
యూకే పర్యటనలో ట్రంప్కు చేదు అనుభవం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం తన భార్య మెలానియాతో కలిసి మంగళవారం ట్రంప్ లండన్ చేరుకున్నారు. బుధ, గురువారాల్లో యూకేలో కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలు, ఆర్థికపరమైన నిర్ణయాలకు సంబంధించి చర్చలు జరగనున్నాయి. సమావేశాలు ప్రారంభం కాకముందే ట్రంప్కు యూకేలో చేదు అనుభవం ఎదురైంది. ఓ లైంగిక నేరస్థుడితో ట్రంప్ కలిసి ఉన్న ఫోటోలను బ్రిటన్ విండ్సర్ కాస్టిల్పై ప్రదర్శించడం చర్చకు తెరలేపింది.
వేగవంతంగా స్పందించిన పోలీసులు
ట్రంప్ మంగళవారం యూకే చేరుకున్నారు. ఆయన రాకను నిరసిస్తూ కొందరు వ్యక్తులు ట్రంప్, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ కలిసి ఉన్న చిత్రాలను కాస్టిల్ పై ప్రదర్శించారు. ఇదే భవనంలో ట్రంప్ బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. రాజకీయ నేతలకు వ్యతిరేకంగా పని చేసే లెడ్ బై డాంకీస్ అనే గ్రూప్ ట్రంప్ ఫోటోలు, వీడియోలు ప్రదర్శించినట్లు తెలుస్తోంది. విండ్సర్ కాస్టిల్ టవర్పై ఇవి దాదాపు కొన్ని నిమిషాల పాటు ప్రదర్శితమయ్యాయి. ట్రంప్ బ్రిటన్ రాకకు కొద్దిసేపు ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరి ఫోటోలతో పాటు, పలు వార్తా పత్రికల హెడ్లైన్లు. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో కనిపించాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బాధ్యులుగా భావిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. విండ్సర్ కాస్టిల్ చుట్టూ అనధికార కార్యకలాపాలపై కఠినంగా స్పందిస్తున్నామని థీమ్స్ వ్యాలీ పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ ఫెలిసిటీ పార్కర్ చెప్పారు. అధికారులు వేగవంతంగా స్పందించి చిత్రాలను నిలిపివేశారన్నారు.
ట్రంప్ రాకకు ముందే వ్యతిరేకత
ట్రంప్, జెఫ్రీ ఎప్స్టీన్ గతంలో స్నేహితులుగా ఉండేవారు. 2005లో లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఎప్స్టీన్ అరెస్టయ్యారు. అనంతరం విచారణ కొనసాగుతుండగానే 2019లో జైలులోనే అనుమానాస్పదంగా మృతి చెందారు. దీన్ని పోలీసులు ఆత్మహత్యగా తేల్చారు. ఆ తర్వాత ఎప్స్టీన్తో ఉన్న స్నేహం నేపథ్యంలో ట్రంప్పై పలు విమర్శలు వచ్చాయి. దీని నుంచి విముక్తి పొందడానికి ట్రంప్ కష్టపడుతున్నాడు. ఎప్స్టీన్తో దగ్గరి సంబంధాలున్న కారణంగా అప్పట్లో వాషింగ్టన్ అంబాసిడర్ను తొలగించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ యూకేకు చేరుకోకముందే భారీ ఎత్తున నిరసనకారులు సమావేశాలు నిర్వహించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్శనకు వ్యతిరేకంగా వేల మంది లండన్లో నిరసన చేయాలని నిర్ణయించారు. ట్రంప్ భార్యతో కలిసి బుధవారం విండ్సర్ కాస్టిల్లో ఉన్నారు. యూకే ప్రధాని స్టార్మర్ గురువారం ట్రంప్తో భేటీ కానున్నారు.
పత్రికపై పరువు నష్టం దావా
గతంలో ఎప్స్టీన్ మంచి వ్యక్తి అని, తనకు ఎన్నో ఏళ్ల నుంచి తెలుసని చెప్పిన ట్రంప్ తాజాగా వస్తున్న విమర్శల నేపథ్యంలో మాట మారుస్తున్నాడు. కొద్ది రోజులుగా వీరి స్నేహంపై న్యూయార్క్ టైమ్స్ వరుసగా ఆసక్తికర కథనాలు ప్రచురిస్తోంది. దీనిపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తనతో పాటు తన కుటుంబంపై ఈ పత్రిక ఏళ్ల తరబడి అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపిస్తూ పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు లెడ్ బై డాంకీస్ గ్రూప్ చేసిన ప్రదర్శన తీవ్ర చర్చకు తెరలేపింది. ట్రంప్, ఎప్స్టీన్ స్నేహాన్ని మరోసారి గుర్తు చేస్తూ ట్రంప్ను చిక్కుల్లో పడేసింది. 2019లో ఎప్స్టీన్ జైలులో మృతి చెందిన తర్వాత కూడా తనపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎప్స్టీన్ నేరాల స్థాయిని స్పష్టం చేస్తోంది. తాజా ఘటనపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వాస్తవాలు ఎన్ని రోజులైనా చెరిగిపోవని అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం ఇది రాజకీయ కుట్ర అని ఆరోపిస్తున్నారు. అక్కడ ప్రదర్శించిన చిత్రాల్లో ప్రిన్స్ ఆండ్రూ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇది బ్రిటన్ రాజకుటుంబాన్ని వివాదాల్లో పడేసింది. ట్రంప్ గత వివాదాలను స్పష్టం చేస్తున్న ఈ ఘటన ట్రంప్ సందర్శనలో నిరసనలను మరింత ఉద్రిక్తం చేస్తుందని తెలుస్తోంది. అమెరికా, బ్రిటన్ సంబంధాలపై ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.
