Let's talk: editor@tmv.in
మోదీ ఓటమే కమ్యూనిస్టుల గెలుపు: సీఎం రేవంత్‌రెడ్డి

మోదీ ఓటమే కమ్యూనిస్టుల గెలుపు: సీఎం రేవంత్‌రెడ్డి

Pinjari Chand
8 సెప్టెంబర్, 2026

దేశంలో ప్రజాస్వామ్యాన్ని, పేద ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు కమ్యూనిస్టులు మరింత గట్టిగా పోరాడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్రమోదీ అని, ఆయన ఓటమే కమ్యూనిస్టుల గెలుపని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని ‘ఎస్‌ఐఆర్‌’ పేరుతో ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కామ్రేడ్‌ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు ఎదిగి రైతుల కోసం జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి అని కొనియాడారు. ఆయన మరణం రైతాంగానికి తీరని లోటని అన్నారు. సమస్యలపై లోతైన అవగాహనతో, సంస్కారవంతంగా అంశాలను లేవనెత్తడంలో సారంపల్లికి సాటి ఎవరూ లేరని పేర్కొన్నారు.

రైతాంగం కోసం ఎనలేని పోరాటం

కౌలు రైతుల సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధర కోసం సారంపల్లి ఎంతో పోరాడారని సీఎం తెలిపారు. భూమి సారం నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు ఎదుర్కొనే సమస్యలను పూర్తిగా అర్థం చేసుకున్న ‘ఎన్‌సైక్లోపీడియా’ సారంపల్లి అని అభివర్ణించారు. ఆయన రాసిన పుస్తకాలు, లేవనెత్తిన అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతాంగ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వ్యక్తిగతంగా మల్లారెడ్డి అంటే తనకు ఎంతో అభిమానం ఉందన్నారు.

కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్‌ పరిష్కారం

భూమిలేని నిరుపేదలకు కనీస వేతనం ఉండాలని కమ్యూనిస్టులు పోరాడారని, కనీస వేతన చట్టాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిందని సీఎం పేర్కొన్నారు. ‘దున్నేవాడికి భూమి’ కోసం కమ్యూనిస్టులు పోరాడితే.. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అసైన్డ్‌ భూములను పేదలకు పంపిణీ చేశాయని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 24.56 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను పంపిణీ చేసిందని, అందులో 10 లక్షల ఎకరాలు ఆదివాసీల చేతుల్లో ఉన్నాయని చెప్పారు. ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ పేదలకు పని కల్పించడంతోపాటు, ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని గుర్తు చేశారు. కమ్యూనిస్టులు లేవనెత్తిన అనేక సమస్యలకు కాంగ్రెస్‌ పరిష్కారం చూపిందని తెలిపారు. ఎన్నికల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో కలిసి ఉన్నా.. లేకపోయినా వారి పోరాటం కాంగ్రెస్‌ పార్టీకి ఉపయోగపడిందని వ్యాఖ్యానించారు.

కలిసి మోదీకి వ్యతిరేకంగా పోరాడాలి

దేశంలో నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా గెలవలేనప్పుడు బీజేపీ కొత్త విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ‘ఎస్‌ఐఆర్‌’ పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు.తెలంగాణలో కోటి ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌లో చేసినట్లుగానే తెలంగాణలో చేస్తామని బీజేపీ నాయకులు బహిరంగంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ రాజకీయాలకు ఉపయోగించుకుంటోందని వ్యాఖ్యానించారు.

‘ప్రధాన ప్రతిపక్షం ఎందుకు మాట్లాడటం లేదు?’

ఎస్‌ఐఆర్‌ అంశంపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌‌ఎస్‌ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. దీని వెనుక ఉన్న అవగాహనను కమ్యూనిస్టులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు వేరని.. పేద ప్రజల ప్రాథమిక హక్కులు వేరని అన్నారు. ఇన్నాళ్లుగా పేదల హక్కుల కోసం కమ్యూనిస్టులు పోరాడుతున్నారని, ఎర్రజెండా కనిపిస్తే పేదవాడికి ఒక భరోసా కలుగుతుందని పేర్కొన్నారు. పేద ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు కమ్యూనిస్టులు ముందుండాలని పిలుపునిచ్చారు. ‘మోదీ ఓటమే కమ్యూనిస్టుల గెలుపు’ అని సీఎం వ్యాఖ్యానించారు.

సారంపల్లి పేరు చిరస్థాయిగా..

సారంపల్లి మల్లారెడ్డి సేవలను గుర్తిస్తూ ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కేబినెట్‌ సహచరులతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రైతాంగం, పేద ప్రజల కోసం సారంపల్లి చేసిన సేవలను స్మరించుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు.

మోదీ ఓటమే కమ్యూనిస్టుల గెలుపు: సీఎం రేవంత్‌రెడ్డి - Tholi Paluku