Let's talk: editor@tmv.in
యలమంచిలి ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం: ఒకరు మృతి

యలమంచిలి ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం: ఒకరు మృతి

Panthagani Anusha
30 డిసెంబర్, 2025

విశాఖ జిల్లా యలమంచిలి సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. టాటానగర్ నుంచి ఎర్నాకులం వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 18189)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ దుర్ఘటనలో ఒక ప్రయాణికుడు సజీవ దహనమవ్వగా మూడు ఏసీ బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

పోలీసులు మరియు రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:45 గంటల సమయంలో రైలు యలమంచిలి పరిసరాల్లో ఉన్నప్పుడు బి1, ఎం2 బోగీల్లో మంటలు మొదలయ్యాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు పొగ రావడాన్ని గమనించి కేకలు వేయడంతో లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. ప్రమాద సమయంలో బి1 బోగీలో 82 మంది, ఎం2 బోగీలో 76 మంది ప్రయాణికులు ఉన్నారు.

మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అధికారులు నిర్వహించిన గాలింపులో బి1 బోగీలో ఒక మృతదేహం లభించింది. మృతుడిని తమిళనాడుకు చెందిన చంద్రశేఖర్ సుందరం(70) వృద్ధుడిగా గుర్తించారు. మిగిలిన ప్రయాణికులందరినీ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాలు, రైల్వే భద్రతా బలగాలు మరియు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు వ్యాపించకుండా జాగ్రత్త చర్యగా దెబ్బతిన్న బి1, ఎం2 బోగీలతో పాటు వాటి పక్కనే ఉన్న ఎం1 (ఏసీ III టియర్) బోగీని కూడా రైలు నుంచి విడదీశారు. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.

ప్రభావితమైన బోగీల ప్రయాణికులను ప్రత్యేక బస్సుల ద్వారా సామర్లకోట రైల్వే స్టేషన్‌కు తరలించారు. అక్కడ రైలుకు మూడు ప్రత్యామ్నాయ బోగీలను జత చేసి, ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు పంపేలా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు.

మరోవైపు ప్రాథమిక దర్యాప్తులో సాధారణంగా మంటలు చెలరేగే విద్యుత్ ప్యానెల్‌ వైపు నుంచి కాకుండా లినెన్ నిల్వ చేసే ప్రాంతం నుంచి అగ్ని ప్రమాదం సంభవించినట్లు తేలిందని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) విజయవాడ డివిజన్‌ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. మృతుడి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని రైల్వే అధికారులు ప్రకటించారు.

ఇదిలా ఉండగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌ మాట్లాడుతూ యలమంచిలి స్టేషన్‌లో బ్రేకులు వేసిన సమయంలో ఒత్తిడి అసమతుల్యత గుర్తించడంతో ఇంజిన్‌లో అలర్ట్‌ వచ్చిందని తెలిపారు. లోకో పైలట్‌, స్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించారని చెప్పారు. మొత్తం 143 మందిని సురక్షితంగా తరలించాం అని కలెక్టర్ తెలిపారు.

రైల్వే ఫోరెన్సిక్ విభాగం ప్రభావిత బోగీలను పరిశీలించిన తర్వాత ఘటనకు ఖచ్చితమైన కారణం తేలుస్తుందని చెప్పారు. అదేవిధంగా నిలిచిపోయిన ప్రయాణికులకు ఆహారం, తాగునీరు అందించిన అనంతరం మిగిలిన బోగీలు ఎర్నాకులం వైపు ప్రయాణం కొనసాగించాయని కలెక్టర్ వెల్లడించారు.