Let's talk: editor@tmv.in
మోడీ-షా ‘సంవిధానం’ పై దాడి చేస్తున్నారు:కాంగ్రెస్ ధ్వజం

మోడీ-షా ‘సంవిధానం’ పై దాడి చేస్తున్నారు:కాంగ్రెస్ ధ్వజం

Pinjari Chand
27 నవంబర్, 2025

సంవిధాన దినోత్సవం సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్రంగా విరుచుకుపడింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యాంగ సూత్రాలను ‘కుట్రపూర్వకంగా కాలరాస్తున్నార’ని ఆరోపించింది. దేశవ్యాప్తంగా ఈ రోజును ‘సంవిధాన్ బచావో దివస్’గా జరుపుకుంటున్నట్టు ప్రకటించింది.

రాహుల్ గాంధీ హెచ్చరిక

భారత రాజ్యాంగం కేవలం పుస్తకం మాత్రమే కాదు.. ప్రతి పౌరుడికీ ఇచ్చిన పవిత్ర హామీ. మతం, కులం, ప్రాంతం, భాష, పేద-ధనిక భేదం లేకుండా అందరికీ సమానత్వం, గౌరవం, న్యాయం అందే హామీ అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. పేదలకు, వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగమే రక్షా కవచం. దీనిపై జరిగే ఏ దాడినైనా మొదట నేనే అడ్డుకుంటాను. ఈ రోజు మనందరం ప్రతిజ్ఞ చేద్దాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం అని రాహుల్ స్ఫూర్తివంతంగా పిలుపునిచ్చారు.

మూల సూత్రాలే ప్రమాదంలో – మల్లిఖార్జున్ ఖర్గే

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దేశప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, లౌకికవాదం, సామాజికవాదం ఇవన్నీ రాజ్యాంగ ఆధ్యాత్మికత. వాటిని కాపాడటం ప్రతీ భారతీయుడి బాధ్యత అని స్పష్టం చేశారు. అంబేద్కర్, గాంధీ, నెహ్రూ, పటేల్, నేతాజీ తదితరుల పాత్రను స్మరించుకున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌కు రాజ్యాంగంలో పాత్రే లేదు: జైరాం

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభలో జరిగిన చారిత్రక క్షణాలను గుర్తు చేశారు. 1949 నవంబర్ 26 ఉదయం 10 గంటలకు రాజ్యాంగ సభ అధ్యక్షుడు డా. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘నెహ్రూ, సర్దార్ పటేల్, డా. అంబేడ్కర్‌లు ఈ రాజ్యాంగ నిర్మాణంలో ఆహర్నిశలు కృషి చేశారన్నారు. ఆ రోజు ఆ సభలో ఆర్‌ఎస్‌ఎస్ పేరు ఒక్కసారి కూడా పలుకలేదు. ఎందుకంటే.. రాజ్యాంగ నిర్మాణంలో వారి పాత్ర శూన్యం అని జైరాం రమేష్ ధ్వజమెత్తారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత దాన్ని దెబ్బతీసే పని ఆర్‌ఎస్‌ఎస్ చేసింది. ఆ పనినే ఇప్పుడు మోడీ-షా కొనసాగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్యాంగ మార్పు కోసమే 400 సీట్ల కల: వేణుగోపాల్

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మరింత తీవ్రంగా స్పందించారు. 400 ప్లస్ సీట్లు వస్తే డా. అంబేడ్కర్ సామాజిక న్యాయ దృష్టిని, వ్యక్తి స్వేచ్ఛను, మత నిరపేక్షతను, సమైక్య ఫెడరల్ వ్యవస్థను రాజ్యాంగ ప్రాథమిక స్వరూపాన్నే మార్చేస్తామని బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ బహిరంగంగానే ప్రకటించాయి. ప్రజలు మేలుకొని ఆ కుట్రను అడ్డుకున్నారు. కానీ ఇప్పటికీ ప్రమాదం తొలగిపోలేదని హెచ్చరించారు. ఓటు చోరీ, ఓటరు జాబితాల్లో మార్పులు, ఈసీఐ వంటి స్వతంత్ర సంస్థల దుర్వినియోగం. ఇవన్నీ వారి రాజ్యాంగ వ్యతిరేక ఎజెండా కొనసాగింపే అని వేణుగోపాల్ ఆరోపించారు.

దేశవ్యాప్తంగా కార్యక్రమాలు

కాంగ్రెస్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా రాజ్యాంగ పీఠిక పఠనం, సంవిధాన గౌరవ ర్యాలీలు, సెమినార్లు నిర్వహిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని నినాదాలు చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఈ సందేశం.. రాబోయే రోజుల్లో రాజకీయ పోరును మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మోడీ-షా ‘సంవిధానం’ పై దాడి చేస్తున్నారు:కాంగ్రెస్ ధ్వజం - Tholi Paluku