Let's talk: editor@tmv.in
మా నినాదం.. హెల్తీ.. వెల్తీ..హ్యాపీ ఏపీ!

మా నినాదం.. హెల్తీ.. వెల్తీ..హ్యాపీ ఏపీ!

FL - YUGDR
18 సెప్టెంబర్, 2025

ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రజారోగ్యానికి ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ తమ ప్రభుత్వ నినాదమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. విశాఖలో ఏర్పాటు చేసిన స్వస్త్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రధాని మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.

మహిళల ఆరోగ్యంపై దృష్టి

ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ "పేదల అభ్యున్నతి, మహిళల ఆరోగ్యం పై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారు. మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సుదీర్ఘకాలం ప్రధానిగా ఉండి మంచి పాలన అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నరేంద్ర మోడీ నాయకత్వంలో 11 ఏళ్లలో మన దేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. 2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి నెంబర్ వన్ గా తయారవుతుంది. వికసిత్ భారత్ కల సాకారంతో పేదరిక నిర్మూలన మనం చూడబోతున్నాం. జీఎస్టీ సంస్కరణలతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది" అన్నారు. దేశానికి సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ పని చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు.

15 రోజుల పాటు ఉచిత వైద్య పరీక్షలు

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని, తద్వారా రాష్ట్రం బాగుంటుందని చెప్పారు. మంచి ఆరోగ్యం కోసం చక్కెర, ఉప్పు, నూనె వాడకాలను తగ్గించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన స్వస్త్ నారీ - సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 15 రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,944 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తల్లీబిడ్డా ఆరోగ్య రక్షణ కోసం కార్డులు జారీ చేస్తామన్నారు. గర్భిణీల సంరక్షణతో పాటు పిల్లలకు టీకాలు వేయడంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. రక్తహీనత, పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తామన్నారు. హైబీపీ, షుగర్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, టీబీ తదితర అన్నిరకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయనున్నట్లు వెల్లడించారు. గైనకాలజీ, ఈఎన్టీ, నేత్ర, డెర్మటాలజీ, సైకియాట్రీ, డెంటల్ సర్జన్, పీడియాట్రిషన్ డాక్టర్లు ఈ శిబిరాల్లో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు.

ప్రజారోగ్యానికి ప్రాధాన్యత

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది ఆరోగ్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.19,264 కోట్ల వ్యయం చేస్తోందని తెలిపారు. దీనిపై మాట్లాడుతూ "ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగో లేకపోయినా ఆ కుటుంబమంతా ఇబ్బంది పడుతుంది. నేటి కాలంలో వైద్య ఖర్చుల కంటే ఆస్పత్రి ఖర్చులే ఎక్కువయ్యాయి. అందుకే ప్రతి కుటుంబానికి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకువచ్చాం. రాష్ట్రంలో అందరికీ రూ.2.5 లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య బీమా కల్పిస్తున్నాం. పేదలకు రూ.25 లక్షల వరకూ వైద్య చికిత్సలకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు భరిస్తుంది. ఈ రోజు నుంచి వచ్చే నెల 16 వరకు 8వ రాష్ట్రీయ పోషణ మాసంగా పాటిస్తున్నాం. ప్రత్యేక థీమ్తో ఆరోగ్య పద్దతులను పాటించేలా చూస్తున్నాం. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి ఆరోగ్య రికార్డులను డిజిటల్గా రూపొందించేందుకు టాటా, గేట్స్ ఫౌండేషన్తో కలిసి ప్రాజెక్ట్ సంజీవని చేపట్టాం. విశాఖలోని మెడ్ టెక్ జోన్ ద్వారా వైద్య పరికరాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి" అని సీఎం అన్నారు.

మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం

మహిళలకు ఓ వైపు సంక్షేమం అందిస్తూనే మరోవైపు వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంట్లో ఎందరు పిల్లుంటే వారందరికీ తల్లికి వందనం ఇచ్చామన్నారు. దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. స్త్రీ శక్తి కింద మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. డ్వాక్రా, మెప్నా సంఘాలతో మహిళల ఆర్థిక స్థితిగతులు మారుస్తున్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళల పొదుపు రూ. 20 వేల కోట్ల పైనే ఉందన్నారు. రుణాలు కట్టని వారు 2 శాతం మాత్రమే ఉన్నారంటే వారి ఆర్థిక క్రమశిక్షణ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని చెప్పారు. లక్షమంది మహిళలను లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. మొదటిసారి ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు ఇవ్వగా ప్రధాని మోడీ మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. విశాఖ వాసులది మంచి మనసు అని, హుద్ హుద్ విపత్తు సమయంలో వారు చూపిన చొరవ, చేసిన సేవను మర్చిపోలేనని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా విశాఖ ఉత్తమ నగరం అని చెప్పుకుంటానన్నారు. విశాఖ దేశంలోనే మహిళలకు సురక్షిత ప్రాంతంగా పేరు తెచ్చుకుందని, త్వరలో ఇక్కడికి గూగుల్ సంస్థ కూడా రానుందని, భవిష్యత్తులో విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు అన్నారు.

మా నినాదం.. హెల్తీ.. వెల్తీ..హ్యాపీ ఏపీ! - Tholi Paluku