Let's talk: editor@tmv.in
యుద్ధాన్ని విస్త‌రించేందుకు పుతిన్ కుట్ర‌

యుద్ధాన్ని విస్త‌రించేందుకు పుతిన్ కుట్ర‌

Venkatesh Balusula
26 సెప్టెంబర్, 2025

ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధాన్ని యూర‌ప్ దేశాల‌కు విస్త‌రించేందుకు పుతిన్ కుట్ర చేస్తున్నార‌ని, ప్ర‌పంచ దేశాల‌న్నీ క‌లిసి ర‌ష్యాపై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 80వ స‌మావేశంలో ప్ర‌పంచ నాయ‌కుల‌తో స‌మావేశ‌మైన జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వివిధ దేశాలు అధునాతన ఆయుధాల తయారీలో పోటీ పడుతున్నాయన్నారు. అంతర్జాతీయ సమాజం రష్యా మీద ఇప్పుడే చర్యలు తీసుకోవాలని కోరారు. వ్లాదిమిర్ పుతిన్ యూరప్‌లో యుద్ధం విస్తరించాలని కోరుకుంటున్నాడని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి సహా బలహీన అంతర్జాతీయ సంస్థలు ఉక్రెయిన్, గాజా, సూడాన్ ఇతర ప్రాంతాల్లో యుద్ధాలు ఆపలేకపోయాయన్నారు. అంతర్జాతీయ చట్టాలు దేశాలు బతకడానికి సాయపడలేవని ఆవేదన వ్య‌క్తం చేశారు.

భ‌ద్ర‌తా హామీలు లేవు

ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ఎవ‌రు బ‌తుకుతారో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయ‌ని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. మిత్ర‌దేశాలు, ఆయుధాలు తప్ప భద్రత‌కు ఎలాంటి హామీలు లేవని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జెలెన్ స్కీ సమావేశ‌మ‌య్యారు. ట్రంప్ ఉక్రెయిన్ ప్రయత్నాలకు మద్దతు తెలుపుతూ రష్యాను విమర్శించారు. ఉక్రెయిన్ రష్యా నుంచి కోల్పోయిన భూభాగాలు తిరిగి సాధించవచ్చని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌తంలో ట్రంప్ ఉక్రెయిన్ కొన్ని అంశాల్లో రాజీ ప‌డాల‌ని, యుద్ధం ముగించాలని చెప్పేవారు. ఇప్పుడు ఆయ‌న తీరులో మార్పు వచ్చింది. జెలెన్‌స్కీ అమెరికా మార్పుపై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. కానీ ట్రంప్‌తో మంచి సమావేశం జరిగిందని చెప్పారు. ఇతర శ‌క్తివంత‌మైన‌ నాయకులతో కూడా మాట్లాడానన్నారు. జెలెన్ వ్యాఖ్య‌ల‌తో యుద్ధం ముగింపు కోసం ఆయ‌న తీవ్ర దౌత్యం ఆశిస్తున్నార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. రష్యా ఉక్రెయిన్‌పై ఇటీవ‌ల‌ డ్రోన్, మిస్సైల్ దాడులు చేసింది. అల‌స్కా చ‌ర్చ‌ల అనంత‌రం ఈ దాడుల తీవ్ర‌త మ‌రింత పెరిగింది. దీంతో జెలెన్‌స్కీ మిత్ర దేశాల‌ మద్దతు కోరుతున్నారు. నాటో సాయంతో ఉక్రెయిన్ రష్యా నుంచి కోల్పోయిన భూభాగాలు తిరిగి సాధించవచ్చ‌ని ట్రంప్ భావిస్తున్నారు. అమెరికా, యూరప్ దేశాల‌ మద్దతుకు జెలెన్ స్కీ ధన్యవాదాలు తెలిపారు. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు రష్యాను ఖండించాలని కోరారు. రష్యా వీట‌న్నంటిని లెక్క చేయ‌కుండా యుద్ధం కొన‌సాగిస్తూనే ఉంది.

ఏఐ డ్రోన్ల వినియోగంపై ఆందోళ‌న‌

ఇప్పుడు పుతిన్ యుద్ధాన్ని ఆపకపోతే ఇది మరింత విస్తరిస్తుందని, ఉక్రెయిన్‌తో పాటు యూరప్ అంతా రష్యా డ్రోన్లు తిరుగుతున్నాయని జెలెన్ స్కీ హెచ్చ‌రించారు. రష్యా జోక్యం నుంచి పొరుగు మోల్డోవా తనను రక్షించుకుంటోందని జెలెన్‌స్కీ అన్నారు. జార్జియా బెలారస్‌లా రష్యా మీద ఆధారపడకూడదని చెప్పారు. యూరప్ మోల్డోవాను కోల్పోలేదన్నారు. ఆ దేశానికి ఆర్థిక ఇంధన మద్దతు కావాలని చెప్పారు. రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసినప్పటి నుంచి ఆయుధాలు, డ్రోన్లు దేశ‌ రక్షణ సామర్థ్యం కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని జెలెన్‌స్కీ అన్నారు. డ్రోన్లు ముందు పెద్ద దేశాలు మాత్రమే వాడేవని, ఇప్పుడు డ్రోన్లతో చంపడం తెలిసినవాళ్లు వేలాది మంది ఉన్నారని తెలిపారు. తాజాగా యూరప్ ఎయిర్‌పోర్టులు డ్రోన్ల కార‌ణంగానే మూత‌ప‌డ్డాయ‌ని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. గత వారం ఉత్తర కొరియా టాక్టికల్ డ్రోన్ పరీక్ష చేసిందని, పరిమిత వనరులున్న‌ దేశాలు కూడా ప్రమాదకర ఆయుధాలు తయారు చేయవచ్చని తెలిపారు.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌లో ఆయుధ పోటీతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీల‌కంగా మారాయ‌న్నారు. డ్రోన్లు కీలక మౌలిక సదుపాయాలు, ప్రజల మీద దాడి చేస్తాయన్నారు. మ‌నిషి అవ‌స‌ర‌మే లేకుండా పూర్తి స్వతంత్రంగా పని చేస్తాయని చెప్పారు. సాంకేతికంగా కొంద‌రు మాత్రం వీటిని నియంత్రించ‌డానికి ప‌ని చేస్తార‌ని తెలిపారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రెస్ మాటలు పునరుద్ఘాటించారు.

ఆయుధాల్లో ఏఐ వాడకంపై ప్రపంచ నియమాలు కావాలని కోరారు. అణు ఆయుధాలు వ్యాప్తి నిరోధించినట్లు ఇది అత్యవసరమని చెప్పారు. ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల‌ను డ్రోన్ దాడుల నుంచి రక్షించడం కంటే పుతిన్ యుద్ధాన్ని ఆప‌డం చాలా సుల‌భ‌మ‌ని జెలెన్ స్కీ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌లో పౌరుల‌ను ర‌క్షించుకోవ‌డానికి భూగర్భ పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు నిర్మించాల్సి వచ్చింద‌ని చెప్పారు. ఉక్రెయిన్ వ‌ద్ద‌ పెద్ద మిస్సైళ్లు లేవని జెలెన్‌స్కీ అన్నారు. డ్రోన్లు తయారు చేస్తున్నామని, 2000 నుంచి 3000 కిలోమీటర్లు ప్రయాణించగలవ‌ని, కొన్ని రష్యా మీద వాడామని చెప్పారు. ఉక్రెయిన్ కొత్త భద్రతా వ్యవస్థను నిర్మిస్తోందని జెలెన్‌స్కీ తెలిపారు. ఈ స‌మాఖ్య‌లో 30 దేశాలు ఉన్నాయ‌న్నారు. ఆయుధాలు ఇత‌ర దేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంటామ‌ని, అంత‌ర్జాతీయ సంస్థ‌లు విఫ‌ల‌మైన‌ప్పుడు ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని తెలిపారు.

జెలెన్‌స్కీ మాటలు ప్రపంచ దేశాల‌ భద్రతపై చర్చకు తెర‌లేపాయి. పెద్ద దేశాల‌న్నీ ఆయుధాల త‌యారీపైనే దృష్టి పెడుతున్నాయి. ఇటీవ‌ల చైనాలో జ‌రిగిన సైనిక ప‌రేడ్‌లో అత్యాధునిక ఆయుధాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డం దీనికి ఒక ఉదాహ‌ర‌ణ‌గా భావించ‌వ‌చ్చు. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో ఏఐ డ్రోన్ల సాంకేతికతలపై నియమాలు రావచ్చు. ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఈ అంశాల‌పై మ‌రింత చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. రష్యా మీద ఒత్తిడి పెరిగితే యుద్ధం ముగుస్తుంది.

యూరప్ దేశాల‌పై దాడి జ‌రుగ‌నుంద‌ని జెలెన్ స్కీ హెచ్చ‌రించిన నేప‌థ్యంలో ఆయా దేశాలు మరింత మద్దతిస్తాయి. ప్ర‌స్తుతం నెల‌కొన్న పోటీ నేప‌థ్యంలో ప‌లు దేశాల్లో డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి వేగ‌వంత‌మ‌వుతుంది. ఇతర దేశాలు సారూప్య ఆయుధాలు తయారు చేస్తాయి. అంత‌ర్జాతీయంగా ఆర్థిక భద్రతా వ్యయాలు పెరుగుతాయి. యుద్ధం విస్తరిస్తే అణు ఆయుధాలు, డ్రోన్లతో ముడిపడి ప్రపంచ విపత్తుగా మార‌వచ్చు. జెలెన్‌స్కీ మాటలు భారత్, రష్యా సంబంధాల‌ను కూడా ప్రభావితం చేస్తాయి. భారత్ రష్యా నుంచి చ‌మురు కొనుగోలు చేస్తోంది. భారత‌దేశం రష్యా యుద్దానికి నిధులు స‌మ‌కూరుస్తుంద‌ని ట్రంప్ ఆరోపించారు. కానీ, జెలెన్‌స్కీ మాత్రం భారత్ ఉక్రెయిన్ వైపే ఉంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ర‌ష్యాతో భార‌త్ సంబంధాలు దెబ్బ‌తింటే ఇంధన ధరలు పెరుగుతాయి. మ‌రోవైపు ఏఐ డ్రోన్లు వంటి ఆయుధాలపై నియమాల‌కు భారత్ సైతం మద్దతిచ్చే అవ‌కాశం ఉంది.

యుద్ధాన్ని విస్త‌రించేందుకు పుతిన్ కుట్ర‌ - Tholi Paluku