Let's talk: editor@tmv.in
మోడీ ఎంత ఎక్కువ రాష్ట్రానికి వస్తే… ఎన్డీఏకు అంత ఓటమి: సీఎం స్టాలిన్

మోడీ ఎంత ఎక్కువ రాష్ట్రానికి వస్తే… ఎన్డీఏకు అంత ఓటమి: సీఎం స్టాలిన్

Pinjari Chand
26 ఫిబ్రవరి, 2026

ఎన్నికల సమయంలో మాత్రమే రాష్ట్రానికి వచ్చి ఓట్ల కోసం ప్రధాని ప్రయత్నిస్తారని, కానీ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. బుధవారం ప్రధాని నరేంద్రమోడీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మీరు మీ భవిష్యత్తును నమ్మకంతో నాకు అప్పగించారు. ఆ విశ్వాసాన్ని తప్పక నిలబెట్టుకుంటాను. నాకు ఓటు వేసినవారికే కాదు, ఓటు వేయనివారి కోసం పని చేస్తున్నాను. కానీ కొందరు ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి మీ మద్దతు కోరుతారని వ్యాఖ్యానించారు. ఎన్నికల సీజన్ కావడంతో ప్రధాని తరచుగా తమిళనాడుకు వస్తున్నారని, అయితే ఆ సందర్శనలు ఎన్డీఏకి మేలు చేయవని స్టాలిన్ అన్నారు. ప్రధాని ఎంత ఎక్కువసార్లు తమిళనాడుకు వస్తే, ఇక్కడ ఎన్డీఏ ఓటమి అంత భారీగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి సారి ఆయన వస్తే, తమిళనాడు ప్రజలకు ఆయన రాష్ట్రానికి ఏమి చేయలేదో గుర్తు వస్తుందని వ్యాఖ్యానించారు.

బడ్జెట్ లో రాష్​ట్రానికి నిధులేవీ?

ఇటీవల కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ, గుజరాత్‌కు మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరు చేసి, తమిళనాడు డిమాండ్లను విస్మరించారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్నా, బడ్జెట్‌లో తమిళనాడుకు ఏమీ లేదు. కేబినెట్ సమావేశంలో కూడా మా డిమాండ్లు ఆమోదం పొందలేదని అన్నారు. ఈ ఎన్నికలు తమిళనాడు వర్సెస్ ఎన్డీఏ. తమిళనాడును ఢిల్లీ నుంచి కాకుండా ఫోర్ట్ సెయింట్ జార్జ్ నుంచే పాలించాలి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు దీనిని నిర్ణయిస్తాయని ఆయన పేర్కొన్నారు.

మేం మత సామరస్యాన్ని కాపాడుతున్నాం

రాష్ట్రాన్ని బీజేపీ బలహీనపర్చాలని చూస్తోందని, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి కనిపించదని ఆరోపించారు. కన్యాకుమారిని మత సామరస్యానికి ప్రతీకగా అభివర్ణిస్తూ ఇక్కడ అన్ని మతాల ప్రజలు ఐక్యంగా జీవిస్తున్నారు. మా ‘ద్రావిడియన్ మోడల్’ ప్రభుత్వం ఈ సామరస్యాన్ని కాపాడుతోందని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, మహారాష్ట్రలో రిజర్వేషన్లు రద్దు చేశారని, మణిపూర్‌లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని, అస్సాంలో ముస్లింలపై విద్వేషం పెంచుతున్నారని ఆరోపించారు. ఎవరు ఏమి తినాలో వారు నిర్ణయించాలా? తమిళనాడులో అలాంటి పరిస్థితిని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ మా ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతోందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా కన్యాకుమారి జిల్లాకు పర్యాటకం, మౌలిక సదుపాయాలు, మత్స్యకారుల సంక్షేమం కోసం పలు కొత్త పథకాలను ప్రకటించారు. తాను 14 ఏళ్ల వయసు నుంచి రాజకీయాల్లో ఉన్నానని, 50 ఏళ్ల ప్రజా జీవితం అనుభవంతో ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నానని స్టాలిన్ పేర్కొన్నారు.