Let's talk: editor@tmv.in
యూకేలో ఆధార్ త‌ర‌హా డిజిట‌ల్ ఐడీ

యూకేలో ఆధార్ త‌ర‌హా డిజిట‌ల్ ఐడీ

Venkatesh Balusula
27 సెప్టెంబర్, 2025

యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అక్రమ ఉద్యోగాలను అరికట్టేందుకు తప్పనిసరియైన‌ డిజిటల్ ఐడీ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ ఐడీ లేని వారు యూకేలో ఉద్యోగం చేయలేరని స్పష్టం చేశారు. ఈ పథకం దేశ‌ పౌరులకు, చట్టబద్ధ నివాసితులకు అందుబాటులో ఉంటుందని, కాగిత రికార్డులపై ఆధారపడే సంక్లిష్ట గుర్తింపు తనిఖీలను తొలగిస్తుందని ప్రభుత్వం తెలిపింది. లండన్‌లో జరిగిన గ్లోబల్ ప్రోగ్రెస్ యాక్షన్ సమ్మిట్‌లో స్టార్మర్ మాట్లాడుతూ "ఈ పార్లమెంట్ కాలం చివరి నాటికి కొత్త ఉచిత డిజిటల్ ఐడీ తప్పనిసరి చేస్తాం" అని చెప్పారు. 2029 నాటికి ఈ ఐడీలు స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉంటాయని, ఇవి యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ యాప్, కాంటాక్ట్‌లెస్ మొబైల్ చెల్లింపుల మాదిరిగా పని చేస్తాయని వివరించారు.

ఐడీ లేక‌పోతే ఉద్యోగం గ‌ల్లంతు

డిజిటల్ ఐడీ లేకపోతే యూకేలో ఉద్యోగం చేయడానికి అనుమతి ఉండద‌ని స్టార్మర్ అన్నారు. అక్రమ వలసలపై కఠిన వైఖరి అవలంబిస్తూ, లేబర్ పార్టీ గతంలో వ‌ల‌స‌ల‌పై స్పష్టంగా మాట్లాడడానికి జంకినట్లు అంగీక‌రించారు. "చాలా సంవత్సరాలుగా, అక్రమంగా ఇక్కడకు వచ్చి, షాడో ఎకానమీలో ఉండటం జ‌రిగింది. మేం సత్యాన్ని చెప్పడానికి భ‌య‌ప‌డ్డాము" అని అన్నారు. "మన దేశంలో ఎవరున్నారో తెలుసుకోవాలి. వ‌ల‌స‌ల‌ వ్యవస్థ న్యాయంగా ఉండాలి, లేకపోతే ప్రజల విశ్వాసం కోల్పోతాం" అని ఆయన హెచ్చరించారు. ఈ పథకం భారత్, ఆస్ట్రేలియా, ఎస్టోనియా, డెన్మార్క్‌లలోని డిజిటల్ గుర్తింపు వ్యవస్థల ఉత్తమ అంశాలను ఎంచుకుంటుందని తెలిపారు.భారత్‌లో ఆధార్ కార్డులు సంక్షేమ పథకాల్లో మోసాలు, లీకేజీలను తగ్గించి సంవత్సరానికి 10 బిలియన్ డాలర్లు ఆదా చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఐడీలు ఎప్పటికప్పుడు చూపించాల్సిన అవసరం లేదని, ఉద్యోగ హక్కును నిరూపించడానికి తప్పనిసరి అని అధికారులు చెప్పారు.

ఇక త‌నిఖీలు సుల‌భ‌త‌రం

ఈ డిజిటల్ సిస్టమ్ అక్రమ వలసదారులను ఆకర్షించే క్రిమినల్ ముఠాల‌ను ఎదుర్కొంటుంది. తనిఖీలను సులభతరం చేస్తుంది, నకిలీ పత్రాలను అరికడుతుంది, వ్యాపారాలపై ఇంటెలిజెన్స్ డేటాను సృష్టిస్తుంది అని ప్ర‌భుత్వ కేంద్రం డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది. ఈ ఐడీ డిజిటల్ డ్రైవింగ్ లైసెన్స్‌తో కలిపి అమలు చేస్తారని వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ ఉపయోగించలేని వారికి కూడా సరిపోయేలా ఈ పథకం రూపొందిస్తారని, నిరాశ్రయులు, వృద్ధుల కోసం ప్రత్యేక సలహా కార్యక్రమం ఉంటుందని అధికారులు చెప్పారు. అత్యాధునిక ఎన్‌క్రిప్షన్, ఆథెంటికేషన్ టెక్నాలజీతో భద్రతను నిర్ధారిస్తామని, ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా డిజిటల్ ఐడీని రద్దు చేసి మళ్లీ జారీ చేయవచ్చని తెలిపారు. ఈ డిజిటల్ ఐడీలో పేరు, పుట్టిన తేదీ, జాతీయత, నివాస స్థితి, ఫోటో ఉంటాయి. చిరునామా వంటి అదనపు సమాచారం చేర్చడం గురించి సంప్రదింపులు జరుగుతాయని అధికారులు చెప్పారు.

కీర్ స్టార్మర్ నాయకత్వంలోని లేబర్ ప్రభుత్వం యూకేలో తప్పనిసరి డిజిటల్ ఐడీ పథకం ప్రవేశపెట్టి అక్రమ వలసల‌ను నియంత్రించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నిర్ణ‌యం రాజకీయంగా సున్నితమైన వ‌ల‌స‌ల‌ సమస్యను ఎదుర్కోవడంలో స్మార్క‌ర్ మార్పులో వైఖరిని చూపిస్తుంది. ఇటీవ‌ల యూకేలో జరిగిన వ‌ల‌స‌ల వ్య‌తిరేక ర్యాలీతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తమైంది. అయితే ప్ర‌భుత్వ చ‌ర్య‌లు పౌర స్వేచ్ఛ, గోప్యతపై ఆందోళన రేకెత్తించవచ్చు. ముఖ్యంగా నిరాశ్రయులు, వృద్ధులకు డిజిటల్ టెక్నాలజీ అలవాటు లేని వర్గాల‌ను గంద‌ర‌గోళంలో ప‌డేయ‌వ‌చ్చు. భార‌త్‌లో రూపుదిద్దుకున్న ఆధార్‌కు ప్ర‌శంస‌లు రావ‌డం ఈ ప‌థ‌కం సామ‌ర్థ్యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. ఆధార్ ద్వారా భారత్ సంక్షేమ పథకాల్లో మోసాలను తగ్గించి, ఆర్థిక ఆదాను సాధించినట్లు యూకే ప్రభుత్వం గుర్తించింది. అయితే భార‌త్‌లో మాదిరి గోప్యత, డేటా భద్రత సమస్యలు యూకేలో కూడా ఉత్పన్న‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ఈ పథకం విజయవంతం కావాలంటే, సమగ్రమైన అవగాహన కార్యక్రమాలు, సాంకేతిక సమస్యలను పరిష్కరించడం కీలకం. భారత పౌరుల‌కు ఆధార్ పథకాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 2009లో ప్రవేశపెట్టింది. మొదటి ఆధార్ కార్డు సెప్టెంబర్ 29, 2010న జారీ చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థగా పేరుగాంచింది. భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 1.4 బిలియన్ల మందికి పైగా ఆధార్ నంబర్లు జారీ చేశారు.

యూకేలో ఆధార్ త‌ర‌హా డిజిట‌ల్ ఐడీ - Tholi Paluku