
మౌలానా ఆజాద్ యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ కన్ను: కేంద్రమంత్రి బండి
హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూముల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల యూనివర్సిటీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని నోటీసులు జారీ చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విద్యాసంస్థల భూములను ప్రభుత్వం టార్గెట్ చేయడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ తన ఎక్స్ వేదిక ద్వారా ప్రశ్నించారు. యూనివర్సిటీకి ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన భూములను అమ్ముకోవడానికి ప్రభుత్వం వేస్తున్న తొలి అడుగు ఇది కాదా? అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులకు కనీస వసతులు కల్పించలేని ప్రభుత్వం, గతంలో విద్య కోసం కేటాయించిన భూములను ఇప్పుడు ప్రశ్నించడం అంగీకారయోగ్యం కాదని అన్నారు. పాతబస్తీలోని సల్కం చెరువు ఆక్రమణలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ నిలదీశారు. అక్రమంగా చెరువులను ఆక్రమించి విద్యను వ్యాపారంగా మారుస్తున్న ఓవైసీలపై లేని నిఘా, యూనివర్సిటీలపై ఎందుకు అని ప్రశ్నించారు.
విద్యాసంస్థల భూముల జోలికి రావడం అంటే అది 'రెడ్ లైన్' దాటడమేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. యూనివర్సిటీ భూములను స్వాధీనం చేసుకునే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతాం అని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన ప్రాంతాలను స్వాధీనం చేసుకుని ప్రజల అవసరాలకు వాడాలి తప్ప, నడుస్తున్న యూనివర్సిటీలను వేధించడం సరికాదని ఆయన హితవు పలికారు.
రంగారెడ్డి జిల్లా అధికారుల ద్వారా గత నెలలో ఈ నోటీసులను జారీ చేసింది, 1998లో విశ్వవిద్యాలయానికి భూమి కేటాయించినప్పటి నుండి, ఇప్పటివరకు ఆ 50 ఎకరాలను ఎందుకు వినియోగించలేదో తెలపాలని అందులో పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వడం అంటే భూములను వెనక్కి తీసుకోవడం కాదని, ఇది ఒక 'రిమైండర్' లాంటిదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 28 ఏళ్ల క్రితం కేటాయించిన భూమి ఖాళీగా ఉంటే, దానిని విద్యార్థుల ప్రయోజనం కోసం వాడాలని గుర్తు చేయడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు.
ఒకవేళ విశ్వవిద్యాలయం ఆ భూమిని ఎలా వినియోగించబోతుందో ప్రణాళికలు సమర్పిస్తే, ఈ నోటీసుల ప్రక్రియను ముగించేస్తామని అధికారులు తెలిపారు. యూనివర్సిటీ కోరిన రెండు నెలల సమయానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. కృష్ణారావు బీఆర్‌ఎస్ నేతలపై కూడా మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కొన్ని భూముల కేటాయింపులు, పర్మిషన్లు ఇచ్చిన నిర్ణయాలపై సైతం ప్రశ్నలు ఎదుర్కొంటుందని ఆయన విమర్శించారు. మీరు డబ్బు కోసం మాత్రం ప్రభుత్వాన్ని ప్రేరేపించారు అని అన్నారు.
ఉర్దూ యూనివర్సిటీ భూములపై కేటీఆర్ ఆగ్రహం: రాహుల్ గాంధీకి సూటి ప్రశ్న
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములకు ప్రభుత్వం నోటీసులు ఇవ్వడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. విద్యా ప్రయోజనాల కోసం కేటాయించిన 50 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా గుంజుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. వేలాది మంది విద్యార్థుల ఆశలను ఈ ప్రభుత్వం కాలరాస్తోందని ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ.. మీ ప్రభుత్వం తెలంగాణలో ఏం చేస్తోందో గమనిస్తున్నారా? మైనార్టీలు విద్య పట్ల మీకున్న చిత్తశుద్ధి ఇదేనా? అని నిలదీశారు. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వం అభాసుపాలైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.హెచ్‌సీయూలో పచ్చని అడవిని బుల్డోజర్లతో ధ్వంసం చేసి, వన్యప్రాణులను పొట్టనబెట్టుకుని జాతీయ స్థాయిలో పార్టీకి అవమానం తెచ్చారని, అయినా కాంగ్రెస్ తీరు మారలేదని కేటీఆర్ విమర్శించారు. విద్యాసంస్థల భూములను కాపాడటమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
