
యుద్ధాలు సమస్యలను పరిష్కరించవు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై 50 నుంచి 100 శాతం వరకు సుంకాలు విధించాలని నాటోకు సూచించడంపై చైనా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా రష్యా చమురు కొనుగోళ్లు చేయొద్దని ట్రంప్ ఈ సుంకాల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మత్రి వాంగ్ యీ మాట్లాడుతూ యుద్ధాలు సమస్యలను పరిష్కరించవని, ఆంక్షలు పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తాయని, చైనా యుద్ధంలో పాల్గొనబోదని స్పష్టం చేశారు.
చైనా, యూరప్ శత్రువులు కాదు
స్లోవేనియా డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి తాన్యా ఫాజన్తో సమావేశం అనంతరం లుబ్లియానాలో జరిగిన పత్రికా సమావేశంలో వాంగ్ యీ మాట్లాడారు. చైనా యుద్ధాల్లో పాల్గొనదని, యుద్ధాల కోసం ప్రణాళికలు కూడా చేయదని ఆయన పేర్కొన్నారు. శాంతి చర్చలను ప్రోత్సహించడం, సంక్షోభ ప్రాంతాల్లో రాజకీయ పరిష్కారాలకు మార్గం సుగమం చేయడమే తమ కర్తవ్యమన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు గందరగోళంగా, నిరంతర ఘర్షణలతో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బహుళవాదాన్ని ప్రోత్సహించాలని, ఐక్యరాజ్య సమితి విధానాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. చైనా, యూరప్ శత్రువులు కాదని, ఇరు దేశాల మధ్య మైత్రి ఉందని గుర్తు చేశారు. పరస్పర సహకారంతో అభివృద్ధి కోసం కలిసి పని చేయాలన్నారు. ఈ శతాబ్దంలో జరుగుతున్న పెద్ద మార్పుల్లో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు.
షీ జిన్ పింగ్పై ట్రంప్ విమర్శలు
ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో "రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగిసిన తర్వాత ఈ సుంకాలు తొలగించబడతాయి. చైనా రష్యాపై బలమైన పట్టు కలిగి ఉంది, ఈ సుంకాలు ఆ పట్టును బద్దలు కొడతాయి" అని పేర్కొన్నారు. ఇది రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి సహాయపడుతుందని ఆయన భావించారు. ఇటీవల చైనా అతిపెద్ద సైనిక ప్రదర్శన నిర్వహించింది. ఇందులో ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జాంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొన్నారు. ఈ పరిస్థితుల తర్వాత ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను అమెరికాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. అనంతరం మళ్లీ మాట మార్చి చైనా నాయకత్వంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు.
