ్మల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ యాంత్రీకరణ, ఎరువుల లభ్యత, యూరియా సరఫరా, ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, రైతు వేదికలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. యాంత్రీకరణ పథకంలో రైతుల అవసరాలకు అనుగుణంగా పనిముట్లను ఎంపిక చేసి పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. పనిముట్లు సరఫరా చేసే సంస్థల ఎంప్యానెల్‌మెంట్ జాబితాను హాకా అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. నాణ్యత, ధర, రైతులకు అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని జాబితాను త్వరగా ఖరారు చేయాలని సూచించారు.
యూరియా సరఫరాలో ఇబ్బందులు లేవు
రాష్ట్రంలో యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని తుమ్మల స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఫెర్టిలైజర్ యాప్‌లో మ్యాపింగ్ వంటి సమస్యలు తలెత్తితే జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు వాటిని వెంటనే గుర్తించి కేంద్ర అధికారులతో సమన్వయం చేసుకుని అదే రోజు పరిష్కరించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. యాప్ వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 2.79 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 0.33 లక్షల టన్నుల డీఏపీ, 2.25 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 0.31 లక్షల టన్నుల ఎంఓపీ, 0.20 లక్షల టన్నుల ఎస్‌ఎస్‌పీ అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఆగస్టు సరఫరా ప్రణాళికలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు గాను 1.17 లక్షల టన్నులు రాష్ట్రానికి చేరేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులకు కూడా తగిన సబ్సిడీ ఇవ్వాలని తుమ్మల కోరారు. యూరియాపై అధిక సబ్సిడీ, ఇతర ఎరువులపై తక్కువ సబ్సిడీ కారణంగా రైతులు యూరియాను అధికంగా వినియోగించే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ పంటలకు అవసరమైన అన్ని పోషకాలు సమతుల్యంగా అందేలా సబ్సిడీ విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని కోరారు.
ఆయిల్‌పామ్ సాగుకు ప్రాధాన్యం
రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణను మరింత వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. డిమాండ్ అధికంగా ఉన్న జిల్లాలకు ప్రాధాన్యంతో మొక్కలను సరఫరా చేసి, దరఖాస్తు చేసుకున్న రైతులకు రెండు మూడు రోజుల్లోనే మొక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నర్సరీల్లో నిర్ణయించిన లక్ష్యానికి కనీసం రెండింతల మొక్కలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆయిల్‌పామ్‌లో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహించాలని, డ్రిప్ కంపెనీలతో సమన్వయం చేసుకుని రైతులకు త్వరగా వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయిల్‌పామ్ మిల్లుల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
2600 రైతు వేదికలపై సోలార్ ప్యానెల్స్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2600 రైతు వేదికలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని తుమ్మల ఆదేశించారు. దశలవారీగా కార్యాచరణ రూపొందించి రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు. హాకా, రెడ్కో అధికారులతో సమన్వయం చేసుకుని సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రాజెక్టును త్వరగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
