Let's talk: editor@tmv.in
మేం అవినీతికి దూరం: ఏఐఎంఐఎం

మేం అవినీతికి దూరం: ఏఐఎంఐఎం

Pinjari Chand
21 సెప్టెంబర్, 2025

తమ నాయకుడైన ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ అవినీతికి చాలా దూరమని, ఆయన ఎప్పుడూ ఎవరినీ మోసం చేయలేదని బీహార్​ ఎంఐఎం అధ్యక్షుడు అఖ్తరుల్​ ఇమాన్​ స్ఫష్టం చేశారు. ఇటీవల పూర్ణియాలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు మా నాయకుడి జోలికి రాలేదు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించడమే. ఆయన ఎప్పుడూ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ మంత్రి కాలేదు. ఆయనకు వచ్చిన నిధులను ప్రజల కోసమే ఖర్చు చేశారు. అటువంటప్పుడు అవినీతికి ఆస్కారమెక్కడుందని తెలిపారు. అలాగే తమ నాయకుడు ఓ న్యాయవాదిగా ప్రజలకు ఆదర్శంగా ఉన్నారని గుర్తు చేశారు.

ఆర్జేడీ నాయకులే బీహార్​ ను దోచుకున్నారు

బీహార్​ లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆర్జేడీ నాయకులే కారణమని ఇమాన్ ఆరోపించారు. మహాఘట్బంధన్​ లో భాగంగా వారు గతంలో జేడీయూతో కలిసి పోటీ చేశారు. సీఎం నితీశ్​ కుమార్​ మధ్యలోనే కూటమిని వదిలి, బీజేపీతో చేయి కలిపారన్నారు. ఒక ముస్లిం వ్యక్తి సీఎం కావడానికి వీళ్లే అడ్డుపడ్డారని విమర్శించారు. ఈ సందర్భంగా రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతో కలిసి వెళుతున్నారు అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈసారి కూడా బీహార్​ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, గతంలో ఐదు ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచినప్పుడు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ మమ్మల్ని సంప్రదించారు, మద్దతు ఇవ్వాలని కోరారు, కానీ అప్పటి ఆర్జేడీకి ప్రస్తుతం తేజస్వీ యాదవ్​ నాయకత్వంలోని పార్టీకి చాలా తేడా ఉందని అన్నారు. ఈ సందర్భంగా బీహార్ ప్రజలు ఎంఐఎంను ఆదరించి, ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని కోరారు.

మేం అవినీతికి దూరం: ఏఐఎంఐఎం - Tholi Paluku