Let's talk: editor@tmv.in
యమునా నదిలో పడవ బోల్తా.. 10 మంది మృతి
యమునా నదిలో పడవ బోల్తా.. 10 మంది మృతి
యమునా నదిలో పడవ బోల్తా.. 10 మంది మృతి
యమునా నదిలో పడవ బోల్తా.. 10 మంది మృతి

యమునా నదిలో పడవ బోల్తా.. 10 మంది మృతి

Shaik Mohammad Shaffee
11 ఏప్రిల్, 2026

ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం బృందావనంలో శుక్రవారం పెను విషాదం చోటుచేసుకుంది. యమునా నదిలో యాత్రికులతో వెళ్తున్న పడవ బోల్తా పడిన ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 22 మంది గాయపడ్డారు. మరో ఐదుగురు నదిలో గల్లంతయ్యారు. మృతులంతా పంజాబ్‌లోని లుధియానా, జగ్రావ్ ప్రాంతాలకు చెందిన వారు కావడంతో ఆయా ప్రాంతాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం కేసీ ఘాట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

వేగంగా వెళ్తూ ఢీకొన్న బోటు

పంజాబ్ నుంచి సుమారు 150 మంది యాత్రికుల బృందం రెండు బస్సుల్లో బృందావన దర్శనానికి వచ్చింది. వీరిలో సుమారు 32 మంది సభ్యులు యమునా నదిలో విహరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. నదిలో నీటి మట్టం పెరగడంతో ఇటీవల అక్కడ ఉన్న పాంటూన్ వంతెనను అధికారులు తొలగించారు. అయితే ఆ వంతెనకు ఆధారంగా ఉన్న కొన్ని ఖాళీ డ్రమ్ములు (పాంటూన్లు) నదిలోనే ఉండిపోయాయి. పడవ వేగంగా వెళ్తూ లోతైన ప్రాంతంలో ఈ డ్రమ్ములను బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో ఈదురు గాలులు వీయడంతో పడవ అదుపుతప్పి నీటిలో మునిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

రంగంలోకి సహాయక బృందాలు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సైన్యం కూడా రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలిస్తోంది. ఇప్పటివరకు 10 మంది మృతదేహాలను వెలికితీశారు. వీరిలో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన 22 మందిని బృందావనంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ప్రధాని మోడీ సంతాపం

ఈ ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్ని విధాలా సహకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

పంజాబ్ సర్కారు అప్రమత్తం

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యల గురించి ఆరా తీశారు. లుధియానా జిల్లా యంత్రాంగం బాధితుల కుటుంబాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను (01624-223226, 0161-2403100) ఏర్పాటు చేసింది. లుధియానా నుంచి ప్రత్యేక అధికారుల బృందాన్ని మథురకు పంపినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు జైన్ తెలిపారు.

మృతుల వివరాలు:

కవితా రాణి (49), చరంజీత్ (40), సప్నా హన్స్ (55), రికేష్ గులాటి, మధుర్ బెహల్, ఆశా రాణి, పింకీ బెహల్, అంజు గులాటి, ఇషాన్ కటారియా, మీను బన్సల్.

గల్లంతైన వారు:

మణిక్ టాండన్, పంకజ్ మల్హోత్రా, రిషబ్ శర్మ, యష్ భల్లా, మోనిక కోసం గాలింపు కొనసాగుతోంది.