
యువతలో హార్ట్ ఎటాక్ ముప్పు మరో ప్రాణం బలి
దేశవ్యాప్తంగా గుండెపోటు కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు వృద్ధులకే పరిమితమైన ఈ వ్యాధి ఇప్పుడు యువకుల ప్రాణాలకు పెద్ద ముప్పుగా తయారైంది. అయితే చెన్నైలోని సవిత మెడికల్ కాలేజీకి చెందిన 39 ఏళ్ల కార్డియాలజిస్ట్ ఆసుపత్రిలో విధుల్లో ఉండగానే హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన సంఘటన మరవకముందే మరో విషాదం చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో స్థానికంగా నివసిస్తున్న ఏకలవ్య (30) అనే యువకుడు తన మిత్రుడితో కలిసి జ్యూస్ సెంటర్కి వెళ్లాడు. జ్యూస్ తాగుతున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఉలుకు పలుకు లేకుండా పడిఉన్న ఏకలవ్యని చూసిన చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. అంబులెన్స్ సమయానికి అందుబాటులో లేకపోవడంతో చివరికి పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వైద్యులు అతను మృతిచెందినట్లు ధృవీకరించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. కాగా ఈ సంఘటన మొత్తం సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇక మృతుడు ఏకలవ్య ఖమ్మం జిల్లా పల్లెపాడుకు చెందిన వ్యక్తి. ఉద్యోగ నిమిత్తం పట్నంలో నివసిస్తున్నట్లు సమాచారం.
30 ఏళ్ల వయస్సులోనే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి సంఘటనలు తరచూ జరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.హృదయ వ్యాధులు తగ్గించుకోవాలంటే జీవనశైలిలో మార్పులు తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహారం, వ్యాయామం, ఒత్తిడి తగ్గించడం, స్మార్ట్ఫోన్ వాడకం నియంత్రణ ఇవన్నీ గుండె ఆరోగ్యానికి అవసరమని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏవైనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
