
యూరియా కోసం మరోసారి మొర - 2 లక్షల టన్నుల యూరియా కావాలని
ఎక్కడ చూసినా క్యూలైన్లు, ధర్నాలు, ఆందోళనలు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు యూరియా కొరత విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయా? నిజంగానే రైతుల కష్టాలను పట్టించుకుంటున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం, రాష్ట్రం పరస్పరం ఆరోపణలు చేసుకోవడం మినహా రైతుల సమస్యలు తీరడం లేదు. క్యూలైన్లు ఆగడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు 2 లక్షల యూరియా కావాలంటూ మొర పెట్టుకున్నారు. మరి ఆయన గోడును కేంద్రం పట్టించుకుంటుందా? లేదంటే తుమ్మల కూడా మొక్కుబడిగా ఓ వినతి పత్రం సమర్పించారా? అన్నది వేచి చూడాలి.
తీవ్ర కొరత
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. రైతులు ఎరువుల కోసం పగలు రాత్రి క్యూలలో నిలబడుతున్నారు. బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు జోరందుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వివాదాలు ముదిరిపోతున్నాయి. దీని వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణలో ఈ ఖరీఫ్ సీజన్కు మొత్తం 10.48 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అధికారిక అంచనాలు ఉన్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం 9.8 లక్షల టన్నులు మాత్రమే హామీ ఇచ్చింది. వాస్తవానికి, ఆగస్టు వరకు 8.3 లక్షల టన్నులు కేటాయించినా, కేవలం 5.6 లక్షల టన్నులు మాత్రమే సరఫరా అయ్యాయి. దీని వల్ల రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. పంటలు పోషక లోపంతో బలహీనమవుతున్నాయి, కీటకాల దాడికి గురవుతున్నాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ రైతు గాయపడ్డారు.
కష్టాలు, బ్లాక్ మార్కెట్
రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు వేదికలు, యూరియా పంపిణీ కేంద్రాల వద్ద క్యూలలో నిలబడుతున్నారు. ఇటీవల చెన్నూర్ నియోజకవర్గంలోని కిష్టంపేట గ్రామంలో ఉదయం 7 గంటల నుంచే రైతులు లైన్లో నిలిచారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రిళ్లు కూడా క్యూలైన్లలోనే ఉంటున్నారు. మరోవైపు బ్లాక్ మార్కెట్ జోరందుకుంది. కాంగ్రెస్ నాయకులు యూరియాను బ్లాక్లో అమ్ముతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దీని వల్ల రైతులు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోంది. పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గితే, ఆర్థికంగా నష్టపోతారు.
గత 10 ఏళ్లలో లేని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ను కలిసి, మరో 2 లక్షల టన్నుల యూరియా కేటాయించాలని కోరారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. కేంద్రం వల్లే కొరత వచ్చిందని ఆరోపించారు. దిగుమతులపై అధిక ఆధారపడటం, ఉగ్రవాద దాడి వల్ల సరఫరా ఆలస్యమని కొందరు చెబుతున్నారు. అధికారులు కొరత తగ్గిందని చెబుతున్నా, రైతులు మాత్రం ఇంకా ఇబ్బందులు పడుతున్నారు.
పరస్పర ఆరోపణలు
ఈ సమస్య రాజకీయ రంగు పలుముకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని తప్పుపడుతోంది. బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనాన్ని ఎత్తిచూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం 10,350 టన్నులు కేటాయించగా, తెలంగాణకు మొండి చేయి చూపిందని విమర్శలు ఉన్నాయి.రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే కొరత వచ్చిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కొరత ఉందని, కానీ తెలంగాణలో తీవ్రమని నివేదికలు చెబుతున్నాయి. తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలు అమలవుతున్నా, ఎరువుల కొరత వల్ల ప్రయోజనం లేదు. కేంద్ర-రాష్ట్ర సమన్వయం పెంచి, దిగుమతులు వేగవంతం చేయాలి. స్థానిక ఉత్పత్తిని ప్రోత్సహించాలి. రాజకీయాలు పక్కనపెట్టి, రైతుల సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే, ఖరీఫ్ సీజన్ దెబ్బతిని, ఆహార భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
