Let's talk: editor@tmv.in
యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు ఈడీ నోటీసులు

యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు ఈడీ నోటీసులు

Shaik Mohammad Shaffee
17 సెప్టెంబర్, 2025

బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ యాప్స్ను ప్రమోట్ చేసిన కారణంగా ఇప్పటికే పలువురు ప్రముఖులు విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలు కూడా ఆ లిస్ట్లో చేరిపోయారు. అక్రమ బెట్టింగ్ యాప్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఉతప్ప, యువరాజ్ సింగ్లకు మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ 22న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఉతప్పను, 23న హాజరుకావాలని యువరాజ్ సింగ్ను ఆదేశించినట్లుగా అధికారిక వర్గాలు తెలిపాయి.

కాగా ఈ కేసులో ఈడీ ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించింది. ఇటీవల మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనా వాంగ్మూలాలను ఈడీ నమోదు చేసింది. తాజాగా ఇదే కేసులో టీఎంసీ మాజీ ఎంపీ, నటి మిమీ చక్రవర్తిని ఈడీ సోమవారం విచారించి ఆమె వాగ్మూలం నమోదు చేసింది. బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా మంగళవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా, నటుడు సోనూ సూద్లను కూడా ఈడీ విచారణకు పిలిచింది. 1xBet యాప్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కింద దర్యాప్తు చేస్తోంది. భారతదేశంలో నిషేధించబడిన ఈ యాప్ ప్రచార కార్యక్రమాలలో ప్రముఖులు పాల్గొనడంతో ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరిస్తోంది.

ఒప్పందాలు, పారితోషికంపై ప్రశ్నలు!

క్రికెట్ నుండి రిటైర్ అయిన ఉతప్ప, యువరాజ్ సింగ్లు గతంలో 1xBet ప్రచార వీడియోలలో కనిపించారు. ఈడీ అధికారులు వీరిద్దరినీ ఈ కంపెనీతో వారికున్న సంబంధాల గురించి, కుదుర్చుకున్న ఒప్పందాలు, అందుకున్న పారితోషికం గురించి ప్రశ్నించే అవకాశం ఉంది. అక్రమ బెట్టింగ్ యాప్లపై ఈడీ చేస్తున్న దర్యాప్తులో భాగంగానే వీరికి సమన్లు జారీ అయ్యాయి. భారతదేశంలో అక్రమంగా పనిచేస్తున్న ఈ బెట్టింగ్ యాప్లు ప్రజలను, పెట్టుబడిదారులను మోసం చేయడం, భారీగా పన్నులు ఎగవేసినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. ఈ యాప్లతో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలు భారత చట్టాలను ఉల్లంఘించడంతో పాటు నేరాల ద్వారా ఆర్జించిన డబ్బును మనీలాండరింగ్ చేసినట్లుగా ఈడీ భావిస్తోంది. ఈ కేసులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, పీఎంఎల్ఏ వంటి అనేక చట్టాలు ఉల్లంఘించబడినట్లుగా ఈడీ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పలకు ఈడీ నోటీసులు - Tholi Paluku