
యూరియా అడిగితే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?
తెలంగాణ రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. యూరియా అడిగితే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని పేర్కొన్నారు. అసలు కాంగ్రెస్ పాలనలో ప్రశ్నించడమే పాపంగా మారిందన్నారు. బుధవారం తెలంగాణ భవన్ లో కరీంనగర్ కు చెందిన నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని పేర్కొన్నారు. రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయని రేవంత్ రెడ్డిది సిగ్గుమాలిన ప్రభుత్వం అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘యూరియా కోసం రైతులు రోడ్డెక్కితే పోలీసులతో పొట్టు పొట్టు కొట్టిస్తున్నారు. సూర్యాపేటలో యూరియా ఆందోళనలో పాల్గొన్న గిరిజన యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ దాష్టీకాన్ని మేము వదిలిపెట్టం. ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్ల దృష్టికి తీసుకెళ్తాం.రైతులను కొట్టడమేనా రాహుల్ గాంధీ చెప్పిన 'మొహబ్బత్ కీ దుకాణ్'? పాత రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి అన్నంత పని చేసి, రైతుల కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాడు. ఈ దుస్థితి తెలంగాణకు ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం హామీలివ్వడం, వాటిని గాలికొదలడం తప్ప చేసిందేమీ లేదు. జీఎస్టీలోని అడ్డగోలు స్లాబులతో 8 ఏళ్లలో రూ.15 లక్షల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం స్లాబులు తగ్గించి, ప్రజలను పండుగ చేసుకోమనడం మోసం కాదా?’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రూ.350 ఉన్న సిలిండర్‌ను రూ వెయ్యిరూపాయలకు పెంచిది రూ.65 ఉన్న పెట్రోల్‌ను రూ.100 దాటించింది మోడీ సర్కారేనని విమర్శించారు. వీటి ధరలు తగ్గిస్తే ప్రజలు పండగ చేసుకుంటారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి 8 మంది చొప్పున ఎంపీలు గెలిచినా తెలంగాణకు వచ్చింది గుండు సున్నా అని విమర్శించారు. చంద్రబాబు, మోడీ చెప్పినట్టుగా రేవంత్ ఆడుతున్నారంటూ ఆరోపించారు. చంద్రబాబు మెప్పు కోసమే మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయించకుండా కాలయాపన చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు రూ.70 వేల కోట్లు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు 5 మీటర్లు పెంచడానికి రూ.70 వేల కోట్లు ఖర్చు పెడుతుంటే తప్పులేదు గానీ, కేసీఆర్ 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.93 వేల కోట్లు ఖర్చు చేస్తే లక్ష కోట్ల అవినీతి జరిగిందని అబద్ధాలు ప్రచారం చేశారని పేర్కొన్నారు. రూ.93 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా సాధ్యమో ప్రజలు కూడా ప్రశ్నించలేదన్నారు. అవినీతి జరిగి ఉంటే బ్యారేజీలు, పంప్‌హౌస్‌లు, సొరంగాలు ఎవరు కట్టారని నిలదీశారు. ఎమ్మెల్యే ఓడిపోయినా ఫర్వాలేదు, కేసీఆర్ గెలిస్తే చాలని ప్రజలు భావించడం వల్లే మనకు ప్రతికూల ఫలితాలు వచ్చాయన్నారు. గంగుల కమలాకర్, వినోద్ కుమార్ కష్టపడి కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తెస్తే కాంగ్రెస్ దాన్ని ఆగం చేస్తోందని విమర్శించారు. డాక్టర్ గౌతమి రెడ్డి స్ఫూర్తితో విద్యావంతులు, యువత రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణను కాంగ్రెస్, బీజేపీల నుంచి కాపాడుకోవాలన్నారు. 'స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష' అన్న జయశంకర్ సార్ మాటలను నిజం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు, నీళ్లు, యూరియా ఎలా వచ్చాయి? కాంగ్రెస్ రాగానే ఎందుకు కరువయ్యాయి? రేవంత్ రెడ్డికి సత్తా లేకపోవడమే ఇందుకు కారణమని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేకపోతున్నదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. అయితే బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీల అమలు సంగతేమిటి? అన్న చర్చ సాగుతోంది. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇవ్వడం,పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రైతుల రుణమాఫీ, దళితులకు మూడు ఎకరాల భూమి వంటి హామీలు ప్రజల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తున్నది.
దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైంది?
2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తానని ప్రజల ముందు ప్రతిజ్ఞ చేశారు. దళితులు రాష్ట్ర జనాభాలో 16 శాతాన్ని కలిగి ఉండటం, వారి ఓట్లు ఎలక్షన్లలో కీలకమని తెలిసినప్పటికీ, ఈ హామీ అమలు కాలేదు. గతంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ విషయాన్ని ఎత్తి చూపి, "కేసీఆర్ దళితులను మోసం చేశారు" అని ఆరోపించారు. ఈ హామీ విఫలం కావడం వల్ల బీఆర్ఎస్‌కు 2023లో దళిత ఓట్లు పోగొట్టుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అందరికీ ఇచ్చారా?
పేదలకు గౌరవ జీవనం కల్పించాలని 2015లో ప్రారంభించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం బీఆర్ఎస్ పాలనలో ముఖ్య హామీగా నిలిచింది. మొత్తం 3 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రణాళిక, కానీ 2023 వరకు కేవలం 1.5 లక్షలు మాత్రమే పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లాలో 7,229 ఇళ్లు ఇస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పినప్పటికీ.. 6,107 మాత్రమే నిర్మాణానికి నోచుకున్నాయి. అయితే వాటిలో కూడా నాణ్యత లోపించడం.. పూర్తిస్థాయిలో ఆ ఇండ్లను పంపిణీ చేయలేకపోవడం.. కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చారన్న ఆరోపణలు రావడం, ఇండ్ల పంపిణీలో పారదర్శకత లోపించిందని..బీఆర్ఎస్ నేతలు డబ్బులు తీసుకొని ఇండ్లు ఇచ్చారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.
రుణమాఫీ అంతంత మాత్రమే..
రైతుల రుణమాఫీ బీఆర్ఎస్ పాలనలో కీలక హామీ. 2018-19లో రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి, మొత్తం రూ.16 వేల కోట్లు విడుదల చేశారు. కానీ, 35 లక్షల రైతులకు మాత్రమే ప్రయోజనం చేరింది. ఆ హామీ పూర్తి అమలు కాలేదు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రూ.2 లక్షల వరకు మాఫీని 2024 ఆగస్టులో ప్రకటించారు ఈ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. మరి బీఆర్ఎస్ పాలనలో హామీల అమలు మాటలేమిటి? అన్నది కాంగ్రెస్ ఆరోపణ. దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి ఇస్తామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ, 2021లో కేసీఆర్ అసెంబ్లీలో "ఇలాంటి హామీ ఇవ్వలేదు" అని చెప్పుకున్నారు. వాస్తవానికి, భూమి అందుబాటులో లేకపోవడం, ప్రైవేట్ భూముల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల అమలు కాలేదని హరీశ్ రావు చెప్పారు. అయితే, మొదటి సంవత్సరంలో 959 దళితులకు 2,524 ఎకరాలు కేటాయించారు, కానీ పూర్తి లక్ష్యం 18 లక్షల కుటుంబాలు. కాంగ్రెస్ నేతలు "బీఆర్ఎస్ దళితులను మోసం చేసింది" అని ఆరోపిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ రెండు పార్టీలు హామీల అమలు విషయంలో నిర్లక్ష్యం చేశాయని ప్రజలు చర్చించుకుంటుండం గమనార్హం.
