Let's talk: editor@tmv.in
యంత్ర ఇండియా లిమిటెడ్‌కు ‘మినీరత్న కేటగిరీ-1’ హోదా

యంత్ర ఇండియా లిమిటెడ్‌కు ‘మినీరత్న కేటగిరీ-1’ హోదా

Shaik Mohammad Shaffee
3 ఫిబ్రవరి, 2026

రక్షణ రంగంలో స్వయంసమృద్ధి (ఆత్మనిర్భర్ భారత్) దిశగా భారత్ మరో కీలక అడుగు వేసింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన యంత్ర ఇండియా లిమిటెడ్ (వైఐఎల్)కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 'మినీరత్న' కేటగిరీ-1 హోదాను మంజూరు చేశారు. కేవలం నాలుగేళ్ల స్వల్ప కాలంలోనే ఒక ప్రభుత్వ విభాగం నుంచి లాభాలార్జించే కార్పొరేట్ సంస్థగా ఎదిగిన తీరును ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. సంస్థ టర్నోవర్ పెంచడంలో, స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో యాజమాన్యం తీసుకున్న చొరవపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

భారీగా పెరిగిన ఎగుమతులు

2021 అక్టోబర్‌లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ((ఓఎఫ్‌బీ)ను ఏడు కొత్త రక్షణ రంగ సంస్థలుగా (డీపీఎస్‌యూలు) విభజించిన నాటి నుండి యంత్ర ఇండియా అనూహ్య వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది. సంస్థ సాధించిన ఈ ఆర్థిక పురోగతిలో భాగంగా.. 2021-22 ద్వితీయార్థంలో రూ. 956.32 కోట్లుగా ఉన్న అమ్మకాలు, 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా రూ. 3,108.79 కోట్లకు చేరుకోవడం గమనార్హం. కేవలం దేశీయ విక్రయాలకే పరిమితం కాకుండా ఎగుమతుల రంగంలోనూ సంస్థ విశేష ప్రతిభ కనబరిచింది. 2021-22 కాలంలో సున్నాగా ఉన్న ఎగుమతులు, గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ. 321.77 కోట్లకు చేరడం యంత్ర ఇండియా సాధించిన అసాధారణ వృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.

కీలక ఉత్పత్తుల తయారీలో అగ్రగామి

ప్రస్తుతం యంత్ర ఇండియా రక్షణ రంగానికి అవసరమైన కీలక వ్యూహాత్మక ఉత్పత్తుల తయారీలో అగ్రగామిగా కొనసాగుతోంది. ఈ సంస్థ ప్రధానంగా మీడియం, లార్జ్ క్యాలిబర్ మందుగుండు సామగ్రి అసెంబ్లీతో పాటు సాయుధ వాహనాలు, ఆర్టిలరీ గన్‌లు, మెయిన్ బ్యాటిల్ ట్యాంకులకు అవసరమైన కీలక విడిభాగాలను అందిస్తోంది. వీటితో పాటు అత్యాధునిక సాంకేతికతతో కూడిన కార్బన్ ఫైబర్ కంపోజిట్స్, గ్లాస్ కంపోజిట్స్, విభిన్న రకాల అల్యూమినియం మిశ్రమాలను ఉత్పత్తి చేస్తూ దేశీయ రక్షణ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

మినీరత్న హోదాతో పెరగనున్న స్వయంప్రతిపత్తి

మినీరత్న కేటగిరీ-1 హోదా లభించడంతో యంత్ర ఇండియా బోర్డుకు ఆర్థిక అధికారాలు పెరగనున్నాయి. కొత్త ప్రాజెక్టులు, ఆధునికీకరణ, పరికరాల కొనుగోలు కోసం ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే రూ.500 కోట్ల వరకు వ్యయం చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల రక్షణ రంగ తయారీలో సంస్థ మరింత వేగంగా నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది.

సంస్కరణల బాటలో రక్షణ రంగం

రక్షణ తయారీ రంగంలో సామర్థ్యం, ఆవిష్కరణలను పెంచేందుకు 2021లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలనిస్తోంది. అప్పట్లో ఏర్పాటు చేసిన ఏడు కొత్త సంస్థల్లో ఇప్పటికే మునీషన్స్ ఇండియా లిమిటెడ్, ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్, ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ సంస్థలకు 2025 మే నెలలోనే మినీరత్న హోదా దక్కింది. ఇప్పుడు యంత్ర ఇండియా కూడా ఆ జాబితాలో చేరింది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, భారత్‌ను అంతర్జాతీయ రక్షణ తయారీ కేంద్రంగా మార్చాలన్న ప్రభుత్వ ఆశయానికి ఈ పరిణామం మరింత బలాన్ని చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.