Let's talk: editor@tmv.in
మోహన్ లాల్​కు కేరళ హైకోర్టులో ఎదురుదెబ్బ

మోహన్ లాల్​కు కేరళ హైకోర్టులో ఎదురుదెబ్బ

Pinjari Chand
25 అక్టోబర్, 2025

కేరళ హైకోర్ట్ లో నటుడు మోహన్‌లాల్ కు, ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన వద్ద ఉన్న ఏనుగు దంతాలకు సంబంధించి ఎటువంటి అనుమతి లేనందున దంతాలు ఆయన ఉంచుకునే హక్కును కోర్టు రద్దు చేసింది. ఏనుగు దంతాలను ఉంచుకోవడం నేరం. అయితే ప్రత్యేక అనుమతితో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఈ కేసు వివరాల్లోకి వెళితే 2011లో మోహన్‌లాల్ నివాసంలో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ సోదాలు నిర్వహించి ఆయన నివాసంలో నాలుగు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో మోహన్ లాల్ వద్ద ఎటువంటి చట్టబద్ధమైన లైసెన్స్ లేదు. ఆ తర్వాత 2015లో మోహన్‌లాల్ కు చట్టబద్ధత కల్పించేందుకు కేరళ ప్రభుత్వం ఆయన పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించి పోసెషన్ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే ఆ ప్రాసీజురల్ సాంకేతిక లోపాలు ఉన్నందున, గెజిట్ లో ప్రకటించనందున కోర్టు ఆయన లైసెన్స్ రద్దు చేసింది. ప్రభుత్వం తప్పు సరిచేసి, కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని హైకోర్ట్ ఆదేశించింది. ఈ నిర్ణయంతో మోహన్‌లాల్ ఇప్పటి వరకు ఏనుగు దంతాలను ఉంచుకునే హక్కును చట్టబద్ధంగా కోల్పోయారు.

తమిళ, మళయాల నటుడైన జయరాం తను పెంచుకున్న ఏనుగు అయిన పెరుంబవూర్ కన్నన్ కి సంబంధించిన ఒక దంతాలు ఉంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఏనుగు దంతాల చట్టపరమైన నిబంధనలు

భారతదేశంలో ఏనుగు దంతాలు వన్యప్రాణుల రక్షణ చట్టం — వైల్డ్​ లైఫ్ (ప్రోటెక్షన్​) చట్టం, 1972 — ప్రకారం కఠినంగా నిషేధించారు.

ముఖ్యమైన నిబంధనలు

ఏనుగు దంతాలను కొనడం, అమ్మడం, బహుమతిగా ఇవ్వడం లేదా దగ్గర ఉంచుకోవడం కూడా నిషేధం. అవి చట్టపరంగా వైల్డ్ లైఫ్ ట్రోఫీస్ గా పరిగణించబడతాయి.

అయితే 1972 చట్టం అమల్లోకి రాకముందు ఎవరి వద్దైనా దంతాలు ఉన్నట్లయితే, వారు వాటిని అటవీ అధికారుల వద్ద నమోదు చేసి తమ దగ్గర ఉంచుకోవడానికి పోసెషన్ సర్టిఫికెట్ పొందితే చట్టబద్ధంగా ఉంచుకోవచ్చు.