
మోడీ పై రాహుల్ ఆరోపణలు రాజకీయమే.. ఏపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు సయ్యద్ బాషా
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై చేసిన విమర్శలను ఆంధ్రప్రదేశ్ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రపంచ దేశాలతో అత్యున్నత స్థాయి దౌత్య సంబంధాలను నెలకొల్పారని ఆయన ఎవరికీ భయపడే వ్యక్తి కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కాంగ్రెస్ హయాంలో దేశ ప్రయోజనాలను విదేశాలకు తాకట్టు పెట్టింది రాహుల్ గాంధీ పూర్వీకులేనని సయ్యద్ బాషా ఆరోపించారు. గత 60 ఏళ్ల పాలనలో ఏ కాంగ్రెస్ నాయకుడైనా వాణిజ్య ఒప్పందాల కోసం ఎన్నిసార్లు విదేశీ పర్యటనలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీ గత 11 ఏళ్ల కాలంలో అనేక దేశాలను సందర్శించి చర్చలు దౌత్యం ద్వారా దిగుమతి, ఎగుమతి రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించారని పేర్కొన్నారు. నేడు ప్రపంచంలోని ప్రతి దేశం ప్రధాని మోడీ ని గౌరవంగా ఆహ్వానిస్తోందని కానీ రాహుల్ గాంధీ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
కాగా బుధవారం పార్లమెంటులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం దేశ ప్రజల భవిష్యత్తును వదులుకుంటోందని అణు ఒప్పందం విషయంలో ప్రధానిపై తీవ్ర ఒత్తిడి ఉందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా 'ఎప్స్టీన్ ఫైల్స్'లో హర్దీప్ పూరి, అనిల్ అంబానీ పేర్లు ఉన్నాయని ఆరోపిస్తూ అదానీ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. డేటా భద్రత, రైతుల సంక్షేమం, రక్షణ వంటి కీలక రంగాల్లో మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు అసాధారణంగా ఉన్నాయని.. ఆయనపై ఏదో ఒక అదృశ్య శక్తి ఒత్తిడి ఉండటం వల్లే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.
