Let's talk: editor@tmv.in
మోమోల పిచ్చి.. కుటుంబానికి రూ.85 లక్షల నగల నష్టం

మోమోల పిచ్చి.. కుటుంబానికి రూ.85 లక్షల నగల నష్టం

Pinjari Chand
3 ఫిబ్రవరి, 2026

ఒక ఏడో తరగతి విద్యార్థికి ఉన్న మోమోల పట్ల మోజు చివరికి అతని కుటుంబానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా భగవాన్‌పూర్ తివారి గ్రామంలో, మోమోల కోసం ఓ బాలుడిని మోసం చేసి ఇంట్లోని బంగారు నగలు తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో సుమారు రూ.85 లక్షల విలువైన ఆభరణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. రాంపూర్ కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆదివారం బయటపడింది. బాలుడి అత్త ఇంటికి వచ్చి తన నగల గురించి అడగడంతో కుటుంబ సభ్యులు అల్మారాను తెరిచి చూడగా, అందులో ఉన్న అన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. బాలుడిని ప్రశ్నించగా, డియోరియా–కాస్యా రహదారిపై ఉన్న దుమ్రీ చౌరాహాలో మోమో స్టాల్ నడిపే ముగ్గురు యువకులకు నగలు ఇచ్చినట్లు చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు.

గ్రామంలో చదువుకుంటున్న ఈ బాలుడు తరచూ మోమోలు తినే అలవాటు పెంచుకున్నాడని, మొదట నగదు తీసుకుని మోమోలు విక్రయించిన స్టాల్ నిర్వాహకులు, డబ్బు అయిపోయిన తర్వాత ఇంటి నుంచి నగలు తీసుకురావాలని ప్రలోభ పెట్టారని పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల పాటు బాలుడు ఇంట్లోని అల్మారాలో ఉన్న బంగారు ఆభరణాలను ఒక్కొక్కటిగా తీసుకెళ్లి వారికి ఇచ్చినట్లు విచారణలో తేలింది. బాలుడి తండ్రి విమలేశ్ మిశ్రా (వారణాసీలో ఆలయ పూజారి) ఫిర్యాదు మేరకు, ముగ్గురు నిందితులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 305 (దొంగతనం) కింద కేసు నమోదు చేశారు.

రాంపూర్ కార్ఖానా ఎస్‌హెచ్‌ఓ దేవేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు చేపట్టాం. ఒక యువకుడు, ఒక మహిళను అరెస్ట్ చేశాం. వారి సూచనల మేరకు కొంత నగల్ని స్వాధీనం చేసుకున్నాం. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. సర్కిల్ ఆఫీసర్ సునీల్ రెడ్డి కూడా అరెస్టులను ధృవీకరిస్తూ, మిగిలిన నిందితుడిని త్వరలో పట్టుకుని, మిగతా నగల్ని కూడా రికవరీ చేస్తామని చెప్పారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, చిన్నపిల్లలను ప్రలోభాలకు గురిచేసే ఇలాంటి చర్యలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.