Let's talk: editor@tmv.in
యూర‌ప్ విమానాశ్ర‌యాల‌పై సైబ‌ర్ దాడి

యూర‌ప్ విమానాశ్ర‌యాల‌పై సైబ‌ర్ దాడి

Venkatesh Balusula
21 సెప్టెంబర్, 2025

యూరోపియ‌న్ దేశాల్లోని విమానాశ్ర‌యాలే ల‌క్ష్యంగా సైబ‌ర్ నేర‌గాళ్లు కుట్ర‌కు పాల్ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో లండ‌న్‌, బ్ర‌స్సెల్స్ స‌హా ప‌లు ముఖ్య‌ దేశాల్లో విమాన‌యాన సేవ‌ల‌కు అంత‌రాయం క‌లిగింది. శనివారం యూరప్‌లోని పలు విమానాశ్రయాల్లో సైబర్ దాడి జ‌రిగిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. దుండ‌గులు ప్ర‌యాణికుల చెక్ ఇన్, బోర్డింగ్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్ప‌డ్డార‌న్నారు. దీని వల్ల విమాన షెడ్యూళ్లలో అంత‌రాయం ఏర్పడింది.

బ్రస్సెల్స్ విమానాశ్రయం ఒక ప్రకటనలో ఈ సైబర్ దాడి కారణంగా ప్ర‌యాణ ప్ర‌క్రియ‌ల‌ను సాంప్ర‌దాయంగా నిర్వ‌హించాల్సి వ‌చ్చింద‌ని తెలిపింది. ఇది విమాన షెడ్యూళ్లపై పెద్ద ప్రభావం చూపిందని పేర్కొంది. సెప్టెంబర్ 19, శుక్రవారం రాత్రి, చెక్ ఇన్, బోర్డింగ్ వ్యవస్థల సర్వీస్ ప్రొవైడర్‌పై సైబర్ దాడి జరిగింది. దీని వల్ల బ్రస్సెల్స్ విమానాశ్రయంతో సహా యూరప్‌లోని పలు విమానాశ్రయాలు ప్రభావితమయ్యాయ‌ని పేర్కొన్నారు. బెర్లిన్‌లోని బ్రాండెన్‌బర్గ్ విమానాశ్రయం అధికారులు శుక్రవారం సాయంత్రం ప్రయాణికుల సేవల వ్యవస్థల సర్వీస్ ప్రొవైడర్‌పై దాడి జరిగిందని, దీంతో వ్యవస్థల సంబంధాన్ని తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. యూరప్‌లో అత్యంత రద్దీగా ఉండే లండన్ హీథ్రో విమానాశ్రయం కూడా ఈ దాడికి ప్ర‌భావిత‌మైంది. అక‌స్మాత్తుగా అన్ని విమానాశ్ర‌యాల్లో ఒకే విధ‌మైన స‌మ‌స్య‌ ఏర్ప‌డ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఫ్రాన్స్‌లోని పారిస్ ప్రాంతంలో రోయిస్సీ, ఓర్లీ, లే బోర్జెట్ విమానాశ్రయాల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదు. పలు యూరప్ విమానాశ్రయాలు విమానాల షెడ్యూళ్ల‌ను మార్చి, ప్రయాణికులు తమ విమాన స్థితిని మ‌ళ్లీ తనిఖీ చేసుకోవాలని, అసౌకర్యం క‌లిగించినందుకు క్షమాపణలు తెలియజేస్తూ ప్రకటనలు విడుద‌ల‌ చేశాయి.

స్పందించిన సర్వీస్ ప్రొవైడర్

సైబ‌ర్ దాడికి గురైన యూర‌ప్ దేశాల‌ విమానాశ్రయాలకు కొలిన్స్ ఏరోస్పేస్ సంస్థ చెక్ ఇన్‌, బోర్డింగ్ సేవ‌లు అందిస్తుంది. ఇది అమెరికాకు చెందిన‌ ఏవియేషన్, ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ‌. దీన్ని 2018లో స్థాపించారు. ఇది ఆర్టీఎక్స్ కార్ప్ అనుబంధ సంస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద ఏరోస్పేస్, రక్షణ ఉత్పత్తుల సరఫరాదారుల్లో ఒకటిగా ఉంది. ఈ సంస్థ వ్యవస్థ ప్రయాణికులకు నేరుగా చెక్ ఇన్ సేవలను అందించదు. కానీ కియోస్క్‌ల ద్వారా ప్రయాణికులు స్వయంగా చెక్ ఇన్ చేసుకోవడం, బోర్డింగ్ పాస్‌లు, బ్యాగ్ ట్యాగ్‌లు ప్రింట్ చేసుకోవడం, సామాను స్వీకరణ వంటి సాంకేతిక సేవలను అందిస్తుంది. ఈ సైబ‌ర్ దాడి గురించి కొలిన్స్ అధికారికంగా స్పందించింది. త‌మ మ్యూస్‌ సాఫ్ట్‌వేర్‌పై కొన్ని విమానాశ్రయాల్లో సైబర్ దాడి జ‌రిగిన‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, దీని ప్ర‌భావం ఎలక్ట్రానిక్ చెక్ ఇన్, ల‌గేజీ డ్రాప్ వ‌ర‌కే పరిమిత‌మ‌ని తెలిపింది. సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో చెక్ ఇన్ ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని పేర్కొంది. ఈ సైబర్ దాడి యూరప్‌లోని విమానాశ్రయాల పని తీరుపై తీవ్ర ప్రభావం చూపింది. అధికారులు పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికీ వేలాది మంది ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డుతున్నారు. దీని వెనుక విదేశీ కుట్ర ఉందా? అనే కోణంలో అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

యూర‌ప్ విమానాశ్ర‌యాల‌పై సైబ‌ర్ దాడి - Tholi Paluku