
మ్యూనిచ్‌లో భారత్, కెనడా విదేశాంగ మంత్రుల భేటీ
గత కొంతకాలంగా స్తంభించిపోయిన భారత్-కెనడా సంబంధాలు మళ్లీ గాడిలో పడుతున్నాయి. జర్మనీలో జరుగుతున్న మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌తో శనివారం సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత ధృడంగా పెంచుకోవడం, వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే నెలలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
అడుగులు ముందుకు.. సంబంధాలు పటిష్టం!
2025 సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు ఇరువురు విదేశాంగ మంత్రులు భేటీ కావడం ఇది ఐదోసారి. ఇది ఇరు దేశాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి నిదర్శనమని కెనడా విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంధనం, సాంకేతికత, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని ఇరు దేశాల విదేశాంగ మంత్రులు నిర్ణయించారు. 2025 అక్టోబర్‌లో కుదుర్చుకున్న సంయుక్త రోడ్‌మ్యాప్ అమలులో సాధించిన పురోగతిపై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక స్థిరత్వం కోసం వాణిజ్యాన్ని మరింత వైవిధ్యీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మారిపోయిన సమీకరణాలు
గతంలో జస్టిన్ ట్రూడో హయాంలో ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై చేసిన నిరాధార ఆరోపణలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు కనిష్ఠ స్థాయికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించడం, బహిష్కరించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే గత ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో లిబరల్ పార్టీ నేత మార్క్ కార్నీ విజయం సాధించాక, సంబంధాల పునరుద్ధరణ ప్రక్రియ వేగవంతమైంది. ప్రస్తుతం ఇరు దేశాలు తమ హైకమిషనర్లను తిరిగి నియమించుకోవడం శుభపరిణామం.
వ్యాపార, పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట
భారత్‌ను ఒక కీలక భాగస్వామిగా అనితా ఆనంద్ అభివర్ణించారు. రెండు దేశాలలోని పరిశ్రమలు, కార్మికులు, వ్యాపార సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా సాంకేతిక ఫలాలను పంచుకోవాలని ఈ భేటీలో నిర్ణయించారు. "కెనడా-భారత్ సంబంధాల పురోగతిపై అనితా ఆనంద్‌తో చర్చించడం సంతోషంగా ఉంది" అని జైశంకర్ సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. వచ్చే నెలలో ప్రధాని కార్నీ పర్యటన ఖరారైతే, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన బంధం మరో కొత్త మలుపు తిరగనుంది.
