Let's talk: editor@tmv.in
మోదీ, షా దేశాన్ని నాశనం చేస్తారు: ఖర్గే

మోదీ, షా దేశాన్ని నాశనం చేస్తారు: ఖర్గే

Pinjari Chand
14 ఆగస్టు, 2026

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. మోదీ, షా కలిసి దేశాన్ని నాశనం చేస్తారని, భవిష్యత్‌ తరాలకు ఏమీ మిగల్చరని ఆరోపించారు. పార్లమెంట్‌లో విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. ‘రచనాత్మక కాంగ్రెస్‌’ విభాగం నిర్వహించిన సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ.. స్వాతంత్య్రం తర్వాత దేశ నిర్మాణంలో కాంగ్రెస్‌, ఆ పార్టీ నేతలు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ మతం పేరుతో ప్రజలను విభజిస్తున్నాయని ఆరోపించారు.

‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఒకటే’

ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుతోనే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఖర్గే అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు తమకు ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం లేదని, మోదీ నాయకత్వంలోనే బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని చెప్పారని పేర్కొన్నారు. అదే సమయంలో బీజేపీ తమ వల్లే ఉందని ఆర్‌ఎస్‌ఎస్‌ చెబుతోందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఒకే నాణేనికి రెండు వైపులని, మతం పేరుతో ప్రజలను విభజించేందుకు రెండూ కలిసి పనిచేస్తున్నాయని ఖర్గే ఆరోపించారు.

‘నాటి ప్రభుత్వాలు చర్చకు అవకాశం ఇచ్చాయి’

1958 ఏప్రిల్‌ 23న ఢిల్లీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటనను ఖర్గే ప్రస్తావించారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ఘటనను పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారని, దానిపై సభలో చర్చ జరిగి ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని గుర్తుచేశారు. ‘నేడు వేలాది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు, కాల్పులను ఎదుర్కొంటున్నారు.. బాలికలను వీధుల్లోకి ఈడ్చుకెళ్తున్నారు. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదు. ఇదే కాంగ్రెస్‌, బీజేపీ మధ్య తేడా’ అని వ్యాఖ్యానించారు.

‘20 రోజుల పాటు సభకు రాలేదు’

వర్షాకాల సమావేశాల్లో సుమారు 20 రోజుల పాటు మోదీ, అమిత్‌ షా సభకు హాజరు కాలేదని ఖర్గే ఆరోపించారు. బయట మాత్రం చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారని విమర్శించారు. పార్లమెంట్‌లో మీ ఛాంబర్‌లో కూర్చోవడానికే మిమ్మల్ని హోంమంత్రిని చేశారా? అంటూ అమిత్‌ షాను ప్రశ్నించారు.

నెహ్రూపై విమర్శలను ఖండించిన ఖర్గే

దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. నెహ్రూను విమర్శించే బీజేపీ నేతలపై ఆయన మండిపడ్డారు. నెహ్రూ కాలంలో పుట్టని వారు ఆయన గురించి తమ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవాలని సూచించారు.

‘దేశాన్ని ఎవరు నిర్మించారు.. ఎవరు నాశనం చేస్తున్నారు?’

ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు ఎప్పుడూ దేశాన్ని బానిసత్వంలో ఉంచాలని కోరుకున్నారని ఖర్గే ఆరోపించారు. దేశాన్ని ఎవరు నిర్మించారు, ఎవరు నాశనం చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. టీవీల్లో పాన్‌మసాలా, నూనె తదితర ఉత్పత్తుల ప్రకటనలకు బదులు దేశ విజయాలు, స్వాతంత్య్ర సమరయోధులు, వారి ఆదర్శాలను ప్రచారం చేయాలని సూచించారు. తద్వారా దేశభక్తి కలిగిన యువతను తీర్చిదిద్దవచ్చన్నారు. “కేవలం ‘మోదీ భక్తుడిగా’ ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీ దేశ నిర్మాణానికి చేసిన కృషిని ప్రజలకు వివరించాలని, పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయాలని ఖర్గే పిలుపునిచ్చారు.