
యూరియా కోసం క్యూ లైన్లో మాజీ మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్న వేళ, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రైతులతో కలిసి క్యూలైన్లో నిలబడి నిరసన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు రైతు వేదిక వద్ద ఆమె తన 5.5 ఎకరాల సాగుభూమి పట్టా పాస్బుక్తో కూపన్ రాయించుకుని కేవలం ఒక బస్తా యూరియా పొందారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన ఆమె, ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
'ఒక్క బస్తా ఎలా సరిపోతుంది?'
గుండ్రాతిమడుగు సహకార సంఘం వద్ద ఉదయం నుంచి రైతులు గంటల తరబడి క్యూలైన్లో నిలబడ్డారు. సత్యవతి రాథోడ్ కూడా వారితో కలిసి వేచి చూసి కూపన్ పొందారు. అయితే, 5.5 ఎకరాల సాగుభూమికి ఒక్క బస్తా యూరియా మాత్రమే ఇవ్వడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "వారాల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదు. ప్రభుత్వం కుంటిసాకులు చెప్పకుండా రైతులకు తగినంత యూరియా అందించాలి," అని ఆమె డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఈ సంఘటనను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
నిరసనలు, ఆత్మహత్యా ప్రయత్నాలు
తెలంగాణలో యూరియా కొరత ఖరీఫ్ సీజన్ నుంచి ముదిరిపడింది. మహబూబాబాద్లో యూరియా దొరక్కపోవడంతో ఒక రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రైతులు రహదారులు బంద్ చేసి వంటలు చేస్తూ నిరసనలు చేపట్టారు. డోర్నాల్ మండలంలో రైతులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. మరోవైపు బ్లాక్ మార్కెట్లో ఒక్కో బస్తా ధర ₹800 నుంచి ₹1200కి పెరిగింది. కాంగ్రెస్ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని అందుకే యూరియా కొరత ఉత్పన్నమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారు కూడా కాంగ్రెస్ నేతలేనన్నది బీఆర్ఎస్ ఆరోపణ.
కొరత లేదు, పంపిణీలోనే సమస్య
రాష్ట్రంలో యూరియా కొరత లేదని, పంపిణీ సమస్య ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి పర్యటనలో మాట్లాడుతూ.. "కేంద్రం 12.47 లక్ష మెట్రిక్ టన్నులు సరఫరా చేసింది. రైతులు ఆందోళనతో క్యూలో ఉంటున్నారు. రాష్ట్రంలో యూరియా సమస్య అంత తీవ్రంగా ఏమీ లేదు కానీ.. సోషల్ మీడియాలో కొరత ఉందని ప్రచారం జరగడంతో ఒక్కసారిగా రైతులు వచ్చి క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు అంటూ ముఖ్యమంత్రి ఈ సమస్యపై స్పందించారు. కానీ ముఖ్యమంత్రి స్పందన మీద కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిజంగానే రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంటే అసలు రైతులు క్యూలైన్లలో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు ఉంటుందని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఉత్పత్తి పునఃప్రారంభించడంతో 60 వేల మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఫిబ్రవరి 2026 వరకు 3 లక్ష మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయ లోపం
ఈ సమస్య రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను విమర్శిస్తున్నాయి. "కాంగ్రెస్ పాలనలో రైతుల ప్రాణాలు పోతున్నాయి," అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం కేంద్రం నుంచి సకాలంలో యూరియా సరఫరా జరగడం లేదని చెబుతోంది. అయితే తాము సరిపడా యూరియా ఇస్తున్నా కాంగ్రెస్ నేతలు బ్లాక్ మార్కెట్ కు యూరియాను తరలించడం వల్లే ఈ సమస్య వస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 3.94 లక్ష టన్నుల యూరియాను పంపిణీ చేయాలంటూ కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎన్డీయే సర్కారు అధికారంలో ఉండటంతో పక్క రాష్ట్రమైన ఏపీలో యూరియా కొరత లేదని .. కానీ తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఎందుకు తీవ్రంగా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ విషయంలో ఒకలా.. తెలంగాణ విషయంలో మరోలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
రైతులకు ఉపశమనం ఎప్పుడు?
వరి సాగు విపరీతంగా పెరగడం.. గ్లోబల్ సరఫరా అడ్డంకుల వల్ల ఈ సమస్య తీవ్రమైనట్టు తెలుస్తోంది. పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడం, బ్లాక్ మార్కెట్పై చర్యలు తీసుకోవాలని రైత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రం-రాష్ట్రం సమన్వయంతోనే సమస్య పరిష్కారమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. రైతుల ఇబ్బందులు తీర్చేందుకు తక్షణ చర్యలు అవసరమని అందరూ కోరుకుంటున్నారు.
ఫొటో రైటప్: యూరియా కోసం క్యూ లైన్ లో వేచి చూస్తున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
