Let's talk: editor@tmv.in
మౌలిక సదుపాయాల కోసం గిరిజన ఆవేదన: మెడకు ఉరితాళ్లు ధరించి వినూత్న నిరసన

మౌలిక సదుపాయాల కోసం గిరిజన ఆవేదన: మెడకు ఉరితాళ్లు ధరించి వినూత్న నిరసన

Panthagani Anusha
10 జనవరి, 2026

స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా తమ బతుకుల్లో ఎలాంటి మార్పు లేదని కనీస మౌలిక సదుపాయాల కోసం అలమటించాల్సి వస్తోందని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ సమీపంలోని ఐదు గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం, యంత్రాంగం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ శుక్రవారం వారు మెడకు తాళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.

చేతుల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను పట్టుకుని, తమ గ్రామాల అభివృద్ధి కోసం ఆయన తక్షణమే జోక్యం చేసుకోవాలని గిరిజనులు వేడుకున్నారు. ఇక గిరిజన నాయకుడు తుమ్మప్పల నేతృత్వంలో సాగిన ఈ నిరసనలో పురుషులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ బాధను వివరించారు.

ఈ సందర్భంగా తుమ్మప్పల మాట్లాడుతూ విద్యుత్ కనెక్షన్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, సరైన రహదారులు, పారిశుధ్యం వంటి ప్రాథమిక అవసరాలు లేక ఐదు గ్రామాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని తెలిపారు. కనీసం గుర్తించేందుకు ఆధార్ కార్డులు కూడా లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు అందడం లేదని వాపోయారు. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ సేధు మాధవన్‌తో పాటు మండల స్థాయి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని వినతిపత్రాలకే పరిమితమవుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో మార్పు రావడం లేదని ఆరోపించారు.

అడవికి ఆనుకుని ఉన్న తమ గ్రామాల్లో అడవి జంతువుల భయం నీడలా వెంటాడుతోందని రక్షణ కరువై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించకపోవడం వల్లే, తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గ్రామాల్లో విద్యుత్, రోడ్లు, విద్యా, వైద్య సదుపాయాలు కల్పించి తమ బతుకుల్లో వెలుగులు నింపాలని డిమాండ్ చేశారు.