
యతీంద్ర వ్యాఖ్యలు సీఎం పదవి మార్పు పై చేసింది కాదు: మంత్రి సతీశ్ జర్కిహోలి
తన తండ్రి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయరని, తరువాత సీఎంగా మంత్రి సతీశ్ జర్కిహోలి చేపడతారని కాంగ్రెస్ నేత, కర్ణాటక సీఎం సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర సిద్దరామయ్య బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా గురువారం కర్ణాటక మంత్రి సతీశ్ జర్కిహోలి ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థానంపై యతీంద్ర ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఆయన అహిందపై చేశారని ఆయన తెలిపారు.జర్కిహోలి విలేకరులతో మాట్లాడుతూ యతీంద్ర వ్యాఖ్యలు వెనుకబడిన వర్గాలు, దళితులతో కూడిన మా అహింద సమాజం కోసం చేశారన్నారు. ఆ విషయంలో నాయకత్వం చేపట్టడానికి ఆయన విజ్ఞప్తి చేశారని, అది ముఖ్యమంత్రి పదవి మార్పు గురించి కాదని తెలిపారు. దీంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారయ్యారన్నారు.కొంతమంది పొరపాటుగా అర్థం చేసుకున్నారని వివరించారు. అహింద ఉద్యమం 40-50 సంవత్సరాలుగా కొనసాగుతోంది. భవిష్యత్తులో దాని వ్యూహం మీద చర్చ జరగనుందని కూడా ఆయన చెప్పారు. యతీంద్ర సిద్దరామయ్య ప్రస్తావన, సీఎం స్థానానికి సంబంధించినది కాదు, అహింద సమాజానికి నేతృత్వం వహించే అంశంపైనే మాట్లాడరన్నారు.
యతీంద్ర వ్యాఖ్యలు అహింద సముదాయాన్ని బలపరిచే ఉద్దేశ్యంతో మాత్రమే చేశారని జర్కిహోలి వెల్లడించారు. అహింద అనేది అల్పసంఖ్యాకుల,హిందూలిదవరు,దళితరు(అంటే మైనార్టీలు,ఓబీసీ,ఎస్సీలు) అనే కర్ణాటక సంక్షిప్త రూపం.
బుధవారం యతీంద్ర మాట్లాడుతూ నాన్న 2028 ఎన్నికల్లో పోటీ చేయరు. తర్వాత సెక్యులర్ కాంగ్రెస్ సిద్ధాంతాన్ని అనుసరించే అనేక మంది నాయకులు పార్టీలో ఉన్నారు. మంత్రి సతీశ్ జర్కిహోలి వారిని ముందుండి నడిపించాలి. 2028 తరువాత ఎవరైనా నేతగా ఎదగాలని వ్యాఖ్యనించారు. సైద్ధాంతిక రాజకీయాల్లో నిరంతరం పాల్గొనే వారిలో సతీష్ జార్కిహోలి కూడా ముందున్నారని ఆయన అన్నారు.
